హరితంతోనే పర్యావరణ హితం

ప్రధానాంశాలు

హరితంతోనే పర్యావరణ హితం

 రామోజీ ఫిల్మ్‌సిటీలో మొక్కలు నాటిన అమితాబ్‌ బచ్చన్‌

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ చేపట్టిన ఎంపీ సంతోష్‌కు ప్రశంసలు

రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యానికి కృషి చేయాలని బాలీవుడ్‌ అగ్ర నటుడు అమితాబ్‌ బచ్చన్‌ పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా అమితాబ్‌ బచ్చన్‌, ప్రముఖ తెలుగు నటుడు నాగార్జున రామోజీ ఫిల్మ్‌సిటీలోని సాహస్‌ ప్రాంగణంలో మంగళవారం మొక్కలు నాటారు. వారికి ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి సాదర స్వాగతం పలికి మొక్కలను బహుమతిగా అందజేశారు. అశ్వినీదత్‌ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్‌లో పాల్గొనేందుకు అమితాబ్‌ బచ్చన్‌ రామోజీ ఫిల్మ్‌సిటీకి విచ్చేశారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలను అమితాబ్‌, నాగార్జునలకు సంతోష్‌కుమార్‌ వివరించారు. భావితరాలకు ఉపయోగపడేలా మంచి కార్యక్రమం చేపట్టారంటూ ఆయనను అమితాబ్‌ ప్రశంసించారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతన్నారు. మొక్కల పెంపకంతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యమని నాగార్జున అన్నారు. సంతోష్‌కుమార్‌ ఉద్యమ స్ఫూర్తితో చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఆదర్శ కార్యక్రమమని అన్నారు. ఇప్పటికే 16 కోట్ల మొక్కలు నాటేందుకు ఆయన తీసుకున్న చొరవను అభినందించారు. పర్యావరణం దెబ్బతినడంతోనే అమెరికా సహా పలు దేశాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, వాతావరణ కాలుష్యం కారణంగా ప్రకృతి వైపరీత్యాలు తీవ్రరూపం దాలుస్తున్నాయన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని అమితాబ్‌, నాగార్జునలు పిలుపునిచ్చారు. వారితో పాటు నిర్మాత అశ్వినీదత్‌కు వృక్షవేదం పుస్తకాలను సంతోష్‌కుమార్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తదితరులు పాల్గొన్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని