నేటి నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ

ప్రధానాంశాలు

నేటి నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ప్రారంభించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ఈ నియోజకవర్గంలోని జమ్మికుంట మార్కెట్‌ యార్డులో బుధవారం ఉదయం 11 గంటలకు పంపిణీ ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావులు కూడా పాల్గొంటారని చెప్పారు. రెండో విడతలో రాష్ట్రంలోని 3.81 లక్షల మంది గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తామని తలసాని వివరించారు. ఇందుకోసం ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.6 వేల కోట్లను మంజూరు చేశారన్నారు. పెరిగిన ధరలు, లబ్ధిదారుల విజ్ఞప్తుల మేరకు గొర్రెల యూనిట్‌ ధర గతంలో రూ.1.25 లక్షలుండగా రూ.1.75 లక్షలకు పెంచేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని చెప్పారు. రాష్ట్రంలోని 8109 సంఘాలలో సభ్యులుగా ఉన్న 7,61,898 మంది గొల్ల, కురుమలకు గొర్రెలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మొదటి విడతలో రూ.5 వేల కోట్లను కేటాయించగా రూ.4702.78 కోట్లతో 3,76,223 యూనిట్ల గొర్రెలను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని