గోదారి ఉగ్రరూపం

ప్రధానాంశాలు

గోదారి ఉగ్రరూపం

సమ్మక్కసాగర్‌ వద్ద 12.28 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
ఆలమట్టి దిగువన అప్రమత్తత ప్రకటించిన కర్ణాటక

ఈనాడు, హైదరాబాద్‌: గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. మహారాష్ట్రతోపాటు ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో నదికి పెద్దఎత్తున వరద వస్తోంది. ప్రాణహిత, మానేరు నదులు, స్థానిక వాగులు ఉప్పొంగి గోదావరిలో కలుస్తుండటంతో నదిలో 12.28 లక్షల క్యూసెక్కులకుపైగా ప్రవాహం నమోదవుతోంది. సాధారణంగా ఆగస్టు, సెప్టెంబరు మధ్య కాలంలో గోదావరిలో ఇంత భారీ వరద ఉంటుంది. గత ఏడాది కూడా ఆగస్టు 16వ తేదీన భారీ ప్రవాహం నమోదైంది. కృష్ణా నదిలో కూడా ప్రవాహం పెరుగుతోంది. ఆలమట్టి, నారాయణపూర్‌ల నుంచి మూడు లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. వరద మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఆలమట్టి దిగువ నదీ తీర పాంతాల్లో  కర్ణాటక అప్రమత్తత ప్రకటించింది.

ప్రాణహిత, మానేరు కలిసి గో‘దారి’

గోదావరికి ప్రాణహిత, మానేరు నదులు, ఇతర వాగులు తోడయ్యాయి. శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు నుంచి లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీ వరకు గేట్లు బార్లా తెరిచారు. ఎస్సారెస్పీకి నుంచి దిగువకు రెండు లక్షలకు పైగా క్యూసెక్కులు వస్తుండగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకునేసరికి అది నాలుగు లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా సమ్మక్క సాగర్‌ (తుపాకుల గూడెం) మొత్తం గేట్లు 59 తెరిచి దిగువకు 12.28 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలానికి పెరుగుతున్న ప్రవాహం

కృష్ణా నదిలో ఆలమట్టి, నారాయణపూర్‌ల నుంచి విడుదల చేస్తున్న మూడు లక్షల క్యూసెక్కులు జూరాల ప్రాజెక్టు మీదుగా శనివారం సాయంత్రం నాటికి శ్రీశైలాన్ని తాకే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ జల విద్యుత్‌ కేంద్రం నుంచి 31,783 క్యూసెక్కులు సాగర్‌వైపు విడుల చేస్తున్నారు. పులిచింతలకు 13 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా తెలంగాణ జల విద్యుత్‌ కేంద్రం నుంచి 13,200 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. మూసీ, మున్నేరు, కిన్నెరసానిలలో కూడా ప్రవాహం పెరుగుతోంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని