సింగరేణిలో మళ్లీ విధుల్లోకి విశ్రాంత ఉద్యోగులు

ప్రధానాంశాలు

సింగరేణిలో మళ్లీ విధుల్లోకి విశ్రాంత ఉద్యోగులు

ఈనాడు, హైదరాబాద్‌: అధికారులు, ఉద్యోగుల పదవీవిరమణ వయసును 60 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాల వరకూ పెంచడానికి సింగరేణి సంస్థ ఆమోదం తెలిపింది. సింగరేణిలోనూ పదవీ విరమణ వయసును పెంచాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో సోమవారం నిర్వహించిన బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో అంగీకారం తెలిపినట్టు సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ పేర్కొన్నారు. మార్చి 31వ తేదీ నుంచి దీన్ని అమలు చేయటానికి నిర్ణయించామన్నారు. దీంతో సింగరేణిలో మొత్తం 43,889 మంది అధికారులు, కార్మికులకు లబ్ధి చేకూరనుంది. మార్చి 31 - జూన్‌ 30 నడుమ పదవీవిరమణ చేసిన 39 మంది అధికారులు, 689 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోనున్నారు.దీనిపై సమగ్ర విధివిధానాలను రూపొందించాలని సంబంధిత శాఖల వారిని సీఎండీ ఆదేశించారు. సింగరేణి విద్యాసంస్థల్లోనూ వయోపరిమితి పెంపును అమలు చేయనున్నారు. కారుణ్య ఉద్యోగ నియామకాల్లో విశ్రాంత ఉద్యోగిపై ఆధారపడిన పిల్లలకూ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఉద్యోగ వయోపరిమితికి లోబడి కారుణ్యనియామకాల్లో మార్పులకు బోర్డు ఆమోదం తెలిపింది. సమీపగ్రామాల అభివృద్ధికి ఉద్దేశించిన సామాజిక బాధ్యత కార్యక్రమాల నిర్వహణకు రూ.60కోట్లు వెచ్చించాలని నిర్ణయించారు.

శ్రీరాంపూర్‌ ఏరియా నస్పూర్‌ కాలనీ వద్ద జాతీయ రహదారి విస్తరణలో నిర్వాసితులైన స్థానికులకు సింగరేణి నిర్వాసిత కాలనీలో 85 చదరపు గజాల విస్తీర్ణం గల 201 ప్లాట్లను కేటాయించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని