మన రామప్పకు విశ్వఖ్యాతి

ప్రధానాంశాలు

మన రామప్పకు విశ్వఖ్యాతి

2020 సంవత్సరానికి ప్రపంచ స్థాయి కట్టడంగా గుర్తింపు 

తెలుగు రాష్ట్రాల నుంచి మొదటిది

దౌత్యంతో దక్కిన విజయం

వ్యతిరేకించిన నార్వే.. వెన్నంటి నిలిచిన రష్యా

అండగా మరో 17 దేశాలు సైతం

కల ఫలించింది.. కాకతీయుల కళావైభవానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది.  క్రీ.శ. 1213లో గణపతిదేవుని సైన్యాధ్యక్షుడు రేచర్లరుద్రుడు ఇసుక పునాదులపై నిర్మించిన రామప్ప దేవాలయాన్ని యునెస్కో చారిత్రక సంపదగా గుర్తించింది. తెలుగు నేలపై ఈ ఘనత సాధించిన తొలి నిర్మాణమిది. శిల్పి పేరుతో ములుగు జిల్లా పాలంపేట గ్రామంలోనే కొలువైన ఈ ప్రఖ్యాత ఆలయం నేడు తాజ్‌మహల్‌, ఎర్రకోట వంటి కట్టడాల సరసన సగర్వంగా నిలిచింది.

దిల్లీ, ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి ఈనాడు, వరంగల్‌, హైదరాబాద్‌: అద్భుతమైన శిల్పసౌందర్యానికి, అరుదైన నిర్మాణ కౌశలానికి, వందల ఏళ్ల చరిత్రకు, కాకతీయుల వైభవానికి నెలవైన తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం అరుదైన ఘనత సాధించింది. 2020 సంవత్సరానికి ప్రపంచస్థాయి కట్టడంగా యునెస్కో (యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ సైంటిఫిక్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌) గుర్తింపు పొందింది. చైనాలో జరిగిన యునెస్కో సమావేశం రామప్పకు ప్రపంచ వారసత్వ కట్టడ హోదాను కల్పించినట్లు కేంద్ర పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జాన్‌విజ్‌ వెల్లడించారు. ఈనెల 16 నుంచి 44వ యునెస్కో హెరిటేజ్‌ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆదివారం జరిగిన ఓటింగ్‌ ప్రక్రియ, చర్చలో రామప్పకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. తెలంగాణ నుంచి మూడు చారిత్రక కట్టడాలు పోటీ పడగా అవన్నీ వరంగల్‌ ఉమ్మడి జిల్లా నుంచి ఉన్నవే. ఖిలా వరంగల్‌, వేయి స్తంభాల గుడి తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయాయి. రామప్ప ఆలయానికి భిన్న శైలి, శిల్పకళా నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం తదితర ఎన్నో అరుదైన అర్హతలు ఉండటంతో యునెస్కో గుర్తింపును దక్కించుకుంది.

వ్యూహాత్మకంగా పావులు కదిపిన భారత్‌

రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు అంత సులువుగా దక్కలేదు. దౌత్యమార్గాల్లో వ్యూహాత్మకంగా పావులు కదపడం ద్వారా భారత్‌ దాన్ని సాధించింది. ఈ ప్రక్రియలో రష్యా మన దేశానికి తోడుగా నిలిచింది. రామప్పను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడానికి సంబంధించి 2019లో నామినేషన్‌ దాఖలైంది. ప్రపంచ వారసత్వ కమిటీ (డబ్ల్యూహెచ్‌సీ) ఆమోదం లభిస్తేనే ఈ గుర్తింపు సాధ్యమవుతుంది. అదే ఏడాది రామప్పను సందర్శించిన ‘అంతర్జాతీయ స్మారకాలు, స్థలాల మండలి (ఐసీవోఎంవోఎస్‌)’.. తొమ్మిది లోపాలను ఎత్తిచూపింది. దీంతో భారత్‌ దౌత్యపరమైన చర్యలకు ఉపక్రమించింది. డబ్ల్యూహెచ్‌సీ ఓటింగ్‌లో పాల్గొననున్న దేశాలకు రామప్ప గొప్పతనాన్ని వివరించింది. దానికి యునెస్కో గుర్తింపు దక్కాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పింది.

వాయిదా వేయాలని యత్నం

చైనాలోని ఫుఝౌ వేదికగా ఆదివారం ఆన్‌లైన్‌లో జరిగిన డబ్ల్యూహెచ్‌సీ సమావేశంలో ఐసీవోఎంవోఎస్‌ మళ్లీ మోకాలడ్డింది. రామప్ప నామినేషన్‌ పరిశీలనను వాయిదా వేయాలని అభిప్రాయపడింది. వెంటనే రంగంలోకి దిగిన రష్యా.. ‘22.7 నిబంధన’ను ప్రస్తావించింది. ఈ సమావేశంలోనే గుర్తింపునివ్వొచ్చని పేర్కొంది. ఇథియోపియా, ఒమన్‌, బ్రెజిల్‌, ఈజిప్ట్‌, స్పెయిన్‌, థాయిలాండ్‌, హంగేరీ, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా సహా మరికొన్ని దేశాలు దానికి మద్దతు పలికాయి. నార్వే మాత్రం వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఐసీవోఎంవోఎస్‌ ఎత్తిచూపిన లోపాలను ప్రస్తావించింది. ఆలయ సరిహద్దుల్లో భారీ మార్పులు చేపట్టాలని డిమాండ్‌ చేసింది. ఇతర దేశాలు మాత్రం స్వల్ప మార్పులు సరిపోతాయని సూచించాయి. దీనిపై పెద్ద చర్చ నడిచింది. రష్యా, మరో 17 దేశాలు భారత్‌కు అండగా నిలవడంతో ఎట్టకేలకు రామప్పకు గుర్తింపు దక్కింది. వాస్తవానికి ఈ ఆలయానికి యునెస్కో గుర్తింపునివ్వడంపై గత ఏడాదే చర్చ జరగాల్సి ఉన్నా.. కరోనా మహమ్మారి కారణంగా డబ్ల్యూహెచ్‌సీ సమావేశం ఆలస్యమైంది.
వారసత్వ హోదా రావాలంటే ప్రపంచంలోని మిగతా కట్టడాల కన్నా భిన్నంగా ఉండాలి. దీన్ని ‘అవుట్‌ స్టాండింగ్‌ యూనివర్సల్‌ వాల్యూ’గా వ్యవహరిస్తారు. రామప్ప ఆలయాన్ని యునెస్కోకు నామినేట్‌ చేసే క్రమంలో సమర్పించే ‘డోసియర్‌’ (పుస్తకం)లో ఆ ప్రత్యేకతలను సమగ్రంగా పొందుపరిచారు. కేంద్ర పురావస్తు శాఖ డోసియర్‌ రూపొందించడానికి సుమారు రూ. 25 లక్షల వరకు వెచ్చించింది. యునెస్కో ప్రతినిధులు లేవనెత్తిన సందేహాలపై మూడుసార్లు వివరాలు సమర్పించారు. క్షేత్ర అనే కన్సల్టెన్సీ ద్వారా దీనిని రూపొందించారు.

దేశంలో 39వ కట్టడం

తెలుగు రాష్ట్రాల్లో ఈ హోదా దక్కిన మొదటి కట్టడం రామప్ప. యునెస్కో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకతగల వారసత్వ కట్టడాలు, సహజ వింతలు, రెండు కలిసిన ప్రాంతాలకు వారసత్వ హోదా ఇస్తుంది. ఇలా మన దేశంలో ఇప్పటివరకు 38 ప్రాంతాలకు గుర్తింపు ఇచ్చింది. వాటిలో 30 వారసత్వ కట్టడాలు కాగా, ఏడు సహజ వింతలు. ఒకటి చరిత్ర, సహజ వింత కలిసిన ప్రాంతం. రామప్ప దేశంలో 39వ కట్టడం. మహారాష్ట్రలో 6 ప్రాంతాలకు యునెస్కో గుర్తింపు దక్కింది. మరే రాష్ట్రంలోనూ అన్ని గుర్తింపు పొందలేదు.

వీటికీ గుర్తింపు

చైనాలోని ఫుఝౌ వేదికగా జరుగుతున్న డబ్ల్యూహెచ్‌సీ 44వ సమావేశాల్లో రామప్ప ఆలయంతో పాటు ట్రాన్స్‌-ఇరానియన్‌ రైల్వే (ఇరాన్‌), క్వాంఝౌ-ఎంపోరియం ఆఫ్‌ ది వరల్డ్‌ (చైనా), పాసియో డెల్‌ ప్రడో అండ్‌ బ్యూన్‌ రెటిరో (స్పెయిన్‌), హిమ కల్చరల్‌ ఏరియా (సౌదీ అరేబియా), ది గ్రేట్‌ స్పా టౌన్స్‌ ఆఫ్‌ యూరోప్‌ (ఏడు దేశాల్లోని 11 పట్టణాలు), కొర్డౌవాన్‌ లైట్‌హౌజ్‌ (ఫ్రాన్స్‌), మాథిల్డెన్హోహ డార్మ్‌స్టాడ్‌ (జర్మనీ), ప్రెస్కో సైకిల్స్‌-పాడ్వా (ఇటలీ) కూడా యునెస్కో గుర్తింపును దక్కించుకున్నాయి.


యునెస్కో గుర్తింపు ఎందుకు లభించిందంటే...


1. తేలియాడే ఇటుకలు

ఆలయ శిఖరాన్ని నీళ్లలో తేలియాడే చాలా తేలికపాటి ఇటుకలతో రూపొందించారు.


2. ఇసుకలో పునాది

భూకంపాలు వచ్చినా కుంగి పోకుండా ఇసుకలో పునాది (శాండ్‌ బాక్స్‌ పరిజ్ఞానం)తో నిర్మించారు.


3. నల్లరాయితో అద్భుతం

ఆలయం నిర్మించిన కృష్ణ శిల ప్రపంచంలోనే కఠిన శిలగా పేరొందిన నల్లరాయి (బ్లాక్‌ డోలరైట్). ఈ శిలతో అందమైన శిల్ప కళాకృతులను మలచిన తీరు దేశంలో మరెక్కడా లేదు.


ప్రయోజనాలెన్నో..

యునెస్కో గుర్తింపు వల్ల ఆలయం కొలువై ఉన్న పాలంపేట గ్రామం అంతర్జాతీయ పర్యాటక పటంలో గుర్తింపు పొందుతుంది. దీని పరిరక్షణ, నిర్వహణకు ‘ప్రపంచ వారసత్వ నిధి’ (వరల్డ్‌ హెరిటేజ్‌ ఫండ్‌) ద్వారా నిధులు అందుతాయి. వరల్డ్‌ హెరిటేజ్‌ పబ్లికేషన్స్‌ ద్వారా వచ్చే ఆదాయంలో వాటా దక్కుతుంది. దీంతోపాటు అంతర్జాతీయంగా అనేక స్వచ్ఛంద సంస్థలు విరాళాలు ఇస్తాయి. కేంద్ర పురావస్తుశాఖ ఏటా ప్రత్యేక నిధులు కేటాయించి పరిరక్షించాల్సి ఉంటుంది. దేశ, విదేశీ యాత్రికుల రాక పెరిగి, స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. యాత్రికుల కోసం రవాణా సౌకర్యం, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. రామప్పకు గుర్తింపు వల్ల వరంగల్‌లో ప్రతిపాదిత మామునూరు విమానాశ్రయం పనులు కూడా వేగంగా జరిగే అవకాశం ఉంది. రామప్ప ఆలయం ముందు రోడ్డు వేసిన సమయమలో బయల్పడిన శిలామండపాన్ని.. పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలో వెలికితీసి ప్రదర్శనయోగ్యం చేయనున్నారు.


సుసంపన్న వారసత్వానికి గుర్తింపు

కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) ఆలయం యునెస్కో ప్రపంచవారసత్వ సంపదగా గుర్తింపు పొందడం చాలా సంతోషకరం. సుసంపన్నమైన వారసత్వానికి గొప్ప గుర్తింపు ఇది. తెలంగాణ ప్రజలకు అభినందనలు

- ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు


కళ్లారా చూడండి

ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు. దిగ్గజ రామప్ప దేవాలయం కాకతీయ సామ్రాజ్య ఉత్కృష్ట కళాకౌశలానికి ప్రతిబింబం. అందరూ ఈ మహత్తరమైన ఆలయ సముదాయాన్ని కళ్లారా చూసి  అద్భుతమైన అనుభూతిని పొందండి.

- ట్విట్టర్‌లో ప్రధాని మోదీ


దేశం గర్విస్తోంది

రామప్ప గుడిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించడం యావత్‌ దేశానికి ఆనందకరమైన విషయం. ఈ దిగ్గజ ఆలయం గొప్ప భారతీయ సాంకేతిక నైపుణ్యానికి, శిల్పకళకు మంచి ఉదాహరణ.

-అమిత్‌షా, కేంద్ర హోం మంత్రి


రాష్ట్రానికి గర్వకారణం

-  రామప్పకు ప్రపంచ గుర్తింపుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం

ఈనాడు, హైదరాబాద్‌: ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తించడం తెలంగాణకు గర్వకారణమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇది మరుపురాని రోజని హర్షం వ్యక్తంచేశారు. కాకతీయ రాజులు అత్యంత సృజనాత్మకంగా, గొప్ప శిల్పకళా నైపుణ్యంతో సృష్టించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపద దేశంలోనే ప్రత్యేకమైనదన్నారు. ఇక్కడి చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మిక సంస్కృతికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. రామప్ప గుడికి గుర్తింపు విషయంలో మద్దతు తెలిపిన యునెస్కోలోని సభ్య దేశాలకు, సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ హోదా కోసం కృషి చేసిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులను ఆయన అభినందించారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్పకు యునెస్కో గుర్తింపుపై మంత్రి కేటీ రామారావు సంతోషం వ్యక్తంచేశారు. యునెస్కో నుంచి తెలంగాణకు వచ్చిన తొలి గుర్తింపు ఇదని తెలిపారు. తదుపరి లక్ష్యం ప్రపంచ వారసత్వ నగరంగా హైదరాబాద్‌కు గుర్తింపు తేవడమేనని పేర్కొన్నారు. దానికి అన్ని అర్హతలూ ఉన్నాయని చెప్పారు.  


కేంద్ర శాఖలు చాలా శ్రమించాయి: కిషన్‌రెడ్డి

రామప్ప ఆలయానికి ప్రపంచవారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తింపు రావడంపై కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ఆదివారం రాత్రి ‘ఈనాడు’తో మాట్లాడుతూ ఈ విషయంలో మార్గ నిర్దేశనం చేసిన ప్రధానమంత్రికి తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ‘రామప్పపై యునెస్కో హెరిటేజ్‌ కమిటీ ఓటింగ్‌ సమయంలో కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షాతో కలిసి కామాఖ్య ఆలయంలో ఉన్నా. యునెస్కో గుర్తింపు వచ్చిన విషయం తెలియగానే అమిత్‌షాకు చెప్పా. చాలా సంతోషపడ్డారు. ఈ విషయంలో ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు మాశాఖ, విదేశాంగశాఖ అధికారులు..వారం రోజులకు పైగా శ్రమించారు. తొలుత యునెస్కో కమిటీ రామప్పకు గుర్తింపు ఇచ్చే విషయాన్ని విభేదించింది. తొలి ప్రతిపాదన సరిగా లేదంటూ పక్కనపెట్టారు. ఈ విషయాన్ని మనదేశం ఛాలెంజ్‌ చేసింది. ప్రతిపాదనల్లో మార్పులుచేర్పులు చేసి ఓటింగ్‌ జరిగేలా చూశాం.’ అని ఆయన పేర్కొన్నారు. ఏఎస్‌ఐ అధికారుల బృందాన్ని అభినందించారు.


రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలించింది: మంత్రులు

తమ ప్రభుత్వ కృషి ఫలించిందని మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, ఎర్రబెల్లి, సత్యవతి, ఇంద్రకరణ్‌రెడ్డిలు పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ప్రజలకు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు ఇది గొప్పకానుక. నిజానికి ఈ గుర్తింపు ఎప్పుడో రావాల్సింది. కేసీఆర్‌ సీఎం అయ్యాక అద్భుతాలు జరుగుతున్నాయి. ప్రపంచ పర్యాటకులు ఈ దేవాలయం సందర్శించడం వల్ల ఆ స్థాయిలో హోటల్‌ పరిశ్రమ, ట్రావెలింగ్‌, గైడింగ్‌ రంగాల్లో యువతకు ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి’’ అని సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషితో రామప్పకు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభించిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. హన్మకొండలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి మంత్రి క్షీరాభిషేకం చేశారు.


కేసీఆర్‌ పట్టుదలతో..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టుదలతో ప్రయత్నించారని 2018లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయడమే కాకుండా రామప్ప చరిత్ర, ప్రాధాన్యం గురించి ఎప్పటికప్పుడు కేంద్రానికి గుర్తుచేయడం వల్ల ఈ ఫలితం దక్కిందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. కాకతీయ వారసత్వ ట్రస్ట్‌ ప్రతినిధులు పాపారావు, పాండురంగారావు తదితరులు ఈ కృషిలో భాగం పంచుకున్నారన్నారు. రామప్పకు వారసత్వ హోదా లక్ష్యంగా పనిచేశామని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. 


తెలంగాణకు కిషన్‌రెడ్డి బహుమతి: బండి సంజయ్‌

రామప్పకు యునెస్కో గుర్తింపు కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా కిషన్‌రెడ్డి తెలంగాణకు ఇచ్చిన తొలి బహుమతి అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేవాలయానికి ప్రపంచ వారసత్వ గుర్తింపుకోసం రావడానికి సభ్యదేశాలతో ఏకాభిప్రాయానికి ప్రధానమంత్రి కృషిచేశారన్నారు.
రాష్ట్ర మంత్రుల ప్రచారం తప్పు: భాజపా
రామప్పకు యునెస్కో గుర్తింపు విషయంలో రాష్ట్ర మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని భాజపా విమర్శించింది. సీఎం కేసీఆర్‌ కృషి వల్లే గుర్తింపు వచ్చిందంటూ మంత్రులు మాట్లాడటం సిగ్గుచేటని, ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని కోరింది. ‘ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కృషి వల్లే రామప్పకు హోదా లభించింది. విదేశాంగమంత్రి జైశంకర్‌ సభ్యదేశాలతో మాట్లాడారు’ అని భాజపా రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డి హర్షం
రామప్ప దేవాలయాన్ని యునెస్కో గుర్తించడం పట్ల పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని