పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం

ప్రధానాంశాలు

పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం

మంత్రి కేటీఆర్‌ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: పారిశ్రామిక పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలమని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి సరళతర వ్యాపార నిర్వహణలో ఉత్తమస్థానంలో నిలుస్తోందని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చేవారిని ప్రభుత్వం అన్నివిధాలా ప్రోత్సహిస్తుందని తెలిపారు. మంగళవారం ప్రగతిభవన్‌లో ‘తెలంగాణలో పెట్టుబడిదారులకు మార్గసూచి (ఇన్వెస్టర్‌ గైడ్‌)-2021’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలు, అనుకూల రంగాలు, మౌలిక వసతులు, సౌకర్యాలు, ప్రభుత్వ విధానాలు, వ్యాపార ప్రణాళికలపై సమగ్ర సమాచారంతో ఈ మార్గసూచిని (పింక్‌బుక్‌) రూపొందించాం. వనరులు, నిపుణుల లభ్యత వంటి వివరాలన్నీ ఇందులో ఉంటాయి. సరళతర వ్యాపార నిర్వహణలో ఎప్పుడూ దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉండాలనేది మా లక్ష్యం. దీనికి మార్గసూచి ఎంతగానో ఉపయోగపడుతుంది’’ అని తెలిపారు. దీనిని ఎప్పటికప్పుడు నవీకరిస్తామని పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ తెలిపారు. https://it.telangana.gov.in/wpcontent/uploads/2021/07/PinkBook.pdf వెబ్‌సైట్‌ ద్వారా దీనిని ఆన్‌లైన్‌లో పొందవచ్చని తెలిపారు. సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎలక్ట్రానిక్‌ విభాగం సంచాలకుడు సుజయ్‌ కారంపురి పాల్గొన్నారు.

కేటీఆర్‌తో ఇస్టోనియా రాయబారి భేటీ 

భారత్‌లో ఇస్టోనియా రాయబారి కట్రిన్‌ కివి మంగళవారం మంత్రి కేటీ రామారావుతో ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, పెట్టుబడి అవకాశాలపై చర్చించారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని