శాన్వి కోసం చేతులు కలుపుతారా..
close

ప్రధానాంశాలు

శాన్వి కోసం చేతులు కలుపుతారా..

అరుదైన జన్యు వ్యాధి బారిన మరో చిన్నారి
చికిత్సకు రూ. 16 కోట్లు.. సాయం కోసం వేడుకోలు

ఒకే ఒక్క ఇంజక్షన్‌...
సాంత్వననిస్తుంది... సత్తువనిస్తుంది.
ఆ బిడ్డ తన కాళ్లపై తాను నిలబడేలా చేస్తుంది.
కానీ దాన్ని పొందడం ఆషామాషీకాదు. ఎందుకంటే.. దాని ఖరీదు అక్షరాలా రూ.16 కోట్లు.
ఒక సగటు మనిషి కలలో కూడా ఊహించలేని మొత్తం. అంత డబ్బు సమకూర్చుకోలేక, ఆ చిన్నారి పడే నరకాన్ని చూడలేక మౌనంగా రోదిస్తున్నారా తల్లిదండ్రులు..

హైదరాబాద్‌లోని కాచిగూడకు చెందిన దోశిలి వినయ్‌, శిల్పల చిన్నారి శాన్వి. నాలుగున్నరేళ్ల వయసు ఆమెకు. ఈ దంపతులకు రెండేళ్ల వయసున్న మరో బిడ్డ తన్వి ఉంది. వినయ్‌ ప్రైవేటు ఉద్యోగి. శాన్వి పరిస్థితి రెండేళ్ల క్రితం వరకు బాగానే ఉంది. కానీ తర్వాత నుంచి అమ్మను గొంతెత్తి పిలిచేందుకూ సత్తువ చాలేది కాదు. అడుగు కదిపేందుకూ ఇబ్బంది పడేది. శక్తంతా కూడగట్టుకుని నిలుచుందామన్నా నిలువునా కూలిపోయేది. తల్లిదండ్రులు చాలా ఆసుపత్రుల్లో చూపించారు. బలం లేదేమోనని మందులు వాడారు. ఇటీవలే ఓ వైద్యుని సూచనతో నిమ్స్‌ ఆసుపత్రిలో జన్యు పరీక్షలు చేయిస్తే అందులో పాప ఎస్‌ఎంఏ (స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రోపీ) బారిన పడినట్లు తేలింది. దీంతో నగరంలోని రెయిన్‌బో ఆసుపత్రిలో చేర్పించారు తల్లిదండ్రులు.  ఐదేళ్లు నిండేలోపు దీనికి చికిత్స చేయించాలి. అదీ అత్యంత ఖరీదైన ఇంజక్షన్‌తోనే ఆ చిన్నారి నిలబడగలుగుతుంది. విదేశాల నుంచి తెప్పించే దాని ఖరీదు రూ.16 కోట్లు. ఉన్న ఇళ్లు, ఆస్తులమ్మినా కూడబెట్టలేనంత మొత్తం. ఆ చికిత్స ఫలించాలన్నా మరో నాలుగున్నర నెలల్లోనే వెన్నెముకకు ఇంజక్షన్‌ చేయాలని తేల్చేశారు వైద్యులు. ఇంత తక్కువ సమయంలో అంత మొత్తాన్ని సమకూర్చుకునే అవకాశమే లేని ఆ తల్లిదండ్రులు నిస్సహాయంగా ఉండిపోయారు. నీళ్లు నిండిన కళ్లతో బిడ్డ కష్టాన్ని చూడలేక చూస్తున్నారు.

నగరంలో ఇటీవలే ఈ వ్యాధిబారిన పడ్డ మూడేళ్ల అయాన్ష్‌ గుప్తా దాతల సాయంతో పునర్జన్మ పొందాడు. అతని కష్టం తెలిసి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు 63వేల మంది సాయం అందించారు. మూడు నెలల్లోనే రూ.16 కోట్ల పైచిలుకు జమ చేసి చిన్నోడికి ప్రాణం పోశారు. ఈ పసి ప్రాణాన్ని కాపాడేందుకు ఇంపాక్ట్‌గురు నిధి సమీకరణ వేదికతో పాటు సామాజిక మాధ్యమాల్లో మహాయజ్ఞమే జరిగింది.  అలాగే ఏ ఆపన్నహస్తమైనా ఆదుకోకపోతుందా..ఈ చిరుదీపం ఆరిపోకుండా అడ్డుకోకపోతుందా...అని... ఇంత కారుచీకట్లోనూ ఓ చిరు ఆశ.

సాయం చేయాలనుకునే వారు సంప్రదించాల్సిన ఫోన్‌ నంబరు: 8008055788

- ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని