జూరాలకు మళ్లీ మొదలైన వరద
close

ప్రధానాంశాలు

జూరాలకు మళ్లీ మొదలైన వరద

నారాయణపూర్‌ నుంచి దిగువకు విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, పరీవాహక ప్రాంతంలో ప్రవాహాల కారణంగా జూరాలకు మళ్లీ కృష్ణా ప్రవాహం మొదలైంది. ఈ నెలలో ఇప్పటివరకు ఆలమట్టికి సుమారు 70 టీఎంసీల నీరు రాగా, బుధవారం ఉదయం లక్షా 17 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో కొంత నీటిని దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్‌ రిజర్వాయర్‌లోకి 40 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, దిగువకు 43 వేల క్యూసెక్కులు వదులున్నారు. ఎగువన ఉన్న ఈ రెండు రిజర్వాయర్లు నిండటానికి మరో 53 టీఎంసీలు మాత్రమే అవసరం. రానున్న రోజుల్లో వచ్చే వరదను పరిగణనలోకి తీసుకొని ముందుగానే దిగువకు నీటి విడుదలను కర్ణాటక ప్రారంభించింది.

తుంగభద్రకూ పెరిగిన ప్రవాహం

జూరాలకు బుధవారం సుమారు రెండువేల క్యూసెక్కులు మాత్రమే వస్తుండగా, గురువారం నాటికి పెరిగే అవకాశం ఉంది. మరో వైపు తుంగభద్రకు 32,343 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. అయితే ఈ రిజర్వాయర్‌ నిండటానికి మరో 75 టీఎంసీలు అవసరం. నారాయణపూర్‌ నుంచి మరింత నీటి విడుదల పెరగడంతోపాటు తుంగభద్రకు ప్రవాహం పెరిగితే శ్రీశైలం పరిస్థితి కూడా మెరుగయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు శ్రీశైలంలోకి తొమ్మిది టీఎంసీలు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతానికి ప్రవాహం లేదు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ రిజర్వాయర్లు నిండటానికి 315 టీఎంసీలు అవసరం. నాగార్జునసాగర్‌లోకి 7645 క్యూసెక్కులు, పులిచింతలలోకి 6323 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. దిగువన ప్రకాశం బ్యారేజీకి ఏమీ లేదు. గోదావరిలో ధవళేశ్వరం వద్ద 9500 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, డెల్టా కాలువలకు విడుదల చేశారు. ఇక్కడి నీటి ప్రవాహం పెరిగితే పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంది. గోదావరిలో శ్రీరామసాగర్‌కు నామమాత్రంగానే ప్రవాహం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ నుంచి నీటి మళ్లింపు ప్రారంభించడంతో ఎల్లంపల్లిలోకి 18483 క్యూసెక్కులు, మధ్యమానేరులోకి 12750 క్యూసెక్కులు, దిగువ మానేరులోకి 12452 క్యూసెక్కుల ప్రవాహం ఉంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని