తక్షణమే సహాయ చర్యలు

ప్రధానాంశాలు

తక్షణమే సహాయ చర్యలు

  మంత్రులు, ఎమ్మెల్యేలు స్థానికంగానే ఉండాలి

ఆగస్టు 10 దాకా అప్రమత్తత అవసరం

యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగండి

లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు తరలించాలి

వర్షాలు, వరదలపై సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతాధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లను ఆదేశించారు. యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు స్థానికంగానే ఉండాలని స్పష్టం చేశారు. ‘‘గోదావరి, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఎగువ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల గేట్లు తెరుస్తున్నారు. నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (ఎన్డీఆర్‌ఎఫ్‌) బృందాలను పెద్దఎత్తున రప్పించండి. సహాయచర్యలకు హెలికాప్టర్లను తెప్పించాలి. తక్షణమే అనుభవజ్ఞులైన అధికారులతో వరద నిర్వహణ బృందాన్ని ఏర్పాటు చేయండి. తక్షణమే కొత్తగూడెం, ఏటూరునాగారం, మంగపేట, ఆర్మూరు, నిర్మల్‌, భైంసా ప్రాంతాల్లో పర్యవేక్షణకు ఆర్మీ హెలికాప్టర్లలో తక్షణమే సీనియర్‌ అధికారులను పంపించాలి.   ఆగస్టు 10 దాకా వర్షాలు కొనసాగే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మూసీ నదికి వరదలు, భారీ వర్షాల దృష్ట్యా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ హైదరాబాద్‌లో తగిన జాగ్రత్తలూ తీసుకోవాలి. నగరంలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఇండ్ల నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కఠినంగా వ్యవహరించాలి’’ అని స్పష్టం చేశారు. గురువారం ప్రగతిభవన్‌లో ఆయన భారీ వర్షాలు, వరదలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

  మహాబలేశ్వరంలో 70 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం
‘‘గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలోని పశ్చిమకనుమల్లో విపరీతంగా వాన పడుతోంది. మహాబలేశ్వరంలో 70 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. రిజర్వాయర్‌లు, ప్రాజెక్ట్‌ల నుంచి నీటిని నెమ్మదిగా వదలాలి’’ అని సీఎం కేసీఆర్‌ సూచించారు.

ఇంద్రకరణ్‌రెడ్డికి ముఖ్యమంత్రి ఫోన్‌

నిర్మల్‌ పట్టణం నీట మునిగిందన్న సమాచారం తెలుసుకొని సీఎం వెంటనే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. అక్కడకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపాలని సీఎస్‌ను ఆదేశించారు. నిజామాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున పరిస్థితులను పర్యవేక్షించాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డికి సూచించారు.

జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్‌లు: సీఎస్‌

వరద ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటూ తక్షణ చర్యలు చేపట్టేందుకు వీలుగా 16 జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేయాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. సీఎం సమీక్ష అనంతరం ఆయన బీఆర్‌కే భవన్‌ నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. 

యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: కేటీఆర్‌

పురపాలకశాఖ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ మంత్రి కె.టి.రామారావు ఆదేశించారు. నగరాలు, పట్టణాల్లో పరిస్థితిపై ఆయన పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌, ఇతర ఉన్నతాధికారులో గురువారం చర్చించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. నిర్మల్‌ సహా ఇతర పట్టణాల్లో భారీ వర్షాలతో ఏర్పడిన ఇబ్బందులపై సమీక్షించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని