భారత భూభాగంలో డ్రాగన్‌ గుడారాలు!

ప్రధానాంశాలు

భారత భూభాగంలో డ్రాగన్‌ గుడారాలు!

తిష్ఠవేసిన చైనా ‘పౌరులు’

తూర్పు లద్దాఖ్‌లో కవ్వింపులు

దిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో డ్రాగన్‌ కుటిల కవ్వింపు చర్యలు ఆగటంలేదు. దెమ్‌చోక్‌ వద్ద భారత భూభాగంలో చైనా ‘పౌరులు’ గుడారాలతో తిష్ఠ వేశారు. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి శాంతి పునరుద్ధరణకు ఓ పక్క కోర్‌ కమాండర్ల స్థాయి భేటీకి సన్నాహాలు జరుగుతున్న తరుణంలో ఇలాంటి చర్యలతో పరిస్థితి మళ్లీ వేడెక్కుతోంది.

దెమ్‌చోక్‌లోని చార్‌డింగ్‌ నాలా వద్ద మన భూభాగంలో ఆ గుడారాలు వెలిశాయి. అందులోని వ్యక్తులు చైనా పౌరులుగా చెప్పుకొంటున్నారని భారత అధికారులు తెలిపారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని భారత సైన్యం ఆదేశించినప్పటికీ వారు అక్కడే కొనసాగుతున్నారని చెప్పారు. దెమ్‌చోక్‌ ప్రాంతంలో గతంలోనూ భారత్‌, చైనాల మధ్య ఘర్షణలు జరిగాయి. 1990లలో జరిగిన సంయుక్త కార్యాచరణ బృంద సమావేశాల్లో దెమ్‌చోక్‌, ట్రిగ్‌ హైట్స్‌ ప్రాంతాలను వివాదాస్పదమైనవిగా ఇరు దేశాలు అంగీకరించాయి. ఆ తర్వాత రెండు దేశాలు పరస్పరం మ్యాప్‌లను ఇచ్చిపుచ్చుకున్నప్పుడు ఎల్‌ఏసీ వెంబడి మరో పది ప్రాంతాలనూ వివాదాస్పదమైనవిగా గుర్తించాయి. గత ఏడాది తూర్పు లద్దాఖ్‌లో రెండు దేశాల మధ్య సైనిక ప్రతిష్టంభన ఏర్పడ్డాక మరో ఐదింటిని ఈ విభాగంలో చేర్చారు. వాస్తవానికి తూర్పు లద్దాఖ్‌లో వివాద పరిష్కారానికి సోమవారం ఇరు దేశాల మధ్య 12వ విడత కోర్‌ కమాండర్‌ స్థాయి సమావేశం జరగాల్సి ఉంది. అయితే కార్గిల్‌ యుద్ధ విజయ దినోత్సవ కార్యక్రమాల వల్ల ఈ భేటీని కొద్దిరోజుల పాటు వాయిదా వేయాలని భారత్‌ కోరింది. ఈలోగానే గుడారాలు ప్రత్యక్షం కావడం గమనార్హం. కోర్‌ కమాండర్ల భేటీ ఆగస్టు మొదటి వారంలో గానీ అంతకన్నా ముందుగానీ జరగొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

అంత ఉద్రిక్తత లేదు..

ఉద్రిక్తతలు పెరగడంతో ఇటీవలే భారత సైన్యం తన ఉత్తర కమాండ్‌లోని ఉగ్రవాద వ్యతిరేక దళాలను ఎల్‌ఏసీ వద్దకు తరలించింది. అయినా ఇరుపక్షాలు ముఖాముఖి తలపడేంత ఉద్రిక్తత ప్రస్తుతానికి లేదని భారత అధికారులు చెబుతున్నారు. దౌలత్‌ బేగ్‌ ఓల్డీ, చుషుల్‌ వద్ద ఏర్పాటు చేసిన హాట్‌లైన్ల ద్వారా.. చైనా దళాలతో వివిధ అంశాలపై సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటివరకు 1500 సార్లు ఈ విధంగా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. ఘర్షణకు కేంద్ర బిందువుగా నిలిచిన అన్ని ప్రాంతాల నుంచి మొదట బలగాల ఉపసంహరణ జరగాలని భారత్‌ స్పష్టం చేస్తుండగా.. చైనా మాత్రం తొలుత ఉద్రిక్తతలు చల్లారాలని వాదిస్తోంది. సరిహద్దులకు కాస్త దూరంలో మోహరించిన అదనపు బలగాలు తమ పూర్వ స్థానాలకు వెళ్లిపోవాలని, ఆ తర్వాతే ఘర్షణ ప్రాంతాల్లో మిగిలిన చోట్ల నుంచి ఉపసంహరణ జరుగుతుందని చెబుతోంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని