నేటి నుంచి ఆర్టీసీ అంతరరాష్ట్ర సర్వీసులు
close

ప్రధానాంశాలు

నేటి నుంచి ఆర్టీసీ అంతరరాష్ట్ర సర్వీసులు

ఏపీ, కర్ణాటకలకు బస్సులు
ఏపీ నుంచి సైతం మొదలు
ఆన్‌లైన్లో రిజర్వేషన్‌ సదుపాయం

ఈనాడు, హైదరాబాద్‌, అమరావతి:  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య అంతరరాష్ట్ర బస్సులు సోమవారం నుంచి మళ్లీ మొదలుకానున్నాయి. తెలంగాణలో ఆదివారం నుంచి లాక్‌డౌన్‌ను పూర్తిస్థాయిలో ఎత్తివేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటకకు పాక్షికంగా బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. లాక్‌డౌన్‌, కర్ఫ్యూ కారణంగా గత నెల 5వ తేదీ నుంచి అంతరరాష్ట్ర సర్వీసులు నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉండటంతో ఆ రాష్ట్రానికి ఆ సమయంలోనే బస్సులు నడపాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. బెంగళూరు మినహా కర్ణాటకలోని అన్ని ప్రాంతాలకు వేకువజామున 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు బస్సులు నడపనున్నారు. ఇవి సోమవారం నుంచి శుక్రవారం వరకు నడుస్తాయి.

ఏపీఎస్‌ఆర్టీసీ సైతం సోమవారం నుంచి తెలంగాణకు బస్సులు నడపనుంది. సాయంత్రం 6 గంటలలోపు తెలంగాణలోకి సర్వీసులు రానున్నాయి. తెలంగాణలో బయలుదేరిన బస్సులు ఏపీలోని డిపోలకు సాయంత్రం 6 గంటల్లోపు చేరుకుంటాయి. సోమవారం 120 సర్వీసులు నడిపేలా ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల రద్దీని బట్టి బస్సుల సంఖ్య పెంచనున్నారు. అంతరరాష్ట్ర సర్వీసులకు ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ సదుపాయం సైతం అందుబాటులోకి తెచ్చారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని