నిండుకుండలా శ్రీశైలం జలాశయం

ప్రధానాంశాలు

నిండుకుండలా శ్రీశైలం జలాశయం

రోజుకు 28 టీఎంసీలు పెరుగుతున్న నిల్వ 

గోదావరి నుంచి సముద్రానికి రోజుకు 8.21 లక్షల క్యూసెక్కులు

ఈనాడు, హైదరాబాద్‌: శ్రీశైలం జలాశయం రోజురోజుకు నిండుకుండలా మారుతోంది. కృష్ణా నది నుంచి వస్తున్న వరదతోపాటు మంగళవారం తుంగభద్ర నది నుంచి కూడా ప్రవాహం రానుంది. దీంతో 4 లక్షల క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలం డ్యాంకి కొనసాగనుంది. సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి జలాశయం పూర్తిస్థాయి మట్టం 885 అడుగులకుగాను 871.80 అడుగుల వద్ద ఉంది. ఆదివారం నుంచి ప్రతి రోజూ దాదాపు 28 టీఎంసీల వరకు నీటి నిల్వ పెరుగుతోంది. బుధవారం ఉదయానికి పూర్తిస్థాయి(ఎఫ్‌ఆర్‌ఎల్‌) మట్టానికి చేరుకోనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుంగభద్ర జలాశయానికి ప్రవాహం కొనసాగుతుండటంతో గేట్లు తెరిచి 1.49 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తుండటంతో అది కూడా తోడుకానుంది. కృష్ణానది ఎగువన ఆలమట్టికి వరద పెరిగింది. జూరాల నుంచి దిగువకు విడుదల కొంత మేరకు తగ్గింది. గోదావరిలో వరద తగ్గడంతో ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల తగ్గింది. ఏపీలోని ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 8.36 లక్షల క్యూసెక్కుల వరద నమోదవుతోంది. ఆనకట్ట గేట్లు తెరిచి రోజుకు 8.21 లక్షల క్యూసెక్కులను సముద్రానికి వదులుతున్నారు.

జులైలోనే జలకళ

శ్రీశైలం జలాశయం ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో నిండిన సందర్భాలే ఎక్కువ. ఆలమట్టి, నారాయణపూర్‌తోపాటు వాటి దిగువన ఉన్న చిన్న డ్యాంలు, జూరాల జలాశయం నిండిన తరవాత శ్రీశైలానికి కృష్ణా జలాలు చేరుకోవాల్సి ఉంటుంది. జులైలో భారీ వరదలు వచ్చినా ఆగస్టు మొదటి వారానికి గానీ శ్రీశైలానికి ప్రవాహం చేరదు. దీనికి భిన్నంగా ఈ ఏడాది కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు జులై మొదటి వారం నుంచే కృష్ణాలో ప్రవాహం పెరిగింది. దీంతో శ్రీశైలానికి జులైలోనే జలకళ వచ్చింది. మరోవైపు తుంగభద్ర నుంచి వరద పెరిగితే బుధవారం నుంచి గురువారం ఉదయంలోపు ఏ సమయంలోనైనా గేట్లు తెరవొచ్చని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని