దీపావళి వరకు ఉచిత రేషన్‌
close

ప్రధానాంశాలు

దీపావళి వరకు ఉచిత రేషన్‌

మొత్తం రాయితీ భారం రూ.67 వేల కోట్లు 

కేంద్ర మంత్రివర్గం ఆమోదం

ఈనాడు, దిల్లీ: వచ్చే దీపావళి వరకు పేదలకు ఉచితంగా తలసరి నెలకు 5 కేజీల తిండి గింజలు సరఫరా చేయాలని బుధవారం కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధాని మోదీ ఈనెల 7న జాతినుద్దేశించి చేసిన ప్రసంగం సందర్భంగా ఈ మేరకు ఇచ్చిన హామీని అమలు చేయనుంది. కరోనా నేపథ్యంలో ఇప్పటివరకు ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన కింద ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో ఉచితంగా రేషన్‌ సరఫరా చేసింది. కొవిడ్‌ తీవ్రత నేపథ్యంలో దాన్ని నవంబరు వరకు మరో అయిదు నెలలపాటు పొడిగించింది. 81.35 కోట్లమంది లబ్ధిదారులకు జాతీయ ఆహారభద్రత చట్టం కింద రేషన్‌ ఇవ్వాలని గతంలోనే నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఆహార సబ్సిడీ కింద రూ.64,031 కోట్లు ఖర్చుచేయనుంది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఈ పూర్తి మొత్తాన్ని కేంద్రమే భరిస్తోంది. తాజా నిర్ణయం కారణంగా తిండిగింజల సరఫరా, నిర్వహణ, డీలర్ల మార్జిన్‌తో కలిసి రూ.3,234.85 కోట్ల అదనపు మొత్తాన్ని వెచ్చించాల్సి వస్తోంది. ఇందుకోసం 204 లక్షల మెట్రిక్‌ టన్నుల తిండిగింజలు అవసరమవుతాయని అంచనా. మొత్తం 8 నెలలకుగానూ 321 లక్షల మెట్రిక్‌ టన్నులు కేటాయించగా, అందులో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే 305 లక్షల మెట్రిక్‌ టన్నులను ముందస్తుగానే తీసుకెళ్లాయి. ఈ పథకం ఖర్చు మొత్తం రూ.67,266.44 కోట్లకు చేరనుంది.

కేంద్ర గిడ్డంగుల కార్పొరేషన్‌లో రైల్‌సైడ్‌వేర్‌హౌస్‌ కంపెనీ విలీనం

మినీరత్న హోదా కలిగిన కేంద్ర రైల్‌సైడ్‌ వేర్‌హౌస్‌ కంపెనీ లిమిటెడ్‌ను సెంట్రల్‌ గిడ్డంగుల కార్పొరేషన్‌లో విలీనం చేయడానికి కూడా ఆమోదముద్ర వేసింది. తద్వారా రైల్‌సైడ్‌ వేర్‌హౌస్‌ సంస్థకున్న ఆస్తులు, అప్పులు, హక్కులు, బాధ్యతలు అన్నీ గిడ్డంగుల కార్పొరేషన్‌కు బదిలీ కానున్నాయి. ‘కనిష్ఠ ప్రభుత్వం - గరిష్ఠ పాలన’ విధానం అమలులో భాగంగా ఈ విలీన ప్రక్రియ చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. రెండు సంస్థల పనితీరు ఒకటే కావడంవల్ల వేర్వేరు వ్యవస్థలకు బదులు ఒకే వ్యవస్థ ఉండటం మేలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకొంది. దీనివల్ల రైల్‌సైడ్‌ వేర్‌హౌస్‌ కంపెనీ కార్పొరేట్‌ ఆఫీసు అద్దె, ఉద్యోగులు, ఇతర పరిపాలన ఖర్చులకు చెల్లిస్తున్న రూ.5 కోట్ల ఖర్చు తగ్గుతుందని తెలిపింది. ఈ విలీనం వల్ల గూడ్స్‌షెడ్‌ ప్రాంతాల్లో కొత్తగా మరో 50 గోదాములు నిర్మించడానికి వీలవుతుందని పేర్కొంది. 8 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించింది.

* పన్నుల వివరాలను ఇచ్చిపుచ్చుకోవడంపై సెయింట్‌ విన్సెంట్‌ అండ్‌ గ్రెనడైనెస్‌ దేశంతో కుదిరిన ఒప్పందానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని