ఒక్కరోజే 82.7 లక్షల మందికి టీకా
close

ప్రధానాంశాలు

ఒక్కరోజే 82.7 లక్షల మందికి టీకా

దేశంలో రికార్డు స్థాయిలో పంపిణీ

సవరించిన మార్గదర్శకాలు అమల్లోకి..

ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ ప్రక్రియ ఊపందుకుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్‌ డోసులు అందజేసేలా.. సవరించిన మార్గదర్శకాలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో తొలిరోజే 82.7 లక్షల మందికి పైగా టీకా వేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 16న దేశంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నడూ ఒక్కరోజులో ఇంత అధిక స్థాయిలో డోసుల పంపిణీ జరగలేదు. ఏప్రిల్‌ 1న 48 లక్షల మందికి పైగా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఇన్నాళ్లూ అదే గరిష్ఠంగా ఉండేది. సోమవారంతో ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. మొత్తంగా ఇప్పటివరకు దేశంలో దాదాపు 28.33 కోట్ల డోసుల పంపిణీ పూర్తయింది. జూన్‌లో ఇప్పటివరకు సగటున రోజుకు 31 లక్షల మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. జనాభా, వ్యాధి భారం, వ్యాక్సిన్‌ పంపిణీలో ప్రగతి వంటి అంశాల ఆధారంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తామే ఉచితంగా టీకాలను అందిస్తామంటూ.. సవరించిన మార్గదర్శకాలను కేంద్రం ఈ నెల 8న జారీ చేసిన సంగతి గమనార్హం.

88 రోజుల కనిష్ఠానికి కేసులు

దేశంలో కరోనా కేసులు 88 రోజుల కనిష్ఠానికి పడిపోయాయి. తాజాగా 24 గంటల్లో 53,256 కేసులు నమోదయ్యాయి. 1,422 మంది మృత్యువాతపడ్డారు. కేసులు 60 వేల లోపునకు పడిపోవడం వరుసగా ఇది రెండో రోజు. మరణాలు 1,500 లోపు నమోదవడం ఏప్రిల్‌ 17 తర్వాత ఇదే తొలిసారి.

రెండో ఉద్ధృతి ముగిసినట్లేనా?

దేశంలో తాజాగా పాజిటివిటీ రేటు 3.83%గా నమోదైంది. వరుసగా 14వ రోజు 5% లోపే ఈ రేటు ఉండడంతో రెండో ఉద్ధృతి ముగిసినట్లేనని పలువురు విశ్లేషిస్తున్నారు. పాజిటివిటీ రేటు వరుసగా రెండు వారాలు ఐదు శాతానికి దిగువనే ఉంటే.. ఆ ప్రాంతంలో అన్ని కార్యకలాపాలను పునఃప్రారంభించవచ్చునంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్న సంగతిని గుర్తుచేస్తున్నారు. అయితే- ఇప్పుడే రెండో ఉద్ధృతి ముగిసినట్లు భావించొద్దని మరికొందరు నిపుణులు హితవు పలుకుతున్నారు.
Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని