విద్యార్థులకు 4 స్థాయుల్లో బ్రిడ్జి కోర్సు
close

ప్రధానాంశాలు

విద్యార్థులకు 4 స్థాయుల్లో బ్రిడ్జి కోర్సు

240 వీడియో పాఠాల రూపకల్పన

మొదటి నెల రోజుల పాటు పాత పాఠాలే

ప్రత్యక్ష తరగతులకూ కోర్సు ప్రణాళిక సిద్ధం

ఈనాడు, హైదరాబాద్‌: గత విద్యా సంవత్సరం(2020-21) ప్రత్యక్ష తరగతులు జరగనందున ఈసారి విద్యార్థులకు పాత తరగతులపై అవగాహన పెంచి పైతరగతికి సన్నద్ధం చేసేందుకు విద్యాశాఖ నాలుగు స్థాయుల్లో బ్రిడ్జి కోర్సు అందించనుంది. ఇందుకు ఆన్‌లైన్‌ తరగతుల కోసం వీడియో పాఠాలు, ప్రత్యక్ష తరగతుల కోసం ఆయా భావనలను బోధించే ప్రణాళికను రూపొందించారు. మొదటి నెల రోజులు ఈ ప్రణాళికను అమలు చేయనున్నారు. దానివల్ల గత ఏడాది పాఠశాలల మూత కారణంగా నష్టపోయిన అభ్యసన నష్టాన్ని కొంతవరకు పూడ్చినట్లవుతుందని అధికారులు చెబుతున్నారు.

టీవీల ద్వారా ప్రసారం చేసేందుకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) సహకారంతో రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ(సైట్‌) 3-10 తరగతుల కోసం మొత్తం 240 వీడియో పాఠాలను రూపొందించింది. వీటిని తరగతుల వారీగా తయారు చేయలేదు. మూడు, నాలుగు, అయిదు తరగతులకు కలిపి ఒక స్థాయి పాఠాలను రూపొందించారు. అదేవిధంగా 6,7 తరగతులకు మరొక స్థాయిలో, 8,9 తరగతులకు కలిపి ఇంకోటి తయారు చేశారు. పదో తరగతికి మాత్రం ప్రత్యేకంగా వీడియో పాఠాలను సిద్ధం చేశారు. ఆ తరగతుల్లో ముఖ్యమైన, పై తరగతులకు వెళ్లాలంటే తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన పాఠ్యాంశాలను కలిపి అందించనున్నారు. ఒక్కో స్థాయికి 60 పాఠాలు లెక్కన మొత్తం 240 సిద్ధం చేశారు. వాటిని మంగళవారం నుంచి రికార్డు చేసే ప్రక్రియ మొదలైంది. ఈ పాఠాలను దూరదర్శన్‌, టీశాట్‌ ఛానళ్ల ద్వారా ప్రసారం చేస్తారు. మరోవైపు ప్రత్యక్ష తరగతులకు హాజరైన వారికి స్వయంగా బ్రిడ్జి కోర్సును అందించేందుకు కూడా కింది తరగతుల్లో ముఖ్యమైన అంశాలను సబ్జెక్టు నిపుణులను నియమించి ఇప్పటికే గుర్తించారు. వాటిని ఉపాధ్యాయులు తరగతి గదుల్లో విద్యార్థులకు బోధించాలి. కేంద్ర విద్యాశాఖ కూడా బ్రిడ్జి కోర్సును తప్పనిసరిగా అమలు చేయాలని కొద్ది నెలల క్రితం అన్ని రాష్ట్రాలకు సూచించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని