జలవివాదాలపై కలసి చర్చించుకోవాలి

ప్రధానాంశాలు

జలవివాదాలపై కలసి చర్చించుకోవాలి

తెలుగు రాష్ట్రాలకు తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం హితవు

బోర్డుల పరిధిపై కేంద్రం తీరు సరికాదంటూ వ్యాఖ్య

ఈనాడు హైదరాబాద్‌: జల వివాదాలపై పరస్పర అవగాహనతో ఓ అంగీకారానికి వచ్చేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా వారి ప్రతినిధులు కలిసి చర్చించుకోవాలని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం హితవు పలికింది. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్రం వ్యవహరించిన తీరును అది తప్పుపట్టింది. రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా భావించి కేంద్రం కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులు అన్నింటినీ తమ ఆధీనంలోకి తీసుకొన్నట్లుగా ఉందని వ్యాఖ్యానించింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా వారి ప్రతినిధులు చర్చల ద్వారా వివాదాస్పద అంశాలపై ఓ అంగీకారానికి రావాలని, ట్రైబ్యునల్‌లో తేలేవరకు ఆ విధంగా కొనసాగాలని పేర్కొంది. అలా సాధ్యం కాకపోతే కేంద్ర గెజిట్‌ నోటిఫికేషన్‌పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సోమవారం లేఖ రాసింది. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం సలహాదారులు అనంతరాములు, వెంకటరామారావు.. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దామోదర్‌రెడ్డి, శ్యాంప్రసాద్‌రెడ్డి ఈ లేఖ రాశారు.

అందులోని ముఖ్యాంశాలు...

* బచావత్‌ ట్రైబ్యునల్‌ ప్రాజెక్టులవారీ కేటాయింపులు, యాజమాన్యానికి సంబంధించిన మార్గదర్శకాలు ఇవ్వలేదు. బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పు ఇంకా రాలేదు.

* కృష్ణా బేసిన్‌లో రెండు రాష్ట్రాలు తాత్కాలిక పద్ధతిలో నీటి వినియోగానికి ఏర్పాట్లు చేసుకున్నాయి. ఏడేళ్లుగా కొనసాగుతున్న ఈ విధానాన్ని మార్చాల్సి ఉంది.

* బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పు రాకుండా బోర్డుల పరిధిని నోటిఫై చేయడం న్యాయపరంగా సరికాదు. నీరు రాష్ట్రాల పరిధిలోని అంశం కాగా, చిన్ననీటి వనరులు తప్ప మిగిలిందంతా కేంద్రం తన చేతుల్లోకి తీసుకొంది.

* కృష్ణాలో భాగస్వామ్య రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలను కూడా చేర్చినపుడే కృష్ణా బోర్డు నిర్వహణకు అర్థం ఉంటుంది.

* చెన్నైకి తాగునీటి సరఫరా కోసం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నిర్మించారు. తర్వాత తెలుగుగంగ వచ్చింది. కేసీ కాలువ ఆధునికీకరణతో ఎనిమిది టీఎంసీలు మళ్లించడం, పొలాలకు పెట్టిన నీరు తిరిగి కాలువల్లోకి చేరటం ద్వారా లభించే 11 టీఎంసీలతో శ్రీశైలం కుడిగట్టు కాలువ పథకం చేపట్టారు. చెన్నైకి తాగునీటి సరఫరా, ఎస్సార్బీసీ తప్ప మిగిలినవన్నీ అనధికార ప్రాజెక్టులు, వేరే బేసిన్‌కు నీటిని మళ్లించేవి.

* ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బచావత్‌ ట్రైబ్యునల్‌, బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ కేటాయింపులు లేకుండానే సుమారు 300 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో అనధికార ప్రాజెక్టులు చేపట్టింది. తెలంగాణకు 20 టీఎంసీలు, అది కూడా ఎత్తిపోతల ద్వారా మాత్రమే నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంది.

* గోదావరిపై ఉమ్మడి ప్రాజెక్టులే లేనందున దానికి యాజమాన్య బోర్డే అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు జీతాలు ఇచ్చి మొత్తం ఉద్యోగులను బోర్డుకు అప్పగించడం, అడ్వాన్స్‌గా రూ.200కోట్ల చొప్పున సమకూర్చడం, రాష్ట్రానికి ఎలాంటి అధికారం లేకపోవడం చూస్తే, ఇటీవల నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణకు చేసిన కసరత్తంతా వృథా అవుతుంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని