పాఠశాలలు రుసుములు పెంచొద్దు

ప్రధానాంశాలు

పాఠశాలలు రుసుములు పెంచొద్దు

నెలవారీగా ట్యూషన్‌ ఫీజు మాత్రమే తీసుకోవాలి
ఉత్తర్వులు జారీచేసిన విద్యాశాఖ కార్యదర్శి

ఈనాడు, హైదరాబాద్‌: నూతన విద్యా సంవత్సరం(2021-22)లోనూ రాష్ట్రంలోని అన్ని బోర్డుల పరిధి ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు పెంచరాదని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా సోమవారం జీవో 75 జారీ చేశారు. గత విద్యా సంవత్సరంలో (2020-21) రుసుములు పెంచొద్దంటూ 2020 ఏప్రిల్‌లో జారీ అయిన జీవో 46కు అనుబంధంగా ఈ విద్యా సంవత్సరానికి మరో జీవో ఇచ్చారు. ట్యూషన్‌ ఫీజును మాత్రం నెలవారీగా వసూలు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. కరోనా పరిస్థితుల కారణంగా తెలంగాణ విద్యా సంస్థలు(స్థాపన, గుర్తింపు, పరిపాలన, ప్రైవేట్‌ పాఠశాలల నియంత్రణ) నిబంధనలు 1993 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇది రాష్ట్ర బోర్డుతో పాటు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఇతర అంతర్జాతీయ బోర్డులకూ వర్తిస్తుందని ప్రభుత్వం జీవోలో స్పష్టీకరించింది. జీవో ప్రకారం 2019-20లో ఉన్న ట్యూషన్‌ ఫీజునే ఇప్పుడూ తీసుకోవాల్సి ఉంటుందని అధికారి ఒకరు చెప్పారు. సాధారణంగా ఏటా 8-15 శాతం రుసుములను ప్రైవేట్‌ పాఠశాలలు పెంచుతుంటాయని, రెండేళ్లు పెంచకుంటే 16-30 శాతం తగ్గించినట్లేనని ఆయన విశ్లేషించారు. ఈ ఆదేశాలను పాటించకుంటే పాఠశాలల గుర్తింపు రద్దుచేస్తామని, ఇచ్చిన నిరభ్యంతర ధ్రువపత్రాల(ఎన్‌ఓసీల)ను వెనక్కి తీసుకుంటామని, యాజమాన్యాలపై చట్ట ప్రకారం చర్యలు చేపడతామని హెచ్చరించింది.

వెబ్‌సైట్లో ఉంచితేనే మేలు...

2019-20లో ఏ పాఠశాలలో ట్యూషన్‌ ఫీజు ఎంతన్నది ఆయా పాఠశాలలతో పాటు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వెబ్‌సైట్లో కూడా ఉంచితేనే స్పష్టత వస్తుందని తల్లిదండ్రుల సంఘాలు చెబుతున్నాయి. ‘ఉదాహరణకు గత ఏడాది ఒక విద్యార్థి రెండో తరగతి చదివాడు. ఇప్పుడు మూడో తరగతికి వస్తే గత ఏడాది మూడో తరగతికి ఎంత ఫీజు అన్నది తల్లిదండ్రులకు తెలియదు. కొన్ని పాఠశాలల్లో ఎల్‌కేజీ యూకేజీలకు ఒకరకంగా, ఒకటో తరగతి నుంచి అయిదో తరగతి వరకు వేరే ఫీజు, 6-10 తరగతులకు మరో రుసుం తీసుకుంటున్నారు. కొన్నిచోట్ల ప్రతి తరగతికి ఒక్కోలా ఫీజు ఉంటోంది. ఈ పరిస్థితుల్లో 2019-20లో ఏ తరగతికి ఎంత రుసుం అన్నది విద్యాశాఖ అధికారికంగా ప్రకటించే ఏర్పాట్లు చేయాలని’ ఆయా సంఘాలు కోరుతున్నాయి.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని