పార్లమెంటులో మళ్లీ సెగాసస్‌

ప్రధానాంశాలు

పార్లమెంటులో మళ్లీ సెగాసస్‌

ఉభయ సభల్లో సభ్యుల ఆందోళన రేపటికి వాయిదా

దిల్లీ: దేశంలో పలువురు రాజకీయ నాయకులు, పాత్రికేయుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురై  పెగాసస్‌ (స్పై వేర్‌) నిఘాలో ఉన్నాయన్న వార్తలు మంగళవారం సయితం పార్లమెంటులో ప్రకంపనలకు కారణమయ్యాయి. విపక్షాల సభ్యులు లోక్‌సభ, రాజ్యసభల్లో నిరసనలు వ్యక్తం చేశారు. సోమవారం ఈ అంశంతో సహా వేర్వేరు విషయాల కారణంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు స్తంభించిపోయిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ కొలువుదీరగానే కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ తదితర పార్టీలకు చెందిన ప్రతిపక్ష సభ్యులు నినాద ఫలకాలు చేతపట్టి ఆందోళనకు దిగారు. తమ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ పేరు కూడా పెగాసస్‌ జాబితాలో ఉందని కాంగ్రెస్‌ సభ్యులు ప్రస్తావించారు. తృణమూల్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ ఫోన్‌ నిఘాలో ఉందంటూ ఆ పార్టీ సభ్యులు చెప్పారు. ఏ అంశంపైనైనా సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందువల్ల సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించవద్దని, చర్చకు సహకరించాలని స్పీకర్‌ ఓం బిర్లా విజ్ఞప్తి చేసినా విపక్ష ఎంపీలు తమ పట్టు సడలించలేదు. ఈ పరిస్థితుల మధ్యనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రూ.23,675 కోట్ల అదనపు వ్యయానికి సభ అనుమతి కోరుతూ ప్రతిపాదనలు ప్రవేశపెట్టారు. 


రాజ్యసభాపక్ష నేతలతో వెంకయ్యనాయుడు భేటీ

 

రాజ్యసభలోనూ పలువురు సభ్యులు పెగాసస్‌ నిఘా గురించి లేవనెత్తారు. వివిధ పార్టీల నేతలతో ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు చర్చించిన మీదట సభలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం సభ మొదలై గంట వ్యవధిలోనే రెండుసార్లు వాయిదా పడ్డాక రాజ్యసభాపక్ష నేత పీయూష్‌ గోయల్‌, విపక్ష నేతలు ఆనంద్‌ శర్మ, జైరాం రమేశ్‌, డెరెక్‌ ఓబ్రియెన్‌, తిరుచ్చి శివ తదితరులతో ఛైర్మన్‌ మాట్లాడారు. సాధారణ పరిస్థితులు నెలకొంటే అన్నింటినీ చర్చించవచ్చని చెప్పారు. ఈ మేరకు నేతలు అంగీకరించిన మేరకు.. సభ ఆ తర్వాత కొన్ని అంశాలు చర్చించగలిగింది. ఉభయ సభలు గురువారానికి వాయిదా పడ్డాయి. బక్రీద్‌ కారణంగా బుధవారం పార్లమెంటుకు సెలవు.


ఆ జాబితాలో జేఎన్‌యూ మాజీ విద్యార్థులు

దిల్లీ: పెగాసస్‌ జాబితాలో తాజాగా మరికొన్ని పేర్లు వెలుగు చూశాయి. దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) మాజీ విద్యార్థులు ఉమర్‌ ఖాలిద్‌, అనిర్బన్‌ భట్టాచార్య, బాన్‌జ్యోత్స్న లాహిరితో పాటు పలువురు ప్రముఖ ఉద్యమకారుల ఫోన్‌ నంబర్లు అందులో ఉన్నాయని ‘ది వైర్‌’ వార్తాసంస్థ మంగళవారం ఓ కథనంలో వెల్లడించింది. అఖిల భారత అంబేడ్కర్‌ మహాసభ ఛైర్మన్‌ అశోక్‌ భారతి, విద్యావేత్త బేలా భాటియా, రైల్వే యూనియన్‌ నేత శివ్‌గోపాల్‌ మిశ్ర, కార్మిక హక్కుల నేత అంజనీ కుమార్‌, దిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ సరోజ్‌ గిరి తదితరుల నంబర్లు కూడా జాబితాలో ఉన్నట్లు తెలిపింది. వీరందరి ఫోన్లు ఇప్పటికే హ్యాక్‌ అయినట్లు మాత్రం చెప్పలేమని పేర్కొంది. డిజిటల్‌ ఫోరెన్సిక్‌ విశ్లేషణలు పూర్తయితేనే దాన్ని నిర్ధారించడం వీలవుతుందని వివరించింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని