మంత్రి హరీశ్‌కు తప్పిన ప్రమాదం
close

ప్రధానాంశాలు

మంత్రి హరీశ్‌కు తప్పిన ప్రమాదం

కాన్వాయ్‌కి అడ్డొచ్చిన అడవి పందుల గుంపు
పొన్నాల శివారులో రాజీవ్‌ రహదారిపై ఘటన
ఫోన్లో ఆరా తీసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌
ఈనాడు డిజిటల్‌, సిద్దిపేట, న్యూస్‌టుడే, సిద్దిపేట టౌన్‌

రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు ప్రమాదం తప్పింది. రాజీవ్‌ రహదారిపై అడవి పందుల గుంపు అడ్డురాగా ముందు వెళుతున్న కారు డ్రైవర్‌ సడన్‌ బ్రేకు వేయడంతో మంత్రి కాన్వాయ్‌లో వెనుక వస్తున్న రెండు కార్లు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదు. మూడు వాహనాలు మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే చరవాణిలో మంత్రితో మాట్లాడారు. అదనపు ఎస్పీ రామేశ్వర్‌ తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం సిద్దిపేటలో సీఎం పర్యటన ముగిసిన తరువాత రాత్రి 8.30 గంటల ప్రాంతంలో హరీశ్‌రావు హైదరాబాద్‌కు కారులో బయల్దేరారు. కాన్వాయ్‌ సిద్దిపేట అర్బన్‌ మండలం పొన్నాల శివారుకు వచ్చేసరికి హఠాత్తుగా అడవి పందుల గుంపు రోడ్డుపైకి దూసుకొచ్చింది. అప్రమత్తమైన పైలట్‌ వాహనం డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేశారు. ఆ వెనుకే ఉన్న మంత్రి హరీశ్‌రావు ప్రయాణిస్తున్న కారు, బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. వరుసగా మూడుకార్లు ఢీకొనడంతో వెనుక ఉన్న వాహన చోదకుడు మాణిక్యం స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనలో డ్రైవర్లు చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మంత్రి కారు దిగి పరిస్థితిని పరిశీలించారు. ఆ తరువాత మరో వాహనంలో హైదరాబాద్‌ బయల్దేరారు. ఈ ఘటనలో ఓ అడవి పంది చనిపోయింది. ఘటనా స్థలిని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ రాత్రి 10 గంటల సమయంలో పరిశీలించారు. ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని