వైద్యానికి వరంగల్‌
close

ప్రధానాంశాలు

వైద్యానికి వరంగల్‌

మెడికల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం
వరంగల్‌ అర్బన్‌ పేరు హన్మకొండ జిల్లాగా మార్పు
ఓరుగల్లు పర్యటనలో సీఎం కేసీఆర్‌ వెల్లడి
సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన
దంతవైద్య కళాశాల మంజూరు
అర్బన్‌ కలెక్టరేట్‌, కాళోజీ వర్సిటీ కొత్త భవనాల ప్రారంభం
1 నుంచి పల్లె, పట్టణ ప్రగతి
ఈనాడు - వరంగల్‌

ప్రజలిప్పుడు వైద్యం కోసం హైదరాబాద్‌కు పరుగెడుతున్నారు. అక్కడ రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. అందుకే సకల సౌకర్యాలు ఉన్న వరంగల్‌ను మెడికల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం. కాళోజీ వర్సిటీ, కాకతీయ వైద్య కళాశాల, నేత్ర వైద్యశాలతో పాటు కొత్తగా నిర్మించే సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాంగణాన్ని కలిపితే 200 ఎకరాల స్థలం అందుబాటులోకి వస్తుంది. ఇదంతా కలిసి ఓరుగల్లు వైద్య కేంద్రంగా మారుతుంది. ఇందుకోసం రూ.2 వేల నుంచి రూ.3 వేల కోట్లయినా వెచ్చిస్తాం.      

- ముఖ్యమంత్రి కేసీఆర్‌

‘వరంగల్‌ను అద్భుతమైన వైద్య కేంద్రంగా తీర్చిదిద్దాలి. పేదలకు అత్యాధునిక చికిత్స అందించేలా సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తాం. కొత్తగా దంతవైద్య కళాశాల కూడా ఇప్పుడే మంజూరు చేస్తున్నా’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. సోమవారం వరంగల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. హెలికాప్టర్‌లో వరంగల్‌ చేరుకున్న సీఎం తొలుత ఆచార్య జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా హన్మకొండలోని ఏకశిల పార్కులో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తర్వాత కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ పరిపాలనా భవనాన్ని ప్రారంభించారు. సెంట్రల్‌జైలు స్థలంలో నిర్మించతలపెట్టిన 24 అంతస్తుల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి భవనానికి మంత్రులు దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. వరంగల్‌ అర్బన్‌ కలెక్టరేట్‌ భవనాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధ్యక్షతన జరిగిన సభలో కేసీఆర్‌ సుదీర్ఘంగా ప్రసంగించారు.

వరంగల్‌ జిల్లాకు అద్భుత కలెక్టరేట్‌
వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల పేర్లను హన్మకొండ, వరంగల్‌గా మార్చాలని ప్రజాప్రతినిధులు ఎప్పటినుంచో అడుగుతున్నారు. రాజధానిలో జంట నగరాలు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లా ఇక నుంచి హన్మకొండ, వరంగల్‌ ఉంటాయి. అర్బన్‌ జిల్లా కేంద్రం హన్మకొండగా, రూరల్‌ జిల్లా పేరును తొలగించి వరంగల్‌ జిల్లాగా ఏర్పాటు చేస్తాం. దీనికి సంబంధించిన ఉత్తర్వులు రెండు మూడు రోజుల్లో వెలువడతాయి. ఇప్పుడు ప్రారంభించింది హన్మకొండ జిల్లా కార్యాలయం, వరంగల్‌ జిల్లా కలెక్టరేట్ను అజంజాహి మిల్లు ప్రాంతంలో గానీ, ఆటోనగర్‌ ప్రాంతంలో గానీ త్వరలో నిర్మిస్తాం. భవనంపైనే హెలికాప్టర్‌ కూడా దిగేలా అద్భుతమైన కలెక్టరేట్ను నిర్మిస్తాం. కలెక్టర్‌ అనే హోదాను బ్రిటిష్‌ హయాంలో పెట్టారు. ఈ పేరును కూడా మార్చాల్సిన అవసరం ఉంది.

 కెనడా తరహాలో నిర్మించాలి
సెంట్రల్‌ జైలును మరో చోటుకు మార్చి రెండు వేల పడకలతో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నాం. నాకైతే 34 అంతస్తులతో నిర్మించాలని ఉంది. జైలును కూలగొట్టినా కొందరు వక్రీకరిస్తున్నారు. నగరంమధ్య ఉన్న కారాగారాన్ని ఊరి బయటకు మారిస్తే తప్పేంటి. చైనాలో కేవలం 28 గంటల్లో పదంతస్తుల భవనాన్ని నిర్మించారు. ఇక్కడి ఆసుపత్రిని కేవలం ఏడాదిన్నరలో కట్టి ప్రారంభించాలి. అవసరమైతే చైనా ఆసుపత్రి కట్టిన వాళ్లను పిలిపించైనా సరే. కెనడాలో దవాఖానాలు బాగుంటాయని  గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దంపతులు నాకు చెప్పారు. కెనడాకు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు వెళ్లి అధ్యయనం చేసి.. వాటిని తలదన్నేలా వరంగల్‌లో నిర్మించాలి. అత్యవసర స్థితిలో ఎయిర్‌ అంబులెన్సులు సైతం దిగేలా హెలిప్యాడ్‌ను ఆసుపత్రి పై అంతస్తులో నిర్మించాలి. కార్డియాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ఆంకాలజీ.. ఇలా అన్ని రకాల సేవలు అందాలి. పశువైద్య కళాశాలను ఇప్పటికే ప్రకటించాం. . రాష్ట్రం ఏర్పడే నాటికి బాలింతలు, శిశు మరణాల శాతం అధికంగా ఉండేది. దాన్ని గణనీయంగా తగ్గించాం. ఎంజీఎం ఆసుపత్రిని అత్యాధునిక మాతాశిశు సంరక్షణ కేంద్రంగా తీర్చిదిద్దాలి. అవసరమైతే పాత భవనాన్ని కూల్చేసి మరో భవనం నిర్మించాలి. ప్రతి తాలుకాలో మినీ నిలోఫర్‌ లాంటి మాతాశిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి.

 భయపెట్టకండి..

కరోనా భయంతోనే అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని పత్రికలు, టీవీలు ప్రజల్ని భయపెట్టి ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. బ్లాక్‌ ఫంగస్‌, ఎల్లో ఫంగస్‌, వైట్ ఫంగస్‌ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. పిల్లలపై కొవిడ్‌ ప్రభావం చూపుతుందని వదంతులు పుట్టిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను కూడా బద్నాం చేసేలా కొందరు ప్రచారం చేస్తున్నారు. ఉస్మానియా, గాంధీ, ఎంజీఎంలో ఎప్పుడైనా పడకలు ఖాళీగా ఉంటున్నాయా? మరి వైద్యుల సేవలను కొనియాడకుండా ఈ పంథా ఏంటి? ఇటీవల జ్వర సర్వే నిర్వహించినప్పుడు కరోనాకు భయపడకుండా ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లారు. నా రెండు చేతులెత్తి వారి సేవలకు మొక్కుతున్నా. కరోనాను త్వరగా గుర్తిస్తే కేవలం పారాసిటమాల్‌, యాంటీబయాటిక్‌ గోలీలతో తగ్గిపోతుంది. నేను ఆ రెండు మాత్రమే వేసుకుని బయటపడ్డా.

ఉద్యమాన్ని సజీవంగా ఉంచారు

తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్‌ సార్‌ అంటే నాకెంతో ఇష్టం. తొలి దశ నుంచి మలి దశ వరకు తెలంగాణ ఉద్యమాన్ని ఆయన సజీవంగా ఉంచారు. 1969లో ఏ సమావేశం పెట్టినా 30 నుంచి 40 మందికన్నా ఎక్కువ హాజరయ్యేవారు కారని తెలిపేవారు. రాష్ట్రం సిద్ధించే ముందే ఆయన కన్నుమూయడం బాధాకరం అంటూ గుర్తుచేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌... ‘జోహార్‌ జయశంకర్‌’ అని నినదించారు.

కాన్వాయ్‌ని అడ్డుకునేందుకు యత్నం

నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ సోమవారం అర్బన్‌ కలెక్టరేట్‌ సమీపంలో ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న వాహనశ్రేణిని అడ్డుకునేందుకు కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘాల నాయకులు ప్రయత్నించగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో విద్యార్థులు కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేసిన వారిలో టీజీవీపీ కేయూ కార్యదర్శి కె. రాకేశ్‌, కేయూ జాక్‌ ఛైర్మన్‌ ఇట్టబోయిన తిరుపతి, బీఎస్‌ఎఫ్‌ నాయకుడు కొడపాక రాజేందర్‌ ఉన్నారు. వీరిపై హన్మకొండ సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు.

సీఎంను కలిసేందుకు... పెట్రోలు సీసాతో...

మట్టెవాడ, న్యూస్‌టుడే: తమ భూమిని కబ్జా చేసి ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటామని ఏకంగా పెట్రోలు సీసాతో ముఖ్యమంత్రి వద్దకు రాబోయారు ఆ వృద్ధ దంపతులు. వరంగల్‌ నగరం కొత్తవాడలో నివసిస్తున్న గాదెం ఓదమ్మ, కట్టయ్య తమ సమస్యను ముఖ్యమంత్రికి విన్నవించేందుకు సోమవారం వరంగల్‌ సెంట్రల్‌ జైలు ప్రాంతానికి వచ్చారు. అక్కడ పోలీసులు వారిని ప్రశ్నించారు. వారి వద్ద ఉన్న పెట్రోలు సీసా ఉండడంతో స్వాధీనం చేసుకొని దంపతులను మట్టెవాడ ఠాణాకు తరలించారు.

నేడు వాసాలమర్రికి కేసీఆర్‌

ఈనాడు, నల్గొండ: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం రానున్నారు. ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆయన పర్యటించనున్నారు. ఉదయం 11.30కు ఇక్కడకు చేరుకోనున్న సీఎం కేసీఆర్‌, గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు. అనంతరం గ్రామాభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో గ్రామస్థులతో చర్చిస్తారు. గతంలో తాను దత్తత తీసుకున్న ఎర్రవల్లి తరహాలోనే అన్ని రంగాల్లో గ్రామాన్ని అభివృద్ధి చేసేలా సీఎం సూచనల మేరకు అధికారులు ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు.

పల్లెలు బాగుపడాలి

అభివృద్ధి కోసం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు పెట్టాం. కానీ ఆశించిన స్థాయిలో పనులు కావడం లేదు. జులై 1 నుంచి 10వ తేదీ వరకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికే అంకితం కావాలి. దీనిపై ఈ నెల 26న కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేద్దాం. త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ మొదలు పెట్టి మూడున్నర లక్షల యూనిట్ల గొర్రెలను గొల్లకురుమలకు పంచుతాం. రైతుబంధు గొప్పదని ఐక్యరాజ్యసమితి (యూఎన్‌వో) కూడా మెచ్చుకొంది. రైతుల కోసమే ధరణిలో మార్పు చేశాం. ఇక వారికి గట్టు పంచాయితీలు లేకుండా త్వరలో డిజిటల్‌ సర్వే చేపట్టబోతున్నాం. ఈ సందర్భంగా గ్రామాల్లో తగాదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులను కోరుతున్నా. దళితుల కోసం సీఎం దళిత ఎంపవర్‌మెంట్ పథకం తెస్తాం. గిరిజనుల పోడు భూముల సమస్య కూడా పరిష్కరిస్తాం.

గొప్ప సంస్కరణలు తెచ్చారు: సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ గొప్ప సంస్కరణలు తెస్తున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. వరంగల్‌ అర్బన్‌ కలెక్టరేట్‌ ప్రారంభ అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసి పాలనను ప్రజలకు చేరువ చేశారన్నారు. సీఎం కలలు కని వాటిని సాకారం చేస్తున్నారని, కేవలం నెలలోపే వరంగల్‌లో గొప్ప ఆసుపత్రికి పునాది వేయడం మామూలు విషయం కాదన్నారు. తనతోపాటు అధికారులంతా ముఖ్యమంత్రి పథకాలను విజయవంతం చేసేందుకు పాటుపడతామని సీఎస్‌ పేర్కొన్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని