హ్యాకింగ్‌పై రగడ

ప్రధానాంశాలు

హ్యాకింగ్‌పై రగడ

పెగాసస్‌ జాబితాలో రాహుల్‌గాంధీ ఫోన్‌ నంబర్లు
2019 సార్వత్రిక సమరం ముందు లక్ష్యంగా చేసుకున్నారు
ప్రశాంత్‌ కిశోర్‌పైనా దృష్టి
 బాధితుల జాబితాలో కేంద్ర మంత్రులు
 ఎన్నికల మాజీ కమిషనర్‌ అశోక్‌ లవాసాకూ తప్పని బెడద
 ‘ది వైర్‌’లో మరిన్ని సంచలన కథనాలు
 పార్లమెంటులో రచ్చ రచ్చ

దిల్లీ: హ్యాకింగ్‌ ఆరోపణలు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇజ్రాయెల్‌లోని ఎన్‌ఎస్‌వో గ్రూప్‌నకు చెందిన ‘పెగాసస్‌’ స్పైవేర్‌తో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీపై కూడా గతంలో నిఘా కొనసాగినట్లు తాజాగా వెల్లడైంది! ఈ స్పైవేర్‌ లక్షిత జాబితాలో రాహుల్‌ ఫోన్‌ నంబర్లు కనీసం రెండు ఉన్నాయని ‘ది వైర్‌’ వార్తాసంస్థ సోమవారం ఓ కథనంలో తెలిపింది. ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా ఉన్న ప్రహ్లాద్‌ పటేల్‌, అశ్వినీ వైష్ణవ్‌లతో పాటు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కూడా బాధితుల జాబితాలో ఉన్నారంది. మరోవైపు- పెగాసస్‌ వ్యవహారంపై కేంద్రం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మోదీ సర్కారు దేశ ద్రోహానికి పాల్పడిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేసింది. ప్రధాని పాత్రపైనా దర్యాప్తు అవసరమని వ్యాఖ్యానించింది. ప్రతిపక్షాల విమర్శలను కేంద్రం దీటుగా తిప్పికొట్టింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో భారత ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకే అనుచిత ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది.  హ్యాకింగ్‌లో తమ ప్రమేయమేదీ లేదని స్పష్టం చేసింది. అధికార పక్షానికిగానీ, ప్రభుత్వానికిగానీ ఈ వ్యవహారంతో సంబంధం ఉందని చెప్పేందుకు ఆధారాలేవీ లేవంది. భారత్‌లో ఇద్దరు కేంద్ర మంత్రులు, ముగ్గురు కీలక విపక్ష నేతలు, పలువురు వ్యాపారవేత్తలు, 40 మందికి పైగా జర్నలిస్టులు సహా మొత్తం 300 మందికి పైగా ప్రముఖుల ఫోన్‌ నంబర్లు పెగాసస్‌ లక్షిత జాబితాలో ఉన్నట్లు ‘ది వైర్‌’ ఆదివారం సంచలనాత్మక కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ఆ వార్తాసంస్థ అందించిన తాజా కథనం ప్రకారం..
హ్యాకింగ్‌/నిఘా కోసం భారత్‌కు చెందిన ఓ అధికారిక క్లయింట్‌ నుంచి ఎన్‌ఎస్‌వో గ్రూప్‌నకు 300కు పైగా ఫోన్‌ నంబర్లు అందాయి. వాటిలో రాహుల్‌ గాంధీకి చెందిన నంబర్లు కనీసం రెండు ఉన్నాయి. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు.. 2018-2019 మధ్య ఆయన్ను లక్ష్యంగా చేసుకోవాలని ఆదేశాలు అందాయి. 2019 తర్వాత రాహుల్‌ ఆ ఫోన్‌ నంబర్లను వినియోగించడం మానేశారు. 2014 సార్వత్రిక సమరం సమయంలో భాజపా ప్రచార కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్‌ కిశోర్‌ పేరు కూడా లక్షిత జాబితాలో ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎక్కువగా భాజపా వ్యతిరేక పార్టీలతోనే ఆయన కలిసి పనిచేశారు. మాజీ ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లవాసా ఫోన్‌ కూడా హ్యాకింగ్‌కు గురైనట్లు తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని మోదీ, అమిత్‌ షాలపై వచ్చిన ఫిర్యాదులపై ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన తీర్పులో ఆయన భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి గమనార్హం. ప్రస్తుతం కేంద్ర ఐటీ శాఖ మంత్రిగా ఉన్న అశ్వినీ వైష్ణవ్‌ ఫోన్‌ను 2017లో లక్ష్యంగా చేసుకున్నారు. అప్పటికి ఆయన మంత్రి పదవిలో గానీ, ఎంపీగా గానీ లేరు.

2016 నుంచి..

భారతీయ ప్రముఖులపై 2016 నుంచి పెగాసస్‌తో నిఘా కొనసాగుతోంది. తాజా జాబితాలోని ఎక్కువ ఫోన్‌ నంబర్లను 2018-2019 మధ్య లక్ష్యంగా చేసుకున్నారు. అయితే జాబితాలో ఉన్న అన్ని ఫోన్‌ నంబర్లూ హ్యాకింగ్‌కు గురయ్యాయని చెప్పేందుకు తగినన్ని ఆధారాలు లేవు

ఖషోగ్గీ ప్రియురాలిపైనా..

పెగాసస్‌ లక్షిత జాబితాలో ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’కు చెందిన దివంగత జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్గీ ప్రియురాలు హాటిస్‌ సెంగిజ్‌ కూడా ఉన్నారు. 2018లో ఇస్తాంబుల్‌లోని సౌదీ అరేబియా కాన్సులేట్‌లో ఖషోగ్గీ హత్యకు గురయ్యాక కేవలం నాలుగు రోజులకే ఆమె ఫోన్‌లోకి స్పైవేర్‌ను చొప్పించారు. అల్‌-జజీరా వార్తాసంస్థకు చెందిన పలువురు పాత్రికేయులు, న్యూయార్క్‌ టైమ్స్‌ బీరుట్‌ బ్యూరో చీఫ్‌ బెన్‌ హబర్డ్‌ సహా పలువురు బాధితుల జాబితాలో ఉన్నారు.

తోసిపుచ్చిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌

హ్యాకింగ్‌ ఆరోపణలను ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ తోసిపుచ్చింది. దానిపై ప్రస్తుతం వస్తున్న వార్తలన్నీ కేవలం ఊహాగానాలేనని తేల్చిచెప్పింది. ఈ ఆరోపణలకు సంబంధించి పరువు నష్టం దావా వేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపింది. ఉగ్రవాదులు, కరడు గట్టిన నేరగాళ్లపై నిఘా కోసం ఉపయోగించేందుకే ప్రభుత్వ సంస్థలకు తాము పెగాసస్‌ను విక్రయిస్తుంటామని మరోసారి స్పష్టం చేసింది. కస్టమర్ల డేటాలోకి తాము ఎప్పుడూ తొంగిచూడబోమని పేర్కొంది.

దేశాన్ని అవమానించేందుకే: అమిత్‌ షా

తాజా కలకలంపై అమిత్‌ షా స్పందిస్తూ.. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను అవమానించడమే లక్ష్యంగా ఏం చేసేందుకైనా కొంతమంది సిద్ధపడుతున్నారని అన్నారు. ప్రస్తుత హ్యాకింగ్‌ ఆరోపణలు వారి పనేనని ఆరోపించారు. అయితే, వారు తమ కుట్రలతో ఎంతగా ప్రయత్నించినప్పటికీ ప్రగతి పథం నుంచి భారత్‌ను పక్కకు తప్పించలేరని పేర్కొన్నారు. దేశ సంక్షేమానికే మోదీ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఉద్ఘాటించారు. హ్యాకింగ్‌పై ఆరోపణలు చేసినవారి విశ్వసనీయతను భాజపా సీనియర్‌ నేత రవిశంకర్‌ ప్రసాద్‌ ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చిన వార్తాసంస్థ గతంలో అనేక అవాస్తవ కథనాలను ప్రచురించిందని.. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ గతంలో కూడా అనేక రూపాల్లో ‘భారత వ్యతిరేక’ ఎజెండాను బయటపెట్టుకుందని పేర్కొన్నారు.


50 వేలకు పైగా నంబర్లు

పెగాసస్‌ స్పైవేర్‌తో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 50 వేలకు పైగా ఫోన్‌ నంబర్లను ప్రభుత్వ సంస్థలు లక్ష్యంగా చేసుకున్నాయి. అందులో వెయ్యికి పైగా నంబర్లు 50 దేశాల్లోని వ్యక్తులవని ఇప్పటివరకు తేలింది. బాధితులుగా నిర్ధారణ అయినవారిలో 189 మంది పాత్రికేయులు, 600 మందికి పైగా రాజకీయ నాయకులు, కనీసం 65 మంది వ్యాపారవేత్తలు, 85 మంది మానవ హక్కుల కార్యకర్తలు, పలువురు ప్రభుత్వాధినేతలు ఉన్నారు. లక్షిత జాబితాలో అత్యధికంగా 15 వేల నంబర్లు.. మెక్సికో వాసులకు చెందినవి. పారిస్‌ కేంద్రంగా పనిచేసే ‘ఫర్బిడన్‌ స్టోరీస్‌’ అనే స్వచ్ఛంద సంస్థ, మానవ హక్కుల సంస్థ ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌’ తాజా డేటాబేస్‌ను సంపాదించి, ప్రపంచవ్యాప్తంగా 16 వార్తాసంస్థలకు ఆ వివరాలను అందించిన సంగతి గమనార్హం. జాబితాలో ఉన్న 15 మంది జర్నలిస్టుల ఫోన్లను ఆమ్నెస్టీ విశ్లేషించగా.. వాటిలోకి పెగాసస్‌ చొరబడినట్లు నిర్ధారణ అయింది.


సర్కారుది దేశ ద్రోహం: కాంగ్రెస్‌

పెగాసస్‌ కలకలం నేపథ్యంలో కాంగ్రెస్‌ సహా పలు ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డాయి. మోదీ సర్కారు దేశ ద్రోహానికి పాల్పడిందని, జాతి ప్రయోజనాలను పణంగా పెట్టిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. దిల్లీలో పలు విపక్ష పార్టీల నేతలతో కలిసి కాంగ్రెస్‌ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా సోమవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ‘‘అక్రమ స్పైవేర్‌- పెగాసస్‌ మోహరింపునకు హోం మంత్రి అమిత్‌ షాయే బాధ్యులు. ఆయన్ను వెంటనే పదవి నుంచి తప్పించాలి. అదే విపక్షాల తొలి డిమాండ్‌. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాని మోదీ పాత్రపైనా దర్యాప్తు జరిపించాలి. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది’’ అని పేర్కొన్నారు. న్యాయమూర్తులు, పాత్రికేయులు, విపక్ష నేతలు సహా సహా ప్రజలందరి వాక్‌ స్వాతంత్య్రం, ప్రాథమిక హక్కులపై ప్రభుత్వం దాడి చేసిందని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే విమర్శించారు. ప్రధాని మోదీ ప్రజల ఫోన్‌లలోని అన్ని విషయాలను చదువుతున్నారని అర్థం వచ్చేలా.. ‘పెగాసస్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఓ ట్వీట్‌ చేశారు. తాజా వ్యవహారంపై స్వతంత్ర జ్యుడీషియల్‌ విచారణ లేదా పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు అవసరమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ అభిప్రాయపడ్డారు. ‘పెగాసస్‌’ అంశాన్ని పార్లమెంటులో ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా లేవనెత్తుతాయన్నారు. హ్యాకింగ్‌ ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్సీపీ డిమాండ్‌ చేసింది. తాజా కలకలంపై ప్రధాని మోదీ, అమిత్‌ షా వివరణ ఇవ్వాలని శివసేన అభిప్రాయపడింది.


లక్షిత జాబితాలో ఇంకెవరున్నారంటే..

* తృణమూల్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ (పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు)
* సుప్రీం కోర్టు ఉద్యోగి (మాజీ సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగొయిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళ), ఆమె సమీప బంధువులకు చెందిన 11 నంబర్లు
*జగ్‌దీప్‌ ఛోఖర్‌ (అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌-ఏడీఆర్‌ వ్యవస్థాపకుడు)
* ప్రముఖ వైరాలజిస్టు గగన్‌దీప్‌ కాంగ్‌
* హరిమేనన్‌ (బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ భారతీయ విభాగం అధినేత), గేట్స్‌ ఫౌండేషన్‌కు చెందిన మరో ఉద్యోగి
* రాజస్థాన్‌ సీఎంగా వసుంధరా రాజె ఉన్నప్పుడు ఆమెకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి
*సంజయ్‌ కచ్రూ (2014-15లో స్మృతి ఇరానీ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆమె వద్ద ఓఎస్డీ)
*విశ్వహిందూ పరిషద్‌ నేత ప్రవీణ్‌ తొగాడియా
* భాజపాకు చెందిన కొంతమంది జూనియర్‌ నాయకులు

తరచూ ఫోన్‌ నంబర్లు మార్చా: రాహుల్‌

గతంలో తనకు వాట్సప్‌లో అనుమానాస్పద సందేశాలు వచ్చాయని రాహుల్‌ గాంధీ తాజాగా తెలిపారు. వాటిలో ఒకటి స్పైవేర్‌కు వాహకం కావొచ్చని పేర్కొన్నారు. హ్యాకర్ల బారి నుంచి తప్పించుకునేందుకు తాను తరచూ ఫోన్‌ నంబర్లు మార్చానని చెప్పారు. దేశ ప్రజాస్వామ్య పునాదులపై దాడిగా పెగాసస్‌ వ్యవహారాన్ని ఆయన అభివర్ణించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని