NITI Aayog: ఆ వైద్యాలయాలు.. లాభాలు చూసుకోవు!

ప్రధానాంశాలు

NITI Aayog: ఆ వైద్యాలయాలు.. లాభాలు చూసుకోవు!

సత్యసాయి... బసవతారకం ఆసుపత్రుల సేవలు ఓ ఉదాహరణ

వాటికిచ్చే విరాళాలకు వంద శాతం పన్ను మినహాయింపునివ్వాలి 

ప్రభుత్వాల నుంచి రీఎంబర్స్‌మెంట్‌ వేగంగా అందించాలి

నీతి ఆయోగ్‌ నివేదికలో ప్రస్తావన

ఈనాడు, దిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆసుపత్రి తెలుగురాష్ట్రాల్లో లాభాపేక్ష లేకుండా ఉన్నత వైద్యాన్ని అందిస్తున్నట్లు నీతి ఆయోగ్‌ పేర్కొంది. దేశంలో లాభాపేక్షలేని ఆసుపత్రుల విధానం (నాట్‌ ఫర్‌ ప్రాఫిట్‌ ఆసుపత్రి మోడల్‌) పేరుతో మంగళవారం విడుదల చేసిన నివేదికలో తెలుగు రాష్ట్రాల్లోని ఈ రెండు ఆసుపత్రులు అందిస్తున్న వైద్యసేవల గురించి ప్రస్తావించింది. ‘లాభాలకోసం పనిచేసే ప్రైవేటు ఆసుపత్రుల గురించిన వివరాలు విస్తృతంగా అందుబాటులో ఉన్నా, లాభాపేక్ష లేకుండా పనిచేసేవాటి గురించి సరైన సమాచారం లేదు. ఇప్పుడు ఆ లోటును భర్తీచేస్తున్నాం. అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్న ఆసుపత్రుల సేవల గురించి తెలియజేయడానికే ఈ నివేదికను తీసుకొస్తున్నాం’ అని నీతిఆయోగ్‌ పేర్కొంది. ఈ వైద్యాలయాలు వ్యాధి వచ్చిన వారికి సేవలందించడమే కాకుండా, అసలు రోగం రాకుండా ముందుగానే నియంత్రించేందుకు సేవలు అందిస్తున్నట్లు నివేదికలో ప్రశంసించింది. ప్రైవేటుతో పోలిస్తే ఇలాంటి ఆసుపత్రుల్లో వైద్యఖర్చులు ఇన్‌పేషెంట్‌ డిపార్ట్‌మెంట్‌లో 25% తక్కువ ఉన్నట్లు పేర్కొంది. డాక్టర్లు, సర్జన్ల ఛార్జీలు 36%, పడకలు ఛార్జీలు 44%మేర తక్కువ ఉన్నట్లు తెలిపింది. ప్రజలకు అందుబాటు ధరల్లో వైద్యసేవలు అందించడం కోసం మార్కెట్‌తో పోలిస్తే డాక్టర్లకు 50-75%, ఇతర సిబ్బందికి 20-30% తక్కువ వేతనాలు అందిస్తున్నట్లు నీతి ఆయోగ్‌ పేర్కొంది. ఈ ఆసుపత్రులకు సెక్షన్‌ 80 జీ కింద విరాళాలు ఇచ్చే వారికి పన్ను మినహాయింపును 50%కి పరిమితం చేయకుండా దాన్ని 100%కి విస్తరించాలని సూచించింది. తక్కువ వడ్డీతో వర్కింగ్‌ కేపిటల్‌ రుణాలు అందించాలనీ ప్రభుత్వాన్ని కోరింది. కోఆపరేటివ్‌ ట్రస్ట్‌ ఆసుపత్రుల సభ్యత్వ రుసుములకు ఆదాయపన్ను మినహాయంపునివ్వాలని పేర్కొంది. ఈ ఆసుపత్రులు పేదలకు అందించిన వైద్యసేవలకు ప్రభుత్వాల నుంచి సకాలంలో రీఎంబర్స్‌మెంట్‌ రావడంలేదని, నిరంతరం ఇందుకోసం వెంటపడినా దీర్ఘకాలంగా బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయని తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించడానికి సింగిల్‌విండో క్లియరెన్స్‌ విధానం ప్రవేశపెట్టాలని సూచించింది. సకాలంలో బిల్లులు చెల్లించడంవల్ల ఈ ఆసుపత్రులకు వర్కింగ్‌కేపిటల్‌ సమస్య కొంతమేర తీరుతుందని నీతి ఆయోగ్‌ అభిప్రాయపడింది.

బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆసుపత్రి, హైదరాబాద్‌

2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ ఆసుపత్రి ఉన్నత వైద్యాన్ని అందిస్తోంది. ఒకేచోట 500 పడకలతో నందమూరి బసవతారకం రామారావు మెమోరియల్‌ కేన్సర్‌ ఫౌండేషన్‌ పాలకమండలి ఆధ్వర్యంలో నడుస్తోంది. సొంతంగానే నిర్వహణ ఖర్చులను సమకూర్చుకుంటోంది. మూలధన వ్యయంకోసం గ్రాంట్స్‌పై ఆధారపడుతోంది. ప్రైవేటు ఆసుపత్రులకంటే ఇది 10-20% తక్కువ ఛార్జీలు అమలుచేస్తోంది. క్రమం తప్పకుండా కేన్సర్‌ స్క్రీనింగ్‌ కార్యక్రమాలు ఉచితంగా నిర్వహిస్తోంది. గత 15 ఏళ్లలో 1,65,000 మంది రోగులను పరీక్షించింది.

సత్యసాయి ఆసుపత్రులు-పుట్టపర్తి

1948లో ఏర్పాటైన ఈ ఆసుపత్రి ఇప్పుడు ఉన్నత వైద్యాన్ని అందిస్తోంది. 550 పడకలతో రెండు యూనిట్లుగా నడుస్తోంది. శ్రీసత్యసాయి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ పాలకమండలి ఆధ్వర్యంలో నడుస్తోంది. కులం, మతం, ప్రాంతం, సామాజిక, ఆర్థిక భేదాలు లేకుండా రోగులందరికీ ఉచిత వైద్యం అందిస్తోంది. ప్రతి నెలా 1 నుంచి 12 తేదీల మధ్యలో అనంతపురం జిల్లాలోని 12 నోడల్‌పాయింట్లలో మొబైల్‌ ఆసుపత్రులను నిర్వహిస్తోంది. ఇక్కడ 400 గ్రామాల ప్రజలు ఉచితంగా సేవలు పొందుతున్నారు. డయాగ్నస్టిక్‌ బస్సులో పాథాలజీ, ఎక్స్‌రే, యూఎస్‌జీ, కలర్‌డాప్లర్‌, ఈసీజీ, ఈఈజీ సేవలను అందిస్తున్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని