రేషన్‌ కార్డుల పంపిణీ రసాభాస

ప్రధానాంశాలు

రేషన్‌ కార్డుల పంపిణీ రసాభాస

జగదీశ్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి వాగ్వాదం

మంత్రి ప్రసంగిస్తుండగా మైకు లాక్కునేందుకు యత్నించిన ఎమ్మెల్యే

తనకు సమాచారం ఇవ్వలేదని నిరసన

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పురపాలిక పరిధి లక్కారంలో సోమవారం రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాస అయింది. మంత్రి జగదీశ్‌రెడ్డికి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తొలుత రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. తనకు ముందుగా సమాచారం ఇవ్వకుండా తన నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నల్గొండలో నిర్వహించిన కార్యక్రమంలో ఫ్లెక్సీపై ఎమ్మెల్యే ఫొటో పెట్టారని, ఇక్కడెందుకు లేదన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేనని తనపై వివక్ష చూపుతున్నారన్నారు. అనంతరం మంత్రి ప్రసంగిస్తూ.. తెలంగాణ వచ్చాక ఏడేళ్లలో ఆకలి, దారిద్య్రం, ఆత్మహత్యలను రూపుమాపామన్నారు. 2014 జూన్‌కు ముందు రాష్ట్రంలో, జిల్లాలో పరిస్థితి ఎలా ఉండేదో గుర్తుచేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే తన కుర్చీలోంచి లేచి రాజకీయ ప్రసంగం వద్దంటూ అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వకపోతే ఆయన మంత్రి కాలేకపోయేవారన్నారు. కేసీఆర్‌ ఒక్కరే తెలంగాణ తేలేదని.. పార్లమెంట్‌లో ఎంపీగా పోరాడానని, వెంకట్‌రెడ్డి మంత్రి పదవిని త్యాగం చేశారని అన్నారు. మంత్రి చేతిలోంచి మైకు లాక్కునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. జడ్పీ ఛైర్మన్‌ సందీప్‌రెడ్డి, పురపాలిక ఛైర్మన్‌ రాజు తదితరులు ఎమ్మెల్యేను సముదాయించి పక్కకు తీసుకెళ్లారు. మంత్రికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రతిగా తెరాస కార్యకర్తలూ నినాదాలు చేశారు. మంత్రి ఆదేశంతో ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు సమావేశ హాలు నుంచి బయటకు పంపారు. ప్రొటోకాల్‌ పాటించడం లేదని నిరసిస్తూ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. అనంతరం ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ కార్యకర్తలు జాతీయ రహదారిపై కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించారు. దళిత బంధు పథకం కింద అన్ని నియోజకవర్గాలకు రూ.2000 కోట్లు మంజూరు చేయాలంటూ లింగోజీగూడెంలో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

నిధులు తేకుండా నియోజకవర్గానికి వస్తే ఖబడ్దార్‌: రాజగోపాల్‌రెడ్డి

మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకురాకుండా మళ్లీ వస్తే ఖబడ్దార్‌ అని మంత్రి జగదీశ్‌రెడ్డిని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి హెచ్చరించారు. చౌటుప్పల్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హుజూరాబాద్‌కు ముఖ్యమంత్రి రూ.2000 కోట్లిచ్చారని, జిల్లాకు మంత్రి రూ.200 కోట్లైనా తెచ్చారా అని ప్రశ్నించారు.

చిల్లర నాటకాలు వేస్తున్నారు: జగదీశ్‌రెడ్డి

ప్రభుత్వం మంచి పనులు చేయడం ఇష్టం లేక కొందరు అడ్డుకుంటున్నారంటూ మంత్రి జగదీశ్‌రెడ్డి సభలో వ్యాఖ్యానించారు. ప్రచారం కోసం చిల్లర నాటకాలు వద్దన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి మండలానికి, ప్రతి ఊరికి వస్తానన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని