11 గంటల్లోనే 27 సెంటీమీటర్లు

ప్రధానాంశాలు

11 గంటల్లోనే 27 సెంటీమీటర్లు

 వాంకిడిలో అత్యధిక వర్షం

మరో రెండు రోజులు భారీ వర్షాలు

ఈనాడు, హైదరాబాద్‌: బంగాళాఖాతంలో గురువారం ఉదయం ఏర్పడిన అల్పపీడనానికి తోడు సముద్రానికి 7.6 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడి నైరుతి దిశగా కదులుతోంది. ఫలితంగా రాష్ట్రమంతా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. పలుచోట్ల కొద్ది గంటల వ్యవధిలోనే 20 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసింది. కుమురం భీం జిల్లా వాంకిడిలో గురువారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య.. అంటే కేవలం 11.30 గంటల వ్యవధిలో 27.30 సెంటీమీటర్ల వాన కురిసింది. జులై నెలలో ఇంత తక్కువ సమయంలో అంత వర్షపాతం నమోదుకావడం గత పదేళ్లలో ఇదే రికార్డు. 32 మండలాల్లో 11.5 నుంచి 20 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మరో 150 మండలాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ మండలాల్లో సగటున 6.4 నుంచి 11.4 సెం.మీ. వర్షం పడినట్లు వాతావరణ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో మరో రెండురోజులు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం పలు ప్రాంతాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడ్డాయని వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న పేర్కొన్నారు. మధ్య, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో శుక్రవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వెల్లడించారు. ఈ రెండు రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు. కృష్ణా, గోదావరి నదీ పరివాహక జిల్లాలకు ప్రభుత్వం హైఅలర్ట్‌ ప్రకటించింది. విద్యుత్తుశాఖ 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటుచేసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని