ఏడుగురిని మింగేసిన అతివేగం

ప్రధానాంశాలు

ఏడుగురిని మింగేసిన అతివేగం

శ్రీశైలం జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం
  అంతా హైదరాబాద్‌ వాసులే
  ప్రధాని, సీఎం సంతాపం

నాగర్‌కర్నూల్‌, ఈనాడు డిజిటల్‌; ఉప్పునుంతల, న్యూస్‌టుడే: శ్రీశైలం జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఏడు ప్రాణాలను బలికొంది. చనిపోయినవారంతా హైదరాబాద్‌ వాసులే.ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు వేగంగా ఢీకొన్నాయి. కార్లలో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీయడానకి స్థానికులు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. శుక్రవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉప్పునుంతల మండలం పిరట్వాన్‌పల్లి శివారులోని శ్రీశైలం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన నలుగురు యువకులు కారులో గురువారం శ్రీశైలం వెళ్లారు. దర్శనం చేసుకుని వస్తున్న వీరి కారు.. ఎదురుగా హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వైపు వెళ్తున్న కారు బలంగా ఢీకొన్నాయి. ప్రమాదంలో శ్రీశైలం నుంచి వస్తున్న కారులో ప్రయాణిస్తున్న తలారి వెంకటేశ్‌(వయసు 28, నిజాంపేట), వంశీకృష్ణ(28, జీడిమెట్ల), కార్తీక్‌(ఆనంద్‌బాగ్‌) అక్కడికక్కడే మృతి చెందారు. నరేశ్‌ (అమీన్‌పూర్‌లోని గండిగూడెం) తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌ నుంచి వస్తున్న కారులో ప్రయాణిస్తున్న శివకుమార్‌, తల్లి సుబ్బలక్ష్మి, బంధువులు వెంకటమూర్తి, లవమూర్తి(15) అక్కడికక్కడే మృతి చెందారు. శివకుమార్‌ సికింద్రాబాద్‌ ప్యారడైజ్డ్‌ హోటల్‌ మేనేజర్‌. తన సహ ఉద్యోగి కారు తీసుకొని శ్రీశైలం బయల్దేరారు. వీరిది హైదరాబాద్‌లోని ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌గా పోలీసులు గుర్తించారు. శ్రీశైలం నుంచి వస్తున్న కారులో ప్రయాణిస్తున్న వారు నలుగురు స్నేహితులు అని తెలిపారు. ప్రమాద ఘటన గురించి తెలియగానే పోలీసులు వెళ్లి సహాయ  చర్యలు చేపట్టారు. రెండు వాహనాలు అతివేగంతో ఉండటంతో నుజ్జు నుజ్జు అయ్యాయి. పోలీసులు.. స్థానికుల సాయంతో అతికష్టం మీద కారులోని వారిని బయటకు తీశారు. అప్పటికే ఏడుగురు చనిపోయారు. విషయం తెలుసుకున్న వెంటనే విప్‌ గువ్వల బాలరాజు, జిల్లా కలెక్టర్‌ శర్మన్‌, ఎస్పీ సాయిశేఖర్‌ సంఘటన స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన నరేశ్‌ను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలించారు. మృతదేహాలను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రి శవాగారంలో ఉంచారు.

ప్రధాని సంతాపం
ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం తెలియజేశారు. మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబానికి పీఎం జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వ్యక్తికి రూ.50,000 పరిహారం ప్రకటించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా సంతాపం ప్రకటించారు.

ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి
ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయినవారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు ఫోన్‌చేసి సంఘటనపై ఆరా తీశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని