ఇదీ రైతురాజ్యం
close

ప్రధానాంశాలు

ఇదీ రైతురాజ్యం

ఎవరెన్ని మాట్లాడినా బంగారు తెలంగాణ సాధిస్తాం
మొరిగేవాళ్లను పట్టించుకోం
నేను ఉన్నంత వరకు సంక్షేమం ఆగదు
భవిష్యత్తులోనూ కొనసాగించేలా రూపకల్పన చేశాం
సిద్దిపేట, కామారెడ్డి పర్యటనల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఈనాడు- సిద్దిపేట, నిజామాబాద్‌, ఈనాడు డిజిటల్‌- కామారెడ్డి: ‘ఈసారి రాష్ట్రంలో పంజాబ్‌ కంటే ఎక్కువగా ధాన్యం పండింది. రైతుల నుంచి 90 లక్షల టన్నుల వడ్లు కొన్నాం. రైతుబంధు, రైతుబీమా పథకాలతో అన్నదాతలకు అండగా నిలుస్తున్నాం. గోదావరి జలాలు రాష్ట్రమంతటా పారేలా కృషి చేస్తున్నాం. రైతురాజ్యమంటే ఇదీ’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.  తాను బతికున్నంత వరకు రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకమూ ఆగదని, భవిష్యత్తులోనూ వాటిని ఎవరూ ఆపకుండా రూపకల్పన చేశామని తెలిపారు. సిద్దిపేట, కామారెడ్డిలలో ఆదివారం ఆయన పర్యటించారు. సిద్దిపేటలో కొత్తగా నిర్మించిన జిల్లా కార్యాలయాల సముదాయం, పోలీస్‌ కమిషనరేట్‌ భవనం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, కామారెడ్డిలో నిర్మించిన సమీకృత కార్యాలయాల సముదాయం, జిల్లా పోలీసు కార్యాలయాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డిలతో కలిసి సీఎం ప్రారంభించారు. రెండు చోట్లా ప్రజాప్రతినిధులందరితో నిర్వహించిన సమావేశాల్లో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా ప్రసంగించారు. తొలుత హెలికాప్టర్‌లో సిద్దిపేట చేరుకున్న ఆయన కార్యాలయాలను ప్రారంభించాక, జిల్లా కలెక్టరు వెంకటరామరెడ్డి, పోలీసు కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌లను వారి కుర్చీల్లో కూర్చోబెట్టి అభినందించారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. తన చేతుల మీదుగా సిద్దిపేటను కొత్త జిల్లాగా మార్చడంతో పాటు ఇప్పుడు కొత్త భవనాలనూ ఇక్కడి నుంచే ప్రారంభించిన సందర్భంగా ఆనందబాష్పాలు వస్తున్నాయంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఒకప్పుడు కరెంటు, నీళ్ల కోసం సిద్దిపేటలో ఎన్నో కష్టాలు పడ్డామని గుర్తు చేశారు. సిద్దిపేట, వరంగల్‌, నల్గొండ, నిజామాబాద్‌లకు పశు వైద్య కళాశాలలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సిద్దిపేటలో మిత్రులు, అధికారులను పేర్లతో సహా సీఎం ప్రస్తావించారు.

చేతనైతే మంచి చేయాలి.. లేకుంటే ఊరుకోవాలి. నేను తప్పు చేస్తే కొత్త రాష్ట్రమైన తెలంగాణలో భావితరాలకు నష్టం జరుగుతుంది. రాష్ట్రాభివృద్ధిపై ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. పాలన అంటే అల్లాటప్పా కాదు.. ఏదైనా పనిచేయాలంటే ధైర్యం ఉండాలి.

- ముఖ్యమంత్రి కేసీఆర్‌

అలా పుట్టిందే రైతుబంధు
‘ఒకప్పుడు ఎరువులు పోలీస్‌స్టేషన్‌లో ఉంచి అమ్మిన దుస్థితి. తెలంగాణ రాకముందు 4 లక్షల టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములు ఉండగా.. అప్పటి మార్కెటింగ్‌ శాఖ మంత్రిగా ఉన్న హరీశ్‌రావుకు చెబితే 25 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు అందుబాటులోకి వచ్చాయి. రైతులకు నేరుగా సాయం అందించమని ఓ మిత్రుడు నాకు సలహా ఇచ్చారు. అలా పుట్టిందే రైతుబంధు. మేం వచ్చాక 5 వేల ఎకరాలకు ఒక ఏఈవోను నియమించాం. ప్రతి క్లస్టర్‌లో ఒక రైతువేదిక నిర్మించాం. రాష్ట్రవ్యాప్తంగా 2,601 వేదికలు అందుబాటులోకి వచ్చాయి. అవి లేవని ఎవరైనా నిరూపిస్తే ఈ క్షణమే రాజీనామా చేస్తా’ అని సీఎం సవాల్‌ చేశారు.

ధరణి కోసం మూడేళ్ల కష్టం
‘ధరణి’ కోసం మూడేళ్లు నేను పడిన కష్టం భగవంతుడికే తెలుసు. పహాణీ తెప్పించి చూస్తే 37 కాలమ్స్‌ ఉన్నాయి. మూడు మాత్రమే ఉంచాలని చెప్పా. వాటిని ముట్టుకోవద్దన్నారు. ఎందుకని అడిగితే ఎవరూ చెప్పరు. ఏమన్నా జరిగితే నాదే బాధ్యత అని చెప్పా. ధరణిలో ఒక్కసారి రైతు పేరు, భూమి వివరాలు నమోదైతే ప్రపంచంలో ఏ శక్తీ ఆ భూమి మీద వేలు పెట్టలేదు. పనుల కోసం ఇప్పుడు పైరవీలు అక్కర్లేదు. పరేషాన్‌ అంతా గోకేటోళ్లు, గీకేటోళ్లదే. తమకు ఏమీ అందకుండా పోతోందనే బాధ వారిలో కనిపిస్తోంది.

బాగా నచ్చిన పథకం రూ.2 బియ్యం
తెలంగాణలో ఎవరూ పస్తులుండట్లేదు. ఒకప్పుడు ఆకలి చావులు ఉండేవి. ఎన్టీఆర్‌ రూ.2కే కిలో బియ్యం పథకం తెచ్చిన తర్వాత ఆ బాధలు పోయాయి. నాకు బాగా నచ్చిన పథకం అది. ఇప్పుడు రూపాయికే బియ్యం అందిస్తున్నాం.

మేధోమథనంతోనే పథకాలు
రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు తీసుకురమ్మని నన్నెవరూ అడగలేదు. మేధోమథనం చేసి అన్ని వర్గాల కోసం ఇవన్నీ చేశాం. యాదాద్రి జిల్లాతో పాటు రాష్ట్రంలో చేపడుతున్న విద్యుదుత్పత్తి యూనిట్లు సిద్ధమైతే ఇతర రాష్ట్రాలకు మనమే సరఫరా చేసే స్థాయిలో ఉంటాం. మిషన్‌ కాకతీయ కోసం తెలంగాణ రాకముందే ఆలోచించాం’ అని సీఎం వివరించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు మహమూద్‌ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, ఎంపీలు బీబీపాటిల్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, ఒడితెల సతీష్‌, రసమయి బాలకిషన్‌, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, హన్మంత్‌షిండే, జాజాల సురేందర్‌, ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌, సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్‌, కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ శ్వేత, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఉప్పల శ్రీనివాస్‌, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సిద్దిపేట జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు.

కొందరు చిల్లర రాజకీయం చేస్తున్నారు. మిడ్‌ మానేరు ప్రాజెక్టు నాసిగా కట్టారంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఇప్పుడు మిడ్‌ మానేరును పూర్తిగా నింపాం. తెలంగాణ అంతటికీ ఖజానా అదే. కాళేశ్వరంపైనా విమర్శలు చేశారు. ఇప్పుడు పెద్దవానలు రాకుండానే రాజరాజేశ్వరంలోకి 9 వేల క్యూసెక్కుల నీటిని తోడుతున్నాం. ప్రజల మనసులో ఉంటే మనం అడగకపోయినా ఓట్లేస్తారు. ఎక్కడ చూసినా చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఇందుకోసమే మనం తెలంగాణ తెచ్చుకున్నది.

దళితులు ఇంకా పేదరికంలోనే ఉన్నారు. అసమానతలు పోవడం లేదు. ఇది మనకు చెడ్డపేరు. వారి అభివృద్ధి కోసం బడ్జెట్లో రూ.1,000 కోట్లు కేటాయించాం. దళిత చైతన్య జ్యోతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. సిద్దిపేట నుంచే ఇది విజయవంతం కావాలి. అగ్రవర్ణాల్లో పేదలుంటే వారికీ సాయం దక్కాలి. సిద్దిపేట వర్థిల్లుగాక. తెలంగాణ వర్థిల్లుగాక.

వరి నాట్ల కన్నా వెదజల్లే పద్ధతి మేలు. నేను నా పొలంలో ఈ పద్ధతిలో ఎకరాకు 42 క్వింటాళ్ల దిగుబడి సాధించా.

మనది ధనిక రాష్ట్రమే. కానీ కరోనాతో అంతా ఆగం అయ్యింది. ఆదాయం తగ్గింది. ఒకప్పుడు రూ. 100 కోట్లడిగినా వెంటనే మంజూరు చేసేవాళ్లం. ఇప్పుడు రూ. 10 ఇవ్వాలన్నా ఆలోచించాల్సి వస్తోంది.

నేను పెళ్లిళ్లకు పోతే సార్‌... మాస్కు తీయండి అంటున్నారు. ఎందుకని అడిగితే.. మీరు మళ్లీ దొరకరు కదా... ఫొటో కోసమని చెబుతున్నారు. మాస్క్‌ తీస్తే కరోనాకు నేను దొరుకుతా అంటూ వారికి చెబుతున్నా.

దేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు నాకంటే దొడ్డుగా ఉన్నారు. మనం కొనుగోలు చేసినట్లు చాలా రాష్ట్రాల్లో క్వింటాలు వడ్లు కూడా కొనలే.

రోడ్లపై గొర్రెల మందలను చూసి ఒకాయన నాతో వాటిని ‘కేసీఆర్‌ గొర్రెలు’ అంటున్నారని చెప్పిండు. ఇంకా నయం... కేసీఆరే గొర్రె అనలేదు’ అని నేను అన్నా.

పేదల ముఖాల్లో చిరునవ్వు... అంతా సుఖసంతోషాలతో జీవించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. ఆ దిశగా ఇప్పటికే కొంత మార్పు వచ్చింది. ఎవరెన్ని మాట్లాడినా బంగారు తెలంగాణ తప్పక సాధిస్తాం. అనవసరంగా మొరిగేవారిని పట్టించుకోను.

‘ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ ఆచితూచి అడుగులు వేస్తున్నాను. మొదట్లో నా కాన్వాయ్‌ వాహనాలు నల్లరంగులో ఉండేవి. నాకు ఆ రంగు బాగుండదని గమనించిన పోలీస్‌ అధికారి మహేష్‌ భగవత్‌ కొత్త వాహనాలు కొనుగోలు చేద్దామని ప్రతిపాదించారు. ఖర్చు ఎందుకని పాత వాటికే తెల్లరంగు వేయాలని సూచించాను. ఇది తెలుసుకున్న నాటి గవర్నర్‌ నరసింహన్‌ నన్ను పిలిచి పిసినారి అన్నారు’

- ముఖ్యమంత్రి కేసీఆర్‌

సీఎం కాళ్లకు మొక్కిన కలెక్టర్లు
తండ్రిలా భావించి ఆశీస్సులు తీసుకున్నానన్న వెంకటరామరెడ్డి

సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: సిద్దిపేట జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవ సందర్భంగా కలెక్టర్‌ వెంకటరామరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాదాభివందనం చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో కలెక్టర్‌ ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. శుభ కార్యక్రమం జరిగినప్పుడల్లా పెద్దల ఆశీస్సులు తీసుకోవడం తెలంగాణ సంప్రదాయమన్నారు. ఫాదర్స్‌ డే కూడా కావడంతో సీఎం కేసీఆర్‌ను తండ్రిలా భావించి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ బిడ్డగా, అధికారిగా అభివృద్ధిని కళ్లారా చూశానని, సీఎం ఆలోచనలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కామారెడ్డిలోనూ కలెక్టర్‌ శరత్‌ సీఎంకు పాదాభివందనం చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని