వైద్యంలో పదివేల కొలువులు
close

ప్రధానాంశాలు

వైద్యంలో పదివేల కొలువులు

ఏడు మెడికల్‌ కాలేజీలకు 7,007 పోస్టులు
నర్సింగ్‌ కళాశాలలకు 720 ఉద్యోగాలు

ఈనాడు, హైదరాబాద్‌: కొత్తగా ఏర్పాటు చేసిన ఏడు వైద్య కళాశాలలు, 15 నర్సింగ్‌ కాలేజీల్లో 10 వేలకు పైగా కొలువులు రానున్నాయి. రెగ్యులర్‌ ప్రాతిపదికన 7,727 మందిని నియమిస్తారు. ఈ మేరకు పోస్టులను మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉద్యోగాల భర్తీకి ముందు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, ఆర్థిక శాఖల అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. మంజూరు చేసిన పోస్టులకు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ సర్వీసు నిబంధనలు వర్తిస్తాయని వివరించారు. ఈ వైద్య కళాశాలలు, నర్సింగ్‌ కాలేజీల్లో 3,035 మందిని అవుట్‌సోర్సింగ్‌ విధానంలో నియమించుకునేందుకు ప్రభుత్వం బుధవారం అనుమతించిన విషయం తెలిసిందే. ఏడు వైద్య కళాశాలల్లో 2,135 మందిని, 15 నర్సింగ్‌ కళాశాలల్లో 900 మందిని తీసుకోవచ్చని పేర్కొంది.

ఒక్కో వైద్య కళాశాలకు 1,001 పోస్టులు

రాష్ట్రంలో సంగారెడ్డి, మహబూబాబాద్‌, మంచిర్యాల, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాలల్లో వైద్య కళాశాలలు ఏర్పాటయ్యాయి. ప్రతి కళాశాలలో 34 వైద్య విభాగాల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ల్యాబ్‌ టెక్నీషియన్లు సహా ఇతర పోస్టులను మంజూరు చేశారు. ఒక్కో వైద్య కళాశాలకు 1,001 పోస్టుల చొప్పున ఏడు కళాశాలలకు 7,007 మంజూరు చేశారు.

నర్సింగ్‌ కళాశాలకు 48 పోస్టులు

రాష్ట్రంలో ఇటీవల ఏర్పాటు చేసిన 13 నర్సింగ్‌ కళాశాలలు, మరో రెండు కొత్త నర్సింగ్‌ కళాశాలలకు 720 పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రెగ్యులర్‌ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతి నర్సింగ్‌ కళాశాలకు ప్రొఫెసర్‌/ప్రిన్సిపల్‌, ప్రొఫెసర్‌/వైస్‌ ప్రిన్సిపల్‌, మరో ఏడు గురు ప్రొఫెసర్లు, 12 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, 20 మంది లెక్చరర్ల పోస్టులున్నాయి. పరిపాలన విభాగానికి ఏడు ఉద్యోగాలున్నాయి. మొత్తం 48 మంది చొప్పున 15 నర్సింగ్‌ కళాశాలలకు 720 పోస్టులను మంజూరు చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని