కర్ణాటక కొత్త సీఎం... బసవరాజ బొమ్మై

ప్రధానాంశాలు

కర్ణాటక కొత్త సీఎం... బసవరాజ బొమ్మై

 బీజేఎల్‌పీలో ఎన్నిక.. నేడు ప్రమాణస్వీకారం

మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఆర్‌ బొమ్మై కుమారుడే

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: అనూహ్యంగా... ఆశ్చర్యకరంగా... కమలదళంలో సోషలిస్టు సిద్ధాంతకర్త కుటుంబసభ్యుడు ముఖ్యమంత్రి అవుతున్నారు. కన్నడనాట రాజకీయ సంక్షోభానికి ముగింపు పలుకుతూ భాజపా శాసనసభాపక్షం సమావేశం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. బి.ఎస్‌.యడియూరప్ప తర్వాత ముఖ్యమంత్రి పదవికి తాజా మాజీ హోంమంత్రి బసవరాజ బొమ్మై పేరును ప్రతిపాదించింది. కర్ణాటక 20వ ముఖ్యమంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్న బొమ్మై తండ్రి సోమప్ప రాచప్ప బొమ్మై (ఎస్‌.ఆర్‌.బొమ్మై) కూడా గతంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు.  ఆయన సోషలిస్టు ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కోసం మంగళవారం సాయంత్రం నిర్వహించిన భాజపా శాసనసభాపక్ష సమావేశంలో అధిష్ఠానం నుంచి పరిశీలకులుగా వచ్చిన కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్‌ సంయుక్తంగా ఓ ప్రకటన చేశారు. యడియూరప్ప మంత్రివర్గంలో హోం, శాసనసభా వ్యవహారాల మంత్రిగా పనిచేసిన బసవరాజ బొమ్మై పేరు వెల్లడించారు. ఆపై మంగళవారం రాత్రి రాజ్‌భవన్‌కు తరలివెళ్లిన బసవరాజ.. సర్కారు ఏర్పాటుకు అవకాశం కల్పించాలని గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ను కోరారు. బుధవారం ఉదయం 11.00 గంటలకు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంగళవారం శాసనసభాపక్ష సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు అరుణ్‌సింగ్‌, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, ధర్మేంద్రప్రధాన్‌, భాజపా నాయకురాలు డీకే అరుణ, మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్‌.యడియూరప్ప ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

అప్ప సూచన ప్రకారమే..

బసవరాజ బొమ్మై ఎంపికలో మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కీలకపాత్ర పోషించారు. అప్ప అత్యంత ఆప్తుల్లో ఒకరైన బసవరాజ బొమ్మై నాయకత్వాన్ని దాదాపు అందరూ ఆమోదించారు. శాసనసభాపక్ష సమావేశంలో ఆయన పేరును యడియూరప్ప ప్రతిపాదించగా మాజీ ఉపముఖ్యమంత్రి గోవింద కారజోళ ఆమోదించారు. తన పేరు ప్రకటించగానే బసవరాజ స్పందించి.. యడియూరప్ప పాదాలకు నమస్కరించారు. మంగళవారం వరకు దాదాపు పది మంది ఆశావహుల పేర్లు పరిశీలనలో ఉన్నా చివరకు ఈ పేరును అధిష్ఠానం ఖరారుచేసింది. ఇదే సందర్భంగా ముగ్గురు ఉపముఖ్యమంత్రులను నియమించారు. ఆర్‌.అశోక్‌, బి.శ్రీరాములు, గోవింద కారజోళ ఈ పదవులకు ఎంపికయ్యారు. బసవరాజతో పాటు ఆ ముగ్గురూ ప్రమాణస్వీకారం చేయనున్నారు. వీరిలో గోవింద కారజోళ యడియూరప్ప సర్కారులో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.

కర్ణాటకలో భిన్న వ్యూహం

నూతన ముఖ్యమంత్రి నియామకంలో యడియూరప్ప సూచనలను భాజపా ఆమోదించింది. పార్టీకి సంప్రదాయ ఓటుబ్యాంకుగా ఉన్న లింగాయత్‌లను సంతృప్తిపరుస్తూ అదే వర్గానికి చెందిన బసవరాజకు అవకాశం కల్పించింది. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టే ఉత్తర కర్ణాటక ప్రాంతానికి (హావేరి) చెందిన నేతకు అవకాశం కల్పించింది. ఇప్పటికే వందలాది లింగాయత్‌ మఠాధిపతులు లింగాయేతర సముదాయం నుంచి నూతన సీఎంను ఎంపిక చేయరాదని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. భాజపా సీఎంలకు ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం, పార్టీలో సుదీర్ఘ సభ్యత్వం ఉండాలన్న సంప్రదాయాన్ని బసవరాజ ఎంపికలో అధిష్ఠానం పక్కన బెట్టింది.

మాజీ ముఖ్యమంత్రి కుమారుడే..

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎస్‌.ఆర్‌.బొమ్మై కుమారుడు. 1988- 1989లో ఎస్‌.ఆర్‌.బొమ్మై కర్ణాటక సీఎంగా పనిచేశారు. 1960 జనవరి 1న హుబ్బళ్లిలో జన్మించిన బసవరాజ కొన్నాళ్లు జేడీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా, 1996 నుంచి 1997 వరకు నాటి ముఖ్యమంత్రి జె.హెచ్‌.పటేల్‌కు రాజకీయ కార్యదర్శిగా పనిచేశారు. 2005 వరకు రెండుసార్లు విధాన పరిషత్తుకు ఎన్నికయ్యారు. 2006లో భాజపాలోకి చేరిన ఆయన హావేరి జిల్లా శిగ్గాం ఉంచి వరుసగా మూడుసార్లు విధానసభకు ఎన్నికయ్యారు.  61 ఏళ్ల బసవరాజ బసవరాజ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పట్టభద్రుడు. పుణె టెల్కో కంపెనీలో సాంకేతిక సలహాదారుడిగా, సీనియర్‌ కన్సల్టెంట్‌గా పనిచేశారు. నీటిపారుదల రంగంలో విశేష పరిజ్ఞానం ఉంది. 2008లో తొలిసారి విధానసభకు ఎన్నికైన ఆయన.. అదే ఏట ఏర్పాటైన భాజపా సర్కారులో జల వనరులు, 2019లో మళ్లీ ఏర్పాటైన సర్కారులో సహకార, హోం, శాసనసభా వ్యవహారాల మంత్రిగా పనిచేశారు.


ఈ నెల 10నే యడియూరప్ప రాజీనామా!
-  సన్నిహిత నేతతో మోదీకి లేఖ

దిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి బి.ఎస్‌.యడియూరప్ప సోమవారం అధికారికంగా వైదొలిగినా.. వాస్తవానికి అంతకు పక్షం రోజుల ముందే ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం. ఆయన రాజీనామాపై రెండు నెలల క్రితం నుంచే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయన మాత్రం ఎప్పటికప్పుడు వాటిని కొట్టిపారేశారు. కానీ తాజా కథనాల ప్రకారం.. యడియూరప్ప ఈ నెల పదో తేదీనే సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయనతో సన్నిహితంగా ఉండే ఓ సీనియర్‌ నేత అదేరోజు దిల్లీకి వెళ్లి మోదీకి రాజీనామా లేఖను అందజేశారు. అనారోగ్యం కారణంగా వైదొలుగుతున్నట్లు లేఖలో యడ్డీ పేర్కొన్నారు. అయితే మరి కొన్నాళ్లపాటు పదవిలో కొనసాగాలని తర్వాత భావించారు. స్వాతంత్య్ర దిన వేడుకల్లో జాతీయపతాకాన్ని ఆవిష్కరించి, ఆ తర్వాత పదవి నుంచి తప్పుకోవాలనుకున్నారు. ఈ నెల 16న దిల్లీలో మోదీతో సమావేశమైనప్పుడు తన కోరికను తెలిపారు. అక్కడి నుంచి తిరిగొచ్చాక తన రాజీనామా ఊహాగానాలను తోసిపుచ్చారు. అయితే నాటకీయ పరిస్థితుల నడుమ సోమవారం సీఎం పదవి నుంచి తప్పుకొన్నారు.



Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని