‘మహా’ విషాదం

ప్రధానాంశాలు

‘మహా’ విషాదం

మహారాష్ట్రను ముంచెత్తిన వానలు
రెండ్రోజుల్లో 129 మంది మృత్యువాత
కొండచరియలు కూలి ఒక్క గ్రామంలోనే 38 మంది సమాధి

ముంబయి: మహారాష్ట్రను అతిభారీ వర్షాలు, కొండచరియలు, వరదలు కుదిపేస్తున్నాయి. కొంకణ్‌ ప్రాంతంలోని రత్నగిరి, రాయ్‌గడ్‌ జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. సతారా జిల్లాలోని మహాబలేశ్వర్‌, నవజాల్లో కురుస్తున్న ‘అసాధారణ భారీ వర్షాలు’ ఇందుకు ప్రధాన కారణమవుతున్నాయి. గురు, శుక్రవారాల్లో రాష్ట్రం మొత్తం మీద 129 మంది మరణించారు. రాయ్‌గడ్‌ జిల్లాలోని మహద్‌ తాలూకా తలాయి గ్రామంలో గురువారం సాయంత్రం కొండచరియలు విరిగి 38 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ సమారు 30 ఇళ్లు ఉండగా బండలు పడడంతో ఆ గ్రామం మొత్తం తుడుచుపెట్టుకుపోయినట్టయింది. సతారా జిల్లాలోని పాఠన్‌ తాలూకాలోని అంబేఘర్‌, మిర్‌గావ్‌ గ్రామాల సమీపంలో గురువారం రాత్రి రెండు కొండచరియలు కూలిన దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. అంబేఘర్‌లో నాలుగు ఇళ్లు మట్టిలో కూరుకుపోవడంతో 13-14 మంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు. మిర్‌గావ్‌లో మరో నాలుగు ఇళ్లు కూలిపోయాయని, అందులో 8-10 మంది చిక్కుకున్నారని చెప్పారు. రత్నగిరి జిల్లాలో కొండచరియలు విరిగిపడడంతో పది మంది చిక్కుకున్నారు. తూర్పు ముంబయిలోని గోవండి ప్రాంతం శివాజీ నగర్‌లో శుక్రవారం తెల్లవారు జామున ఇల్లు కూలడంతో నలుగురు మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. 

నదిలో కొట్టుకుపోయిన బస్సు

కొల్హాపూర్‌ జిల్లా భుదర్గాడ్‌ తహసీల్‌ పంగైర్‌ గ్రామం వద్ద శుక్రవారం వేకువ జాము 2.30 గంటల ప్రాంతంలో ఓ బస్సు నదిలో కొట్టుకుపోయింది. చికోడి నది వంతెనపై నుంచి వరద ప్రవహిస్తున్నా, దాన్ని పట్టించుకోకుండా డ్రైవర్‌ వాహనాన్ని ముందుకు నడిపాడు. వరద ప్రవాహాన్ని తట్టుకోలేక అది అందులో కొట్టుకుపోయింది. పరిస్థితిని గమనించి అంతకుముందే అందులోని 11 మంది కిందకు దిగడంతో ప్రాణాలతో బయటపడ్డారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని