అక్రమ ప్రాజెక్టులతో ఏపీ జలదోపిడీ
close

ప్రధానాంశాలు

అక్రమ ప్రాజెక్టులతో ఏపీ జలదోపిడీ

అపెక్స్‌ కౌన్సిల్‌లో ఇచ్చిన హామీని జగన్‌ తుంగలో తొక్కారు
ట్రైబ్యునల్‌, ఎన్‌జీటీ ఆదేశాలను ఏపీ ధిక్కరిస్తోంది
వాళ్ల మాదిరిగా చేస్తే  ఒక్క నీటిచుక్క కూడా అటు వెళ్లదు
తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలను, రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరుకుంటున్నారని రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. ఏపీ మాత్రం తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తోందని, దీన్ని సహించేది లేదని ఆయన స్పష్టంచేశారు. తాము మంచిని ఆశిస్తున్నా ఏపీ పాలకులు మాత్రం ఘర్షణ వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం విడిపోయాక కూడా జల దోపిడీతో తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. తమ ప్రాజెక్టులు నిబంధనల ప్రకారమే నిర్మిస్తున్నట్లు ఏపీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ చెప్పడంలో నిజం లేదన్నారు. కొత్తగా నీటి కేటాయింపులు జరగనంత వరకు రాయలసీమ ఎత్తిపోతలను మొదలుపెట్టబోమని అపెక్స్‌ కౌన్సిల్‌లో కేంద్ర మంత్రికి ఏపీ సీఎం జగన్‌ హామీ ఇచ్చారని.. ఇప్పుడు దాన్ని తుంగలో తొక్కుతున్నారన్నారు. ఏపీ ప్రభుత్వం చేసినట్టే తాము చేస్తే ఒక్క నీటిచుక్క కూడా అటు వెళ్లదన్నారు. తెలంగాణ పైన ఉందని, ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకునే అవకాశం ఉన్నా అలా చేయడం లేదన్నారు. ట్రైబ్యునల్‌, ఎన్‌జీటీ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం ధిక్కరిస్తోందని, టెలిమెట్రీలు ధ్వంసం చేసి అక్రమంగా నీటిని తోడుకుంటోందని ఆరోపించారు. కృష్ణా జలాలను నది ఒడ్డున ఉన్న పాలమూరు జిల్లాను కాదని, నది పరీవాహకంలో లేని నెల్లూరు తదితర జిల్లాలకు తరలించాలని చూడడం ఎంత మేరకు న్యాయమో అక్కడి నేతలు చెప్పాలన్నారు. సోమవారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ విలేకరులతో మాట్లాడారు. ‘‘మహారాష్ట్రతో సామరస్యంగా ఒప్పందం చేసుకున్నట్టే ఏపీతోనూ కృష్ణా జలాలపై అవగాహన ఉండాలని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్‌ను పిలిచాం. ఆయనను కేసీఆర్‌ తమ్ముడిలా భావించి స్నేహ హస్తం అందించినా సరిగా స్పందించలేదు. సామరస్యంతో మసలుకోవడం లేదు. ‘నోట్లో చక్కెర.. కడుపులో కత్తెర’ అన్నట్టుగా ఉంది ఏపీ ప్రభుత్వం తీరు. తెలుగు గంగకు మానవతా దృక్పథంతో తాగునీటి కోసం సహకరిస్తే దుర్వినియోగం చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతూ పాలమూరు జిల్లాకు అన్యాయం చేస్తున్నారు.

పాలమూరు జిల్లా ఎడారి కావాలా?

ఏపీ జల దోపిడీతో పాలమూరు జిల్లా ఎడారి కావాలా? పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు భవిష్యత్‌ ఏం కావాలి? ఏపీ ప్రభుత్వ అక్రమ ప్రాజెక్టులతో హైదరాబాద్‌కు తాగునీరు అందేదెలాగని ఇక్కడున్న సీమాంధ్ర సోదరులూ అడుగుతున్నారు. గ్రీన్‌ ట్రైబ్యునల్‌, అపెక్స్‌ కౌన్సిల్‌ కూడా ఏపీకి లెక్కలేదా? నీటి తరలింపుపై టెలీమెట్రీలు పెడతామంటే కొర్రీలు చెబుతూ దాటవేస్తోంది. పాలమూరు హక్కుల కోసం ఎంతకైనా తెగిస్తాం. అనుమతులు వచ్చేదాకా ప్రాజెక్టులు ఆపాలని ఏపీ ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అక్రమ ప్రాజెక్టులను మొదలుపెట్టిన నాటినుంచే మేము పోరాటం చేస్తున్నాం. కొత్త ట్రైబ్యునల్‌ వేస్తామన్న కేంద్రం హామీ మేరకే సుప్రీం కోర్టులో కేసు ఉపసంహరించుకున్నాం. కేసీఆర్‌ మంచికే మంచి.. చెడుకు చెడ్డనే. ఏపీ జలదోపిడీకి విరుగుడుగా పటిష్ఠమైన కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సత్సంబంధాలున్నాయి. వాటిని చెడగొట్టే ప్రయత్నం చేయొద్దు. ఏపీ మొండివైఖరి కొనసాగిస్తే మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే కృష్ణా జలాలను మళ్లించే వ్యూహం మాకు ఉంది’’ అని మంత్రి స్పష్టం చేశారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని