విడతల వారీగా బడులు
close

ప్రధానాంశాలు

విడతల వారీగా బడులు

ముందుగా పెద్ద తరగతులు
పాఠశాలలు, ఇంటర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో బోధన
పాలిటెక్నిక్‌, డిగ్రీ కళాశాలల్లో ప్రత్యక్ష పాఠాలే
సీఎం ఆమోదం అనంతరం విధివిధానాల వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: పాఠశాలల్లో తరగతులను విడతల వారీగా ప్రారంభించాలని విద్యాశాఖ యోచిస్తోంది. పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ (ప్రత్యక్ష తరగతులు) అవకాశం కల్పిస్తారు. ఏ విధానంలో హాజరు కావాలన్నది విద్యార్థుల ఇష్టం. జులై 1వ తేదీ నుంచి 8, 9, 10 తరగతులను, 20వ తేదీ నుంచి 6, 7 తరగతులను మొదలుపెట్టాలని, ఆగస్టు 16వ తేదీ నుంచి 3, 4, 5 తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించాలని భావిస్తోంది. రాష్ట్రంలో విద్యాసంస్థలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో విధివిధానాలను ఖరారు చేసేందుకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం పాఠశాల, ఇంటర్‌, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ అధికారులతో చర్చించారు. ఇంటర్‌, పాలిటెక్నిక్‌, డిగ్రీ, పీజీ కళాశాలల్లో అన్ని సంవత్సరాల తరగతులు జులై 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమవుతాయని కళాశాల విద్యాశాఖ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ ఇప్పటికే ఆదేశాలిచ్చారు.

6వ తరగతి ప్రవేశాలు పూర్తయితేనే..

పాఠశాలల్లో 3-10 తరగతులను రెండు లేదా మూడు విడతల్లో ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం ఆరో తరగతిలో ప్రవేశాలు జరగలేదు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ప్రాథమిక పాఠశాలల్లో అయిదో తరగతి పూర్తి చేసి ప్రాథమికోన్నత (యూపీఎస్‌) లేదా ఉన్నత పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశిస్తారు. ఇప్పటివరకు బడులు ప్రారంభం కాకపోవడంతో ప్రవేశాలు పూర్తి కాలేదు. దానికితోడు పాఠశాలలను ప్రారంభించేందుకు అవసరమైన సన్నద్ధతకు కొద్ది రోజులు మాత్రమే గడువు ఉండటంతో తొలి విడతలో 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రారంభించాలని విద్యాశాఖ ప్రతిపాదిస్తోంది. ముఖ్యమంత్రి ఆమోదం మేరకు విధివిధానాలు జారీచేయనున్నారు.

ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఫీజులను పెంచొద్దు: మంత్రి

ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ నెల 25వ తేదీ నుంచి విధులకు హాజరు కావాల్సి ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నెల 23న ప్రైవేట్‌ విద్యాసంస్థల ప్రతినిధులతో చర్చిస్తామన్నారు. ప్రైవేట్‌ విద్యాసంస్థలు జీఓ 46 ప్రకారం 2019-20 విద్యా సంవత్సరం ఫీజులనే తీసుకోవాలని, పెంచడానికి వీల్లేదన్నారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలు వచ్చే వారం వెల్లడిస్తామని తెలిపారు. ముప్పు ఎదుర్కొనే (రిస్క్‌ టేకర్స్‌) కేటగిరీలో ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్‌పై సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు.

50 శాతం విద్యార్థులకే అనుమతి!

* కరోనా మార్గదర్శకాల ప్రకారం తరగతి గదిలో 50 శాతం విద్యార్థులనే అనుమతించడం లేదా ఉదయం, మధ్యాహ్నం షిఫ్టు విధానంలో నిర్వహించడంపై చర్చ సాగింది.
*  1, 2 తరగతులకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ తరగతులు ఉండవు. వారిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమైంది.
*  ప్రత్యక్ష తరగతులను ప్రారంభించాలంటే హాస్టళ్లనూ తెరవాలి. రెండు, మూడు రోజుల్లో ఆయా శాఖల మంత్రులు, అధికారులతోనూ చర్చించి ఏయేతరగతులకు హాస్టళ్ల ప్రారంభంపై నిర్ణయం తీసుకోనున్నారు.
*  విశ్వవిద్యాలయాల్లో తరగతులపై త్వరలో ఉప కులపతులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తారు.
*  అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఈనెల 25 నుంచి విధులకు హాజరు కావాలంటూ పాఠశాల విద్య డైరెక్టర్‌ శ్రీదేవసేన సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని