‘విచక్షణాధికారం’.. దుర్వినియోగం!
close

ప్రధానాంశాలు

‘విచక్షణాధికారం’.. దుర్వినియోగం!

పలుచోట్ల లంచమిస్తేనే స్టేషన్‌ బెయిల్‌
లేదంటే రిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: జగిత్యాల పట్టణ ఠాణాలో వరకట్న వేధింపుల కేసు నమోదైంది. నలుగురు నిందితులకు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు ఎస్సై శివకృష్ణ రూ.50 వేలు డిమాండ్‌ చేశారు. రూ.30 వేలకు బేరం కుదిరింది. అయినా బెయిల్‌ ఇవ్వకుండా తాత్సారం చేస్తుండటంతో నిందితులు అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించారు. డ్రైవర్‌ ద్వారా ఎస్సై లంచం సొమ్ము తీసుకుంటుండగా తాజాగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ఠాణాల్లో స్టేషన్‌ బెయిల్‌ మంజూరులో ఇదే పరిస్థితి నెలకొందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో స్టేషన్‌ బెయిల్‌కు రూ.10-50 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

ఏడేళ్లలోపు శిక్ష పడే అవకాశమున్న కేసుల్లో నిందితుల్ని కోర్టుకు రిమాండ్‌ చేయాల్సిన అవసరం ఉండదు. వీరికి స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేసే విచక్షణాధికారం దర్యాప్తు అధికారులకు ఉంటుంది. ఈ నిందితులకు తొలుత 41ఏ సీఆర్పీసీ(క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌) కింద నోటీస్‌ ఇవ్వాలి. దానికి వారు ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా ఉంటే తగిన పూచీకత్తుపై స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేస్తారు. అనంతరం న్యాయస్థానంలో జరిగే విచారణలకు నిందితులు హాజరవుతారు. ఒకవేళ నిందితుడు తక్షణమే బయటికి వస్తే.. సాక్ష్యాల్ని తారుమారు చేసే అవకాశమున్నా.. బాధితుల్ని బెదిరించి కేసును తప్పుదోవ పట్టిస్తాడనుకున్నా.. నిందితుడు దురుద్దేశపూర్వకంగా నేరం చేశాడని భావించినా రిమాండ్‌కు తరలించొచ్చు. ఈ క్రమంలో స్టేషన్‌ బెయిల్‌ జారీ అంశం సంబంధిత దర్యాప్తు అధికారి ‘విచక్షణ’ మీద ఆధారపడి ఉంటుంది.

చేయి తడపకుంటే కక్ష తప్పదు

కొందరు ఎస్సైలు లంచాల కోసం ఈ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. లంచం ఇస్తే బెయిల్‌ ఇవ్వడం లేదంటే రిమాండ్‌కు పంపిస్తామని బెదిరించడం చేస్తున్నారు. అయినా డబ్బులు వచ్చే అవకాశం లేనప్పుడు రిమాండ్‌కు తరలిస్తున్నారు. నిందితుడు తాము అడిగిన పూచీకత్తు ఇవ్వలేదనో.. నోటీస్‌కు సరిగా స్పందించలేదనో సాకు చెబుతూ కక్ష తీర్చుకుంటున్నారు.
* ఫిర్యాదుదారులకు ఠాణాల్లో ఎదురైన అనుభవాలపై పోలీస్‌శాఖ ప్రస్తుతం ‘సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌’ తీసుకుంటోంది. స్టేషన్‌ బెయిళ్లు పొందిన వారి నుంచి కూడా ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటే ఈ అక్రమాలు బహిర్గతమవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని