కేసీఆర్‌ పోరాటానికి కవిత్వమే స్ఫూర్తి

ప్రధానాంశాలు

కేసీఆర్‌ పోరాటానికి కవిత్వమే స్ఫూర్తి

 ఆచార్య శివారెడ్డికి ‘దాశరథి పురస్కార’ ప్రదానోత్సవంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: తెలంగాణ మలి దశ ఉద్యమంలో కేసీఆర్‌ ప్రాణాలకు తెగించి చేసిన పోరాటానికి స్ఫూర్తి దాశరథి వంటి వైతాళికులు కురిపించిన అక్షరజ్వాలలే అని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, ఆబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. రాష్ట్ర భాష, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ‘దాశరథి కృష్ణమాచార్య’ స్మారక పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త ఆచార్య ఎల్లూరి శివారెడ్డికి మంత్రి గురువారం ప్రదానం చేశారు. రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో శివారెడ్డిని పురస్కారంతో పాటు రూ.1,01,116 నగదు బహుమతితో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ..‘తెలంగాణ తెచ్చుడో.. సచ్చుడో’.. అని కేసీఆర్‌ నినదించారంటే అది కవిత్వం నుంచి పుట్టిన తెగింపే అన్నారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి అధ్యక్షోపన్యాసం చేస్తూ.. దాశరథి చెప్పిన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ నాదమై.. నినాదమై.. ‘నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం’ అనడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆధారమైందని చెప్పారు. పురస్కార గ్రహీత ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ.. ‘నేను రచించిన ‘పూలకారు’ పుస్తకాన్ని చాలా ఏళ్ల కిందట సిద్దిపేటలో కేసీఆర్‌ ఆవిష్కరించారు. ఇప్పుడు ఆయనే నన్ను దాశరథి పురస్కారానికి ఎంపిక చేయడం సంతోషంగా ఉంది’ అన్నారు. కేసీఆర్‌ మాట్లాడే అచ్చమైన తెలంగాణ భాష చెరుకు గడంత తీయగా ఉంటుందని చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని