వారసత్వ సంబురాలు

ప్రధానాంశాలు

వారసత్వ సంబురాలు

రామప్ప ఆలయంలో మంత్రులు, ప్రజాప్రతినిధుల సందడి

సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేస్తామన్న మంత్రి సత్యవతి రాథోడ్‌

ఈనాడు- హైదరాబాద్‌, దిల్లీ; వెంకటాపూర్‌, న్యూస్‌టుడే: ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు పొందిన కాకతీయుల రామప్ప ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ చెప్పారు. పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యేలు సీతక్క, గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి ఛైర్మన్‌ వి.ప్రకాశ్‌రావు, ములుగు, వరంగల్‌ రూరల్‌ జడ్పీ అధ్యక్షులు కుసుమ జగదీశ్వర్‌, గండ్ర జ్యోతి, ములుగు జిల్లా కలెక్టర్‌ కృష్ణఆదిత్య తదితరులతో కలిసి సోమవారం ఆమె రామప్ప ఆలయాన్ని సందర్శించి, రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో కేకు కోసి ఆనందం పంచుకున్నారు. యునెస్కో గుర్తింపుతో రామప్ప ఆలయం రూపురేఖలు మారనున్నాయని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. సుమారు రూ.100 కోట్ల నిధులతో ఆలయానికి నాలుగు వరుసల రహదారి, మ్యూజియం, శిల్పకళా తోరణం, లైటింగ్‌ సిస్టిమ్‌, ప్రత్యేక పార్కింగ్‌ స్థలం, ట్యాంక్‌బండ్‌ తరహాలో చెరువుకట్ట సుందరీకరణ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వివరించారు. ఆలయానికి యునెస్కో గుర్తింపు నేపథ్యంలో పలు ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి ఆలయ పరిసరాల్లో సోమవారం సందడి చేశారు. రామప్ప ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక సంస్థ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా తెలిపారు.

గుర్తింపు వెనుక దశాబ్ద కాలం శ్రమ

ఎన్జీవోస్‌కాలనీ(హన్మకొండ), న్యూస్‌టుడే: రామప్పను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించడానికి దశాబ్ద కాలం శ్రమించాల్సి వచ్చిందని కాకతీయ హెరిటేజ్‌ ట్రస్ట్‌ (కేహెచ్‌టీ) ప్రతినిధులు విశ్రాంత ఐఏఎస్‌ అధికారి జి.వి.పాపారావు, విశ్రాంత ఆచార్యులు ఎం.పాండురంగారావు చెప్పారు. సోమవారం హన్మకొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేహెచ్‌టీ ధర్మకర్త శ్రీధర్‌రావుతో కలిసి వీరు మాట్లాడారు. ‘‘2010లో రామప్పకు యునెస్కో గుర్తింపు కోసం అప్పటి సాంస్కృతికశాఖ మంత్రి గీతారెడ్డి.. కాకతీయ హెరిటేజ్‌ ట్రస్ట్‌ సమన్వయకర్తలుగా మమ్మల్ని ప్రకటించారు.  కాకతీయ కట్టడాల ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రధాని నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్‌తో లేఖ ఇవ్వడం ద్వారా 2019లో యునెస్కోకు నామినేషన్‌ సమర్పించాం’’ అని వివరించారు.  రామప్ప ఘనతపై సమగ్ర సమాచారాన్ని పొందుపరిచి ఎంపిక కమిటీకి అందించినట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖల మాజీ కార్యదర్శి, ప్రస్తుత బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.

లేపాక్షికీ యునెస్కో గుర్తింపు!

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రఖ్యాత లేపాక్షి ఆలయానికీ ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో నుంచి గుర్తింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు చెప్పినట్లు టీజీ వెంకటేష్‌ నేతృత్వంలోని పర్యాటకం, సాంస్కృతిక శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సోమవారం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.

తెలంగాణకు గర్వకారణం: నామా

ఈనాడు, దిల్లీ: తెలంగాణ సాంస్కృతిక, కళా వైభవానికి ప్రతీకైన రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం హోదా దక్కడం గర్వకారణమని తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడంతోనే ఈ ఖ్యాతి దక్కిందని ఎంపీలు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, మాలోత్‌ కవిత, పసునూరి దయాకర్‌, బండా ప్రకాశ్‌, బడుగుల లింగయ్య యాదవ్‌ అన్నారు. దిల్లీలోని తెలంగాణ భవన్‌లో సోమవారం వీరు విలేకరులతో మాట్లాడారు. రామప్ప ఆలయం, సమీప పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నిధులు విడుదల చేయాలని కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని