ఆగస్టు 4 నుంచి ఎంసెట్‌
close

ప్రధానాంశాలు

ఆగస్టు 4 నుంచి ఎంసెట్‌

4, 5, 6 తేదీల్లో ఇంజినీరింగ్‌
9, 10లలో అగ్రికల్చర్‌ విభాగం
జులై 17న పాలిసెట్‌
జులైలో అన్ని ఫైనలియర్‌ పరీక్షలు
మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ ఆగస్టు 4వ తేదీ నుంచి మొదలుకానుంది. ఆగస్టు 4, 5, 6 తేదీల్లో ఇంజినీరింగ్‌ విభాగం, 9, 10 తేదీల్లో అగ్రికల్చర్‌ విభాగం ఆన్‌లైన్‌ పరీక్షలు జరపనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం మూడు ప్రవేశ పరీక్షల సవరణ తేదీలతో పాటు పాలిసెట్‌ తేదీని కూడా ప్రకటించారు. అన్ని రకాల డిగ్రీ, పీజీ స్థాయి చివరి సెమిస్టర్‌ పరీక్షలను జులైలో నిర్వహిస్తామన్నారు. ఎంసెట్‌తో పాటు ఈసెట్‌, పీజీఈసెట్‌ కొత్త తేదీలను ఇటీవల రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సమర్పించారు. వాటిపై సోమవారం విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, విద్యామండలి ఉపాధ్యక్షులు ఆచార్య ఆర్‌.లింబాద్రి, వెంకటరమణలతో సమీక్షించారు. పరీక్షల సవరణ తేదీలకు ఆమోదం తెలిపిన మంత్రి కొత్త తేదీలను వెల్లడించారు. కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలతో పాటు జయశంకర్‌ వర్సిటీలో అగ్రికల్చర్‌ డిప్లొమా, పీవీనర్సింహారావు వెటర్నరీ వర్సిటీలో డిప్లొమా కోర్సులతో పాటు బాసర ఆర్‌జీయూకేటీలో ప్రవేశాలకు ఈసారి పాలిసెట్‌ను ఆధారంగా చేసుకోనున్నారు.

ఉన్నత విద్యకు ఇబ్బంది లేకుండా...

ఇంజినీరింగ్‌, పీజీ, డిగ్రీ, డిప్లొమా చివరి సంవత్సరం పరీక్షలను జులై మొదటి వారంలో ప్రారంభించి నెలాఖరులోగా పూర్తి చేయాలని అన్ని విశ్వవిద్యాలయాల అధికారులను మంత్రి ఆదేశించారు. విదేశాల్లో, ఇతరచోట్ల ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారి సౌలభ్యం కోసం చివరి సంవత్సరం పరీక్షలను త్వరగా జరపాలని సీఎం ఆదేశించారని, అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల బ్యాక్‌లాగ్‌ల పరీక్షలను కూడా జులై నెలాఖరులోగా పూర్తిచేసే అవకాశాన్ని కల్పించాలని అధికారులను ఆదేశించారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని