దళితులు ధనికులవ్వాలి

ప్రధానాంశాలు

దళితులు ధనికులవ్వాలి

వారు వ్యాపారవర్గంగా ఎదగాలనేదే నా ఆకాంక్ష

దళితబంధును చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాలి

ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉండే రంగాల్లో రిజర్వేషన్లు

వారి స్వాధీనంలోని గ్రామకంఠాల భూములపై హక్కులు

హుజూరాబాద్‌లో ఇల్లులేని దళిత కుటుంబం ఉండొద్దు

అవగాహన సదస్సులో సీఎం


హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితులకు వంద శాతం ఇళ్ల నిర్మాణం జరగాలి. ఒకవేళ ఖాళీ స్థలం ఉంటే అర్హులకు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. దశలవారీగా దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాం. దళిత వాడల్లో మౌలిక వసతుల కల్పన కోసం వారం, పది రోజుల్లో హుజూరాబాద్‌లో డ్రైవ్‌ చేపడతాం. అసైన్డ్‌ సహా దళితుల అన్నిరకాల భూసమస్యలను పరిష్కరిస్తాం. నియోజకవర్గంలో ఎస్సీ వాడల్లో పర్యటించి.. వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి అధికారులు నివేదిక ఇవ్వాలి. వారికి ప్రభుత్వమే ఉచితంగా వైద్య సాయం అందిస్తుంది.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయాలను అమల్లోకి తెచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం దళితాభివృద్ధి కోసం చేస్తున్న చారిత్రక కృషిలో విద్యావంతులు కదలిరావాలి. తెలంగాణాలో అన్ని పథకాలను చూసి నేర్చుకున్నట్లే.. దళిత బంధును చూసి కూడా ఇతర రాష్ట్రాలు నేర్చుకునే విధంగా మనం పని చేయాలి.

-సీఎం కేసీఆర్‌


ఈనాడు, హైదరాబాద్‌: ఆర్థికంగా పటిష్ఠమైన రోజున ఎస్సీలు వివక్ష నుంచి దూరమవుతారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. దళితబంధు కేవలం కార్యక్రమం కాదని.. ఉద్యమమని చెప్పారు. స్వీయ అభివృద్ధికి ఎస్సీలు పూనుకోవాలని, ప్రభుత్వం సంపూర్ణ సహకారం ఇస్తుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో వారికిష్టమైన ఉపాధి, వ్యాపారాన్ని ఎంచుకుని, తెలంగాణ దళిత సమాజం వ్యాపారవర్గంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉండే రంగాల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. దళితబంధు ద్వారా ఎస్సీలు విజయం సాధించి వెలుగు దివ్వెలు, కరదీపికలుగా మారాలన్నారు. హుజూరాబాద్‌లో ఈ పథకం గెలుపు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. సోమవారం ప్రగతిభవన్‌లో జరిగిన దళితబంధు అవగాహన సదస్సుకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షత వహించి మాట్లాడారు. ‘‘దళితుల స్వాధీనంలో ఉన్న గ్రామ కంఠ భూముల వివరాలను సేకరించి, వారికే హక్కులు కల్పిస్తాం. దళిత వాడల్లో సంపూర్ణస్థాయిలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తాం. ఒక్కడితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం భారత రాజకీయ వ్యవస్థ మీద ఒత్తిడి తెచ్చి... విజయం సాధించి పెట్టింది. ప్రతి విషయంలోనూ ప్రతీప శక్తులు ఎప్పుడూ వుంటాయి. నమ్మిన ధర్మానికి కట్టుబడి మన ప్రయాణాన్ని కొనసాగించినప్పుడే విజయం సాధ్యం. నైపుణ్యం, ప్రతిభ ఉన్న దళిత వర్గాన్ని అంటరానితనం పేరుతో ఊరవతల ఉంచి ఉత్పాదక రంగానికి దూరం చేయడం బాధాకరం. విజయం సాధించాలంటే దళారులు, ప్రతీప శక్తులను దూరంగా ఉంచాలి. దళిత మహిళ మరియమ్మ లాకప్‌ డెత్‌ కేసులో దోషులుగా తేలిన పోలీసులను ఉద్యోగాల్లోంచి శాశ్వతంగా తొలగించాం. 

స్వయంసమృద్ధికి సాయం

రాష్ట్రం ఏర్పాటయ్యాక ఒక్కొక్క వర్గాన్ని బాగు చేసుకుంటూ వస్తున్నాం. అదే పద్ధతిలో దళిత సమాజ అభివృద్ధికి చర్యలు ప్రారంభించాం. ఎస్సీల అభివృద్ధికి యావత్‌ తెలంగాణ సమాజం నుంచి సంపూర్ణ సహకారం లభిస్తోంది. ఎరువుల దుకాణాలు, మెడికల్‌ షాపులు, రైస్‌ మిల్లులు, వైన్‌ షాపులు తదితర ఆర్థిక అభివృద్ధికి అవకాశం ఉండే రంగాల్లో దళితులకు ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పిస్తుంది. వ్యవసాయ యంత్రాలు, ఆటోలు, ట్రాక్టర్లు, కోళ్ల పెంపకం, టెంట్‌ హౌస్‌లు, డెయిరీ పరిశ్రమ, ఆయిల్‌ మిల్లు పిండి మిల్లు, సిమెంట్‌ ఇటుకల తయారీ, భవన నిర్మాణ సామగ్రి షాపులు, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సెల్‌ఫోన్‌ షాపులు, మొబైల్‌ టిఫిన్‌ సెంటర్లు, హోటళ్లు, క్లాత్‌ ఎంపోరియం, ఫర్నిచర్‌ షాప్‌ తదితర ఉపాధి, వ్యాపార రంగాలను గుర్తించి.. వారి ఇష్టాన్ని బట్టి దళితబంధు ద్వారా లబ్ధి దారులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ఎలక్ట్రానిక్‌ బార్‌కోడ్‌తో కూడిన గుర్తింపు కార్డును అందిస్తాం. నిరంతర పర్యవేక్షణ ద్వారా లోటుపాట్లు రాకుండా చూస్తాం. లబ్ధిదారులకు బీమా వర్తింపచేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రైతు బీమా మాదిరి పటిష్ఠ వ్యవస్థను ఏర్పాటుచేసి బీమాను అమలుచేద్దాం.

అన్ని సమస్యల పరిష్కారం..

హుజూరాబాద్‌లో ఇల్లు లేని దళిత కుటుంబం ఉండొద్దు. వందశాతం ఇళ్ల నిర్మాణం జరగాలి. ఆ నియోజకవర్గంలో ఖాళీ జాగాలు వున్న అర్హులకు ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుంది. దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా దళితులకు దీన్ని అమలు చేస్తాం. నియోజకవర్గ దళిత ప్రజల పెండింగ్‌ సమస్యలన్నీ గుర్తించి, వారిని కలెక్టర్‌ కార్యాలయానికి పిలిపించుకొని పరిష్కరించాలి’’ అని సీఎం ఆదేశించారు. సమావేశంలో దళిత సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రభత్వ విప్‌ బాల్కసుమన్‌, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సహపంక్తి భోజనం

దళితబంధు అవగాహన సదస్సు సుమారు 8 గంటలపాటు సాగింది. సదస్సుకు హాజరైన మహిళలు, యువకులు, ఇతర ప్రతినిధులతో కలిసి సీఎం సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిలో ఒక పులిలాంటి శక్తి దాగి ఉంటుందంటూ.. గొర్రెల మందలో పెరిగిన పులి కథను చెప్పారు. పైరవీకారుల మీద రామాయణం కథ చెప్పిన సీఎం వారిని దూరం పెట్టాలనడంతో సభలో నవ్వులు విరిశాయి. పలు సమస్యలను ప్రతినిధులు ప్రస్తావించగా, వాటిని పరిష్కరించాలని అధికారులకు అప్పటికప్పుడే ఆదేశాలిచ్చారు.


ఎస్సీల ఆర్థికాభివృద్ధికి బాటలు

సదస్సుకు హాజరైన ప్రజలు, ప్రజాప్రతినిధుల వెల్లడి

పథకం అమలు, ఆకాంక్షలు అడిగితెలుసుకున్న సీఎం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న దళిత బంధు పథకంపై సోమవారం జరిగిన అవగాహన సదస్సుకు రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. పథకం గురించి వివరించడంతోపాటు ఏమైనా మార్పులు చేయాల్సిన అవసరముంటే సూచించాలని హాజరైన వారిని సీఎం కోరారు. ఒక్కొక్కరి దగ్గరకు వెళ్లి పథకం అమలుపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. లబ్ధిదారులుగా ఏ తరహా ఉపాధి అవకాశాలు పొందాలని భావిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ పథకంపై ఇంట్లో కుటుంబ సభ్యులు చర్చించుకుంటున్నారా? స్వయం ఉపాధి ఎలా పొందాలని భావిస్తున్నారు? తదితర విషయాలపై సీఎం ఆరా తీశారు. హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి వచ్చిన వారితో కలిసి భోజనం చేశారు. దళిత బంధు తెలంగాణ దళితుల పాలిట వరమని హాజరైన ప్రజలు తెలిపారు. పథకాన్ని తొలుత హుజూరాబాద్‌లో అమలు చేయనున్నందుకు ధన్యవాదాలు చెప్పారు. రాజకీయ పార్టీల తరఫున హాజరైన ప్రతినిధులు, ప్రజలు ఈ పథకంపై హర్షం వ్యక్తం చేశారు. దీన్ని వినియోగించుకుని దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

దేశమంతా అమలు చేయాలి: - సీపీఎం నేత వెంకట్‌
అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ అమలు చేయనున్న దళిత బంధు పథకంతో దళితులు అభివృద్ధి చెందుతారు. ఈ విశ్వాసం కలిగాకే సమావేశానికి వచ్చా. తెలంగాణలో విజయం సాధించిన అనంతరం దేశమంతా ఈ తరహా పథకాలను అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తాం. హుజూరాబాద్‌లో దళితులు విజయం సాధించి దేశ దళిత జాతి ఆర్థికాభివృద్ధికి దారులు వేయాలి.

దళితుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు : - సీపీఐ నేత బాలనర్సింహా

ఈ పథకం దళితుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులకు బాటలు వేస్తుంది. గత పాలకులు అరకొర నిధులతో తెచ్చిన పథకాలు దళితుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించలేదు. పైగా తామెంతో చేస్తున్నా సరిగ్గా వినియోగించుకోవడం లేదన్న అపోహలు పెంచాయి. హుజూరాబాద్‌ పైలెట్‌ ప్రాజెక్టు విజయవంతం కాకపోతే ఆ ప్రభావం తెలంగాణతోపాటు దేశం మీద పడుతుంది. దళితులంతా ఈ పథకాన్ని ఓ యజ్ఞంలా భావించి అమలుకు కృషిచేసి దేశానికి దిక్సూచి కావాలి. పట్టుదలతో ఎస్సీల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.

ఆర్థిక, సామాజిక ఆత్మగౌరవం సాధించాలి : - కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న

దళితులకు రూ.10 లక్షలు ఈ పథకం ద్వారా ఇవ్వడం సీఎం మానవీయ నిర్ణయం. అంబేడ్కర్‌ తర్వాత అంతగా దళితుల గురించి ఆలోచన చేస్తోంది సీఎం కేసీఆర్‌. ఈ పథకం దేశంలో విప్లవాత్మక మార్పులకు నాంది అవుతుంది. అణచివేతకు గురైన దళితులు సీఎం అందించే ఆర్థిక సాయంతో.. పదిమందికి ఆదర్శంగా నిలిచి, వివక్షను అధిగమించి ఆర్థిక, సామాజిక ఆత్మ గౌరవం సాధించాలి.

ట్రాక్టర్‌ కొంటాను: - సమ్మయ్య, కిష్టంపల్లి గ్రామం, వీణవంక మండలం

ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నా. దళిత బంధు పథకం కింద అర్హత పొంది ఆర్థిక సహాయం అందితే సొంతంగా ట్రాక్టర్‌ కొనుగోలు చేసి ఉపాధి పొందుతా.

కారు కొనుక్కొని కిరాయికి తిప్పుతా: - దాసర్ల చిరంజీవి, లస్మక్కపల్లి గ్రామం, వీణవంక మండలం

ఈ పథకం కింద లబ్ధి జరిగితే కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న నేను కారు కొనుక్కుంటా. సొంతంగా కిరాయికి తిప్పుతా.

తలెత్తుకొని తిరుగుతారు : - రసమయి బాలకిషన్‌, ఎమ్మెల్యే, సాంస్కృతిక సారథి ఛైర్మన్‌

దళిత బంధు పథకంతో తెలంగాణలోని దళితులు ఆత్మగౌరవంతో తలెత్తుకుని తిరుగుతారు. అణగారిన వర్గాల్లో వెలుగులు నింపే సాహసోపేత పథకం తీసుకువచ్చినందుకు దళిత జాతి తరఫున సీఎంకు కృతజ్ఞతలు. ఇక్కడి దళితుల జీవితాల్లో వెలుగులు నింపే గురుతర బాధ్యత హుజూరాబాద్‌ ప్రయోగ్మాతక ప్రాజెక్టు విజయం మీద ఆధారపడి ఉంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని