రాయలసీమ పనులు నిలిపివేయించండి
close

ప్రధానాంశాలు

రాయలసీమ పనులు నిలిపివేయించండి

ఏపీపై కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

ఈనాడు హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ అక్రమంగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలుపుదల చేయడానికి తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని తెలంగాణ మరోసారి కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు విజ్ఞప్తి చేసింది. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌.జి.టి) నిర్ణయానికి విరుద్ధంగా పనులు కొనసాగిస్తోందంటూ ఫొటోలను కూడా జత చేసింది. ఎన్‌.జి.టి. ఆదేశాలను అమలు చేయడంలో బోర్డు విఫలమైందని పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ మంగళవారం కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు లేఖ రాశారు. ముఖ్యాంశాలిలా ఉన్నాయి.

‘‘రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ముందుకెళ్లొద్దని గత ఏడాది అక్టోబరులో ఆంధ్రప్రదేశ్‌కు ఎన్‌.జి.టి ఆదేశాలు జారీచేసింది. పర్యావరణ అనుమతి లేకుండా పనులు చేపట్టవద్దని సూచించినా ఏపీ పనులను కొనసాగించింది. దీనిపై గత డిసెంబరులో ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా డిసెంబరు 24న మరోసారి ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ చేసిన ఫిర్యాదుపై కృష్ణా బోర్డుకు స్వతంత్రంగా దర్యాప్తుచేసే స్వేచ్ఛ ఉందని, ఆదేశాలు ఉల్లంఘించి పనులు చేసినట్లు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించింది. అప్పట్లో డీపీఆర్‌ తయారు చేయడానికి అవసరమైన ప్రాథమిక కసరత్తు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివేదించారని, దీనిపై నిజ నిర్ధారణ కమిటీని పంపి వాస్తవాలు నిర్ధారించాలని కృష్ణా బోర్డును ట్రైబ్యునల్‌ ఆదేశించింది. ఎన్‌.జి.టి. ఆదేశాలను అమలు చేయడంలో బోర్డు వైఫల్యం చెందింది. మరోవైపు ఆదేశాలను పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్‌ పనులను వేగంగా చేస్తుందన్నది మాకున్న సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా జత చేస్తున్నాం. ఈ నెల 19న జరిగిన తెలంగాణ మంత్రిమండలి సమావేశం శ్రీశైలం నుంచి రోజుకు 80 వేల క్యూసెక్కుల నీటిని మళ్లించేలా ఆంధ్రప్రదేశ్‌ అక్రమంగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పట్ల అసంతృప్తి వ్యక్తంచేసింది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 85(8)(డి) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ అనధికారికంగా చేపట్టిన ప్రాజెక్టులను ఆపడం కృష్ణా బోర్డు బాధ్యత. సమగ్ర ప్రాజెక్టు నివేదిక సమర్పించి బోర్డు అనుమతి తీసుకొనే వరకు ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లొద్దని కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ కూడా సూచించింది. కాబట్టి తెలంగాణకు న్యాయపరంగా నీటిని వచ్చేలా చేయడానికి, ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టు పనులను నిలిపివేయడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం’’ అని రజత్‌కుమార్‌ లేఖలో బోర్డును కోరారు.

కమిటీని పంపడంపై బోర్డు తర్జనభర్జన

ఎన్‌.జి.టి. ఆదేశాల ప్రకారం రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించడానికి గతంలోనే కృష్ణా బోర్డు కమిటీని ఏర్పాటుచేసింది. కొవిడ్‌ కారణంగా వాయిదా వేసుకోవాలని, తగ్గాక రావచ్చని ఆంధ్రప్రదేశ్‌ లేఖ రాసింది. మే 31న బోర్డు ఛైర్మన్‌ పదవీ విరమణ చేయడంతో గోదావరి బోర్డు ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. బోర్డుకు కొత్తగా ఎంపీసింగ్‌ను నియమించగా ఆయన ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం ఇన్‌ఛార్జి ఛైర్మన్‌ అయ్యర్‌, సభ్య కార్యదర్శి రాయిపురే తదితరులు సమావేశమై కమిటీని పంపే విషయమై చర్చించినట్లు తెలిసింది. కరోనా తగ్గి కార్యక్రమాలన్నీ ప్రారంభమైనందున కమిటీని పంపొచ్చనే అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. కొత్త ఛైర్మన్‌ బాధ్యతలు చేపట్టాక దీనిపై ముందుకెళ్తారా లేక వెంటనే పంపుతారా అన్నది చూడాల్సి ఉంది.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని