లైసెన్స్‌ ఉంది.. డ్రైవింగే తెలియదు

ప్రధానాంశాలు

లైసెన్స్‌ ఉంది.. డ్రైవింగే తెలియదు

వాహన చోదకులకు పోలీసుల పరీక్షలు

సగం మందికి నిబంధనలపై అవగాహన లేదని వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: లైసెన్స్‌ లేకుండా వాహనం నడపటం నేరం. లైసెన్స్‌ ఉండీ వాహనాన్ని ఎలా నడపాలో తెలియకపోవడం ఘోరం. అదే ఇప్పుడు ప్రాణాంతకమవుతోంది. వాహనం నడపడంపై సరైన అవగాహన లేకుండానే రోడ్డెక్కుతున్న వారు ప్రమాదాలకు కారణమవుతున్నారు. రాష్ట్రంలో ఏడాదికి సగటున 20 వేలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా దాదాపు 7 వేల మంది వరకూ మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాహన చోదకులకు డ్రైవింగ్‌పై ఉన్న అవగాహన గురించి తెలుసుకునేందుకు పోలీస్‌ శాఖ నడుం బిగించింది. సైబరాబాద్‌ పోలీసులు ప్రయోగాత్మకంగా రోడ్డు ప్రమాదాలకు కారణమైన వారికి డ్రైవింగ్‌, కంప్యూటర్‌ పరీక్షలు పెడుతున్నారు. 150 మంది వరకూ లైసెన్సు ఉన్నవారికి ఈ పరీక్షలు నిర్వహించగా.. వారిలో దాదాపు సగం మందికి వాహనం నడపడం, రహదారి నిబంధనలు పాటించడం వంటి అంశాలపై కనీస అవగాహన లేదని వెల్లడైంది. రహదారి నిబంధనలు తెలిపే సూచికలను గుర్తుపట్టలేకపోతున్నారని, మలుపు తిప్పేటప్పుడు ఇండికేటర్‌ వేయాలన్న అవగాహన కూడా ఉండటం లేదని వెల్లడైంది. ద్విచక్ర వాహనాలతోపాటు కార్లు నడిపేవారిదీ ఇదే పరిస్థితి. కార్ల చోదకుల్లో ఎక్కువమంది వాహనాన్ని వెనక్కి తిప్పడం, యూటర్న్‌ తీసుకోవడంలో విఫలమవుతున్నారు. వాహన చోదకుల్లో కొందరు పదేళ్ల క్రితమే లైసెన్సు పొంది, అప్పటి నుంచీ వాహనం నడుపుతున్నా డ్రైవింగ్‌పై ప్రాథమిక అవగాహన లేదని తెలటంతో అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమందిని పరీక్షించిన తర్వాత వెల్లడైన ఫలితాలను బట్టి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని భావిస్తున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని