ప్రమాణాలను అందుకుంటేనే ప్రోత్సాహకాలు
close

ప్రధానాంశాలు

ప్రమాణాలను అందుకుంటేనే ప్రోత్సాహకాలు

డిస్కంలకు కేంద్రం నిర్దేశం

‘సంస్కరణల’ పథకానికి ఆమోదం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకుంటే తప్ప, వాటికి ఇకపై కేంద్ర ఆర్థిక సాయం లభించే అవకాశం లేదు. ఈ మేరకు డిస్కంల పునర్‌వ్యవస్థీకరణ (సంస్కరణల ఆధారితం, ఫలితాల అనుసంధానం) పథకానికి కేంద్ర కేబినెట్‌ ఇటీవల ఆమోదం తెలిపింది. 2024-25 నాటికి సాంకేతిక, వాణిజ్య (ఏటీ అండ్‌ సీ) నష్టాలను బాగా తగ్గించటం, విద్యుత్తు సరఫరా ఖర్చు, ఆదాయం (ఏసీసీ- ఏఆర్‌ఆర్‌) మధ్య అంతరాన్ని సున్నా స్థాయికి చేర్చటం, పంపిణీ సంస్థల్ని పూర్తిగా ఆధునికీకరించటం తదితర లక్ష్యాలతో కేంద్రం ఈ పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డిస్కంల పనితీరును ఏటా మదింపు చేస్తారు. అవి కనీసం 60శాతం మార్కులు తెచ్చుకుంటేనేగానీ, వాటికి ఆ సంవత్సరం కేటాయించిన నిధులు మంజూరయ్యే అవకాశం లేదు. 2025-26 వరకూ అమలులో ఉండే ఈ పథకానికి అయ్యే వ్యయం రూ.3,03,758 కోట్లు కాగా.. ఇందులో కేంద్రం వాటా రూ.97,631 కోట్లు. గ్రామీణ విద్యుదీకరణ సంస్థ(ఆర్‌ఈసీ), పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఏసీ) నోడల్‌ ఏజెన్సీలుగా వ్యవహరిస్తాయి.

ఈ పథకం అమలు ఇలా..

* దేశవ్యాప్తంగా దాదాపు 10 వేల వ్యవసాయ ఫీడర్లను విభజించి, పీఎం కుసుం పథకంతో అనుసంధానిస్తారు. దీని ద్వారా పగటి పూట రైతులకు సౌరవిద్యుత్తు అందుతుంది. అదనపు సౌరవిద్యుత్తు విక్రయం ద్వారా రైతులు ఆదాయాన్ని గడించగలుగుతారు. దీనిపై అన్ని రాష్ట్రాలు ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంది.

* 2023 డిసెంబరులోగా మొదటి దశలో మొత్తం 10 కోట్ల స్మార్ట్‌మీటర్లను ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలి. ఫీడర్‌, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లకూ మీటర్లు బిగించాలి.

* నష్టాలను తగ్గించుకుని, భవిష్యత్తు డిమాండ్‌ను అంచనా వేసుకునేందుకు నెలవారీగా ఎనర్జీ అకౌంటింగ్‌ నివేదికలను రూపొందించాలి. పంపిణీ రంగంలో కృత్రిమమేధ ద్వారా సాంకేతిక ప్రయోజనాలను అందుకోవాలి. ఐటీ ఆధారిత ఉపకరణాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని