ఫోన్ల నిఘాపై చర్చించాల్సిందే

ప్రధానాంశాలు

ఫోన్ల నిఘాపై చర్చించాల్సిందే

ప్రధాని సమక్షంలో మాట్లాడే అవకాశమివ్వాలి 

సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ అవసరం : విపక్షం

పార్లమెంటులో స్తంభించిన కార్యకలాపాలు

దిల్లీ: దేశంలో పలువురి ఫోన్లపై పెగాసస్‌ స్పైవేర్‌తో నిఘా ఉంచడంపై చర్చకు ప్రతిపక్షం మరింతగా పట్టు బిగించింది. ప్రధాని నరేంద్రమోదీ, లేదా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమక్షంలో పార్లమెంటులో దీనిపై చర్చ జరగాల్సిందేనని స్పష్టం చేసింది. ట్యాపింగ్‌ ఉదంతంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసింది. బుధవారం పార్లమెంటు సమావేశం ఆరంభం కావడానికి ముందు విపక్ష పార్టీల నేతలు కాంగ్రెస్‌ రాజ్యసభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో పార్లమెంట్‌ భవనంలో భేటీ అయ్యారు. దీనికి కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన తదితర 14 పార్టీల నేతలు హాజరయ్యారు. పెగాసస్‌, నూతన సాగు చట్టాలు సహా పలు సమస్యలపై ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయం చర్చించారు. పార్లమెంటులో అంతరాయాలపై నెపాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విపక్షాలపైకి నెడుతున్నారని సమావేశంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. రైతుల అంశాలు, దేశ భద్రత వంటి ప్రజా సంబంధిత సమస్యలనే పార్లమెంట్‌లో తాము ప్రస్తావిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. విపక్ష సభ్యులు రాహుల్‌కు మద్దతు పలికారు. పార్లమెంటులోనూ విపక్షాలు తమ డిమాండును పునరుద్ఘాటించి, సభా కార్యకలాపాలను అడ్డుకున్నాయి.

వాయిదా తీర్మానాలన్నీ తిరస్కరణ

పెగాసస్‌, ఇతర అంశాలపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ బుధవారం గందరగోళ పరిస్థితులు కొనసాగాయి. లోక్‌సభలో కనీసం 10 పార్టీలు, రాజ్యసభలో ఆరు పార్టీలు వాయిదా తీర్మానాలను ప్రతిపాదించగా వాటన్నింటినీ సభాపతులు తిరస్కరించారు. రెండు సభలూ పలుమార్లు స్వల్ప విరామాలతో వాయిదా పడ్డాయి. చర్చ లేకుండానే అనుబంధ పద్దుల బిల్లుల్ని, ద్రవ్య వినిమయ బిల్లుల్ని లోక్‌సభ ఆమోదించింది. ప్రశ్నోత్తరాల సమయం మాత్రం ఎలాంటి వాయిదాలు లేకుండా పూర్తయింది. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాలు ఇలా పూర్తి కావడం ఇదే తొలిసారి. విపక్షాల నిరసనలతో సభ ఐదుసార్లు వాయిదా పడింది. భోజన విరామం తర్వాత తిరిగి సమావేశం కాగానే కాంగ్రెస్‌ సభ్యులు నినాద ఫలకాలను చించి, వాటిని, ఇతర పత్రాలను సభాపతి స్థానం వైపు, అధికార పక్షం వైపు విసిరి నిరసన తెలిపారు. తర్వాత సభ వాయిదాపడింది. తిరిగి సమావేశమైనా అదే గందరగోళం కొనసాగింది. పార్లమెంటు హుందాతనాన్ని విపక్షం దిగజార్చిందని భాజపా విమర్శించింది. ప్రజాస్వామ్య దేవాలయం వంటి సభలో విపక్షం ప్రవర్తన సబబుగా లేదంది. కరోనా మూడో ఉద్ధృతి పొంచి ఉన్న తరుణంలో ‘‘పెగాసస్‌ వంటి కల్పిత అంశాల’’పై పార్లమెంటును స్తంభింపజేయడం తగదని పేర్కొంది. రాజ్యసభలో నిరసనల మధ్యనే ‘బాలల సంరక్షణ (సవరణ) బిల్లు-2021’ని ఆమోదించారు. దీన్ని లోక్‌సభ ఇదివరకే ఆమోదించింది. శూన్యగంట సమయంలో రాజ్యసభ సభ్యులు పలు అంశాలు ప్రస్తావించారు. సభలో నినాద ఫలకాలను అనుమతించేది లేదని ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు స్పష్టంచేశారు. ఏయే ఎంపీలు ఏయే అంశాలు లేవనెత్తాలనుకుంటున్నారో ప్రజలకు తెలియాల్సి ఉందన్నారు. బుధవారం రాజ్యసభ మూడుసార్లు స్వల్ప విరామాలు తీసుకుని, చివరకు గురువారానికి వాయిదా పడింది.

ఈ ధోరణి దేశ వ్యతిరేకం: భాజపా

కరోనాపై చర్చించకపోవడమే దేశ వ్యతిరేకమని భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర విలేకరుల సమావేశంలో చెప్పారు. కుటుంబ ప్రయోజనాల కోసమే విపక్షాలు ఏకతాటిపైకి వచ్చినట్లు ఉందని ఎద్దేవా చేశారు. మోదీ ఎలాంటి రాజకీయ కుటుంబం నుంచి రాలేదని, దేశాభివృద్ధికే ఆయన కట్టుబడి ఉన్నారని చెప్పారు. ఫోన్‌ ట్యాపింగ్‌కు గురైందని రాహుల్‌ భావిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కరోనాపై చర్చకు ప్రత్యేక సమావేశం కోరిన విపక్షాలే ఇప్పుడు సభను స్తంభింపజేస్తున్నాయని విమర్శించారు.


డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదు : రాహుల్‌గాంధీ

విపక్ష నేతల సమావేశానంతరం రాహుల్‌గాంధీ విలేకరులతో మాట్లాడుతూ- పెగాసస్‌పై ప్రతిపక్షమంతా ఏకతాటిపై ఉందని, పార్లమెంటులో చర్చ జరిగే వరకు వదిలిపెట్టేది లేదని స్పష్టంచేశారు. ప్రజా సమస్యలనే పార్లమెంట్‌లో ప్రస్తావిస్తున్నామని, వీటిపై చర్చను కోరుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, పెగాసస్‌, రైతుల సమస్యలపై పార్లమెంట్‌లో చర్చ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. పార్లమెంటులో విపక్షాల గొంతు నొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వం పెగాసస్‌ను కొనుగోలు చేసిందా, లేదా అనేది తేల్చిచెప్పాలి. ప్రధాని మోదీ ఈ ఆయుధాన్ని నాతోపాటు జర్నలిస్టులు, ఇతర నాయకులపై ప్రయోగించారు. ఇంత జరిగినా కేంద్రం ఎందుకు ఈ విషయాన్ని సభలో ప్రస్తావించదు? ఉగ్రవాదులపై వాడాల్సిన ఆయుధాన్ని దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలపై ఎందుకు ప్రయోగించారో మోదీ, అమిత్‌ షా సమాధానం చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు. నిఘా పెట్టడం గోప్యతకు సంబంధించిన విషయం కాదని, అది దేశ వ్యతిరేక చర్య అని చెప్పారు. టి.ఆర్‌.బాలు (డీఎంకే), సంజయ్‌ రౌత్‌ (శివసేన), రామ్‌గోపాల్‌ యాదవ్‌ (సమాజ్‌వాదీ), సుప్రియా సూలే (ఎన్సీపీ) వంటి ఇతర నేతలు మాట్లాడుతూ- పార్లమెంటులో చర్చలు జరగకపోవడంపై ప్రభుత్వం అనవసరంగా ప్రతిపక్షాలను ఆడిపోసుకొంటోందని ఆరోపించారు. తాము చర్చనే కోరుకుంటున్నా ప్రభుత్వం మాత్రం పారిపోతోందని విమర్శించారు.


 Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని