మృత్యు మహమ్మారి!
close

ప్రధానాంశాలు

మృత్యు మహమ్మారి!

ఒక్కరోజులో 3,998 మరణాల నమోదు

భారీగా పెరిగిన రోజువారీ కేసులు

ఈనాడు, దిల్లీ: దేశంలో కొవిడ్‌ మహమ్మారి ఉద్ధృతి అప్పుడప్పుడూ తగ్గుతున్నట్లు కనిపిస్తున్నా.. ఆందోళనకర రీతిలోనే కొనసాగుతోంది. రోజువారీ కేసులు, మరణాల సంఖ్య బుధవారం ఒక్కసారిగా పెరిగింది. ఈనెల 15 తర్వాత క్రియాశీలక కేసులు కూడా మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో 42,015 కొత్త కేసులు బయటపడగా.. 3,998 మరణాలు నమోదయ్యాయి. పాత లెక్కలను సరిచేసి మహారాష్ట్రలో కొత్తగా 3,509 మరణాలను కలపడంతో దేశవ్యాప్త మరణాల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఈ రాష్ట్రంలో పాతవి, కొత్తవి కలిపి మొత్తం 3,656 మరణాలు నమోదు కాగా, మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కలిపి 342 చోటుచేసుకున్నాయి. మహారాష్ట్రలో మరణాల లెక్కలను సరిదిద్దడం ఇది 14వ సారి. ఇలా లెక్కలను సరిచేసిన ప్రతిసారీ మరణాల సంఖ్య అమాంతం పెరుగుతూనే ఉంది. ఒక్క రోజులో మరణాల సంఖ్య ఇంత భారీగా పెరగడం జూన్‌ 12 తర్వాత ఇదే తొలిసారి. క్రితం రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య ఏకంగా 11,922 పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మరణాలు కూడా 3,600కి పైగా పెరిగాయి. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 3.12 కోట్లు దాటింది. కొవిడ్‌ బారిన పడి ఇంతవరకు 4,18,480 మంది ప్రాణాలు కోల్పోయారు.

* ఒక్క రోజులో 36,977 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. కోలుకున్నవారి కంటే కొత్త కేసులు ఎక్కువగా ఉండటంతో క్రియాశీలక కేసుల సంఖ్య 4,07,170కి పెరిగింది. ఇంతవరకు 3,03,90,687 మంది కొవిడ్‌ను జయించారు. రికవరీ రేటు స్వల్పంగా తగ్గి 97.36%కి చేరింది.

* దేశవ్యాప్తంగా గురువారం 18,52,140 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరిపారు. రోజువారీ పాజిటివిటీ రేటు 2.27%కి పెరిగింది. వారపు పాజిటివిటీ రేటు 2.09%గా ఉంది.

* కేరళలో ఒక్క రోజులో 16,848 కొత్త కేసులు నమోదయ్యాయి. క్రియాశీలక కేసులు 4,692 మేర పెరిగాయి. జూన్‌ 5 తర్వాత ఇక్కడ నమోదైన అత్యధిక కేసుల సంఖ్య ఇదే. మరోవైపు మహారాష్ట్రలోనూ గత మూడు రోజుల్లో 2 సార్లు 9 వేలకు పైగా కొత్త కేసులొచ్చాయి. రోజువారీ కేసుల పరంగా ఈ రాష్ట్రాల తర్వాత ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, తమిళనాడు, అస్సాం, కర్ణాటకలు వరుస స్థానాల్లో ఉన్నాయి. మణిపుర్‌ 8వ స్థానంలో నిలవడం ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతోంది.

* పాజిటివిటీ రేటు సిక్కిం (18.5%), మణిపుర్‌ (15.8%), మిజోరం (12.3%), కేరళ (10.9%)లలో అత్యధికంగా నమోదవుతూ వస్తోంది. రోజువారీ కేసుల వృద్ధి ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. 12 రాష్ట్రాల్లో గత 24 గంటల్లో ఒక్క మరణమూ నమోదు కాకపోవడమే కొంత ఊరట.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని