రూ.2,100 కోట్లతో ఎలక్ట్రిక్‌ వాహనాల పరిశ్రమ
close

ప్రధానాంశాలు

రూ.2,100 కోట్లతో ఎలక్ట్రిక్‌ వాహనాల పరిశ్రమ

రాష్ట్ర ప్రభుత్వంతో అమెరికా సంస్థ ట్రైటాన్‌ ఒప్పందం
అయిదేళ్లలో 50 వేల కార్లు, ఇతర వాహనాల తయారీ
25 వేల మందికి ఉపాధి లక్ష్యం
మంత్రి కేటీఆర్‌ హర్షం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో భారీ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. అమెరికాకు చెందిన ట్రైటాన్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ రూ.2,100 కోట్లతో జహీరాబాద్‌ జాతీయ పెట్టుబడులు, తయారీ మండలిలో దీనిని స్థాపించనుంది. దీని ద్వారా 25 వేల మందికి ఉపాధి కలుగుతుంది. తొలి ఐదు సంవత్సరాల్లో 50 వేలకు పైగా సెడాన్లు, లగ్జరీ కార్లు, ఇతర ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేయనుంది. దీనిపై గురువారం మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ట్రైటాన్‌ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంపై పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, ట్రైటాన్‌ భారత విభాగాధిపతి మహ్మద్‌ మన్సూర్‌ సంతకాలు చేశారు.

తెలంగాణ ఈవీ విధానం అత్యుత్తమం

ఒప్పందంపై సంతకాల అనంతరం జరిగిన దృశ్యమాధ్యమ సమావేశంలో ట్రైటాన్‌ వ్యవస్థాపకుడు, సీఈవో హిమాన్ష్‌ పటేల్‌ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో తమ వ్యాపార ప్రణాళికలను వివరించారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది. భారీ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని మా సంస్థను విస్తరించేందుకు, భారత్‌లో పరిశ్రమను ప్రారంభించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశాం. దేశంలోని వివిధ రాష్ట్రాలను సందర్శించి, విధానాలను పరిశీలించాం. అన్నింటికంటే తెలంగాణ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌(ఈవీ) విధానం అత్యుత్తమంగా ఉంది. రాష్ట్రంలో భూలభ్యత, ప్రపంచస్థాయి మౌలికవసతులు, మానవవనరులు అందుబాటులో ఉండడంతో తెలంగాణ కేంద్రంగా మా కార్యకలాపాలను ప్రారంభించేందుకు నిర్ణయించాం. జహీరాబాద్‌లోని నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌(నిమ్జ్‌)ను పరిశ్రమ ఏర్పాటుకు అనువైన కేంద్రంగా ఎంపిక చేశాం. అవసరమైన అన్ని సహాయసహకారాలను అందించేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో ఎంవోయూ కుదుర్చుకున్నాం’’ అని హిమాన్ష్‌ తెలిపారు.

అగ్రస్థానమే లక్ష్యం: కేటీఆర్‌

కేటీఆర్‌ మాట్లాడుతూ, పరిశ్రమ ఏర్పాటుకు తెలంగాణను ఎంచుకోవడంపై ట్రైటాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో అగ్రస్థానమే లక్ష్యంగా తెలంగాణ పురోగమిస్తోంది. టీఎస్‌ఐపాస్‌లో మెగా పరిశ్రమలకున్న అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం తరఫున అందిస్తాం. ఇప్పటికే మహబూబ్‌నగర్‌ జిల్లా దివిటిపల్లిలో, రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లిలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి పలు సంస్థలు వచ్చాయి. తెలంగాణ క్రమంగా ఈవీ రంగ పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయ ప్రాంతంగా మారుతోంది. కొత్త పారిశ్రామిక విధానం వచ్చాక తెలంగాణలో ఈవీ అమ్మకాలు భారీఎత్తున పెరగడం శుభ సూచకం’’ అని కేటీఆర్‌ అన్నారు.

ఏడాదిలో తెలంగాణకు రూ. 8,617 కోట్ల విదేశీ పెట్టుబడులు
-  ఏపీకి వచ్చినవి రూ.638 కోట్లు

ఈనాడు, దిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి మొత్తం రూ.6,14,127 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినట్లు డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ) విడుదల చేసిన గణాంకాల ద్వారా వెల్లడైంది. తెలంగాణకు రూ.8,617.71 కోట్లు (1.40%) రాగా, ఆంధ్రప్రదేశ్‌కు రూ.638.72 కోట్లు (0.10%) వచ్చాయి. డీపీఐఐటీ 2019 అక్టోబరు నుంచి ఎఫ్‌డీఐలను రాష్ట్రాలవారీగా విభజిస్తూ వస్తోంది. దీని ప్రకారం 2019 అక్టోబరు నుంచి 2020 మార్చి వరకు దేశం మొత్తానికి రూ.1,71,558 కోట్ల ఎఫ్‌డీఐలు రాగా, 2020 ఏప్రిల్‌- 2021 మార్చి మధ్య కాలంలో రూ.4,42,568 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఏపీకి 2019 అక్టోబరు నుంచి 2020 మార్చి వరకు రూ.1,475.99 కోట్లు రాగా, గత ఏడాదిలో రూ.638.72 కోట్లు వచ్చాయి. తెలంగాణకు ఇదివరకు రూ.4,865.19 కోట్లు రాగా, గత ఏడాదిలో రూ.8,617.71 కోట్ల విదేశీ పెట్టుబడులు దక్కాయి.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని