ప్రపంచానికి మనం మార్గదర్శకులం

ప్రధానాంశాలు

ప్రపంచానికి మనం మార్గదర్శకులం

అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ వ్యాఖ్య

కీలక అంశాలపై జైశంకర్‌తో భేటీ

దిల్లీ: ప్రపంచ గతిని నిర్దేశించడంలో భారత్‌-అమెరికా సంబంధాలు అత్యంత కీలకమని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ పేర్కొన్నారు. అందుకే భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి తాము అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. అఫ్గానిస్థాన్‌లో సంక్షోభాన్ని సైనికపరమైన చర్యలతో పరిష్కరించలేమని, శాంతియుత చర్చల ద్వారానే అది సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. భారత పర్యటనకు విచ్చేసిన బ్లింకెన్‌.. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌తో బుధవారం భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు అఫ్గానిస్థాన్‌లో భద్రత పరిస్థితులు, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో కార్యకలాపాలు, కొవిడ్‌ మహమ్మారి తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఇద్దరూ కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కరోనాపై ఇరు దేశాలూ కలిసికట్టుగా పోరాడనున్నట్లు చెప్పారు. మహమ్మారి విజృంభణ ప్రారంభమైన తొలినాళ్లలో తమకు భారత్‌ చేసిన సాయాన్ని ఎన్నటికీ మర్చిపోబోమని బ్లింకెన్‌ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతోనూ ఆయన సమావేశమయ్యారు. భారత్‌లో టీకా పంపిణీ ప్రక్రియకు అండగా నిలిచేందుకు దాదాపు రూ.186 కోట్లు (25 మిలియన్‌ డాలర్లు) అందించనున్నట్లు ట్విటర్‌ వేదికగా బ్లింకెన్‌ ప్రకటించారు. ఇంతకుముందు అందించిన విరాళాలకు ఇవి అదనమని పేర్కొన్నారు.

ప్రపంచంలో భారత్‌-అమెరికా బంధం కంటే ముఖ్యమైన బంధాలు కొన్ని మాత్రమే ఉన్నాయని బ్లింకెన్‌ పేర్కొన్నారు. ప్రధాన ప్రజాస్వామ్య శక్తులుగా.. స్వేచ్ఛ, సమానత్వాలను పరిరక్షించాల్సిన బాధ్యత రెండు దేశాలపైనా ఉందన్నారు. భారత్‌, అమెరికా చర్యలే 21 శతాబ్దంలో, ఆ తర్వాత కూడా ప్రపంచ గతిని నిర్దేశిస్తాయని చెప్పారు. అఫ్గాన్‌లో పరిస్థితులు సైనిక చర్యలతో చక్కబడవని అమెరికా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. తాలిబన్లు, అఫ్గాన్‌ ప్రభుత్వం శాంతియుతంగా చర్చలు జరిపితేనే అక్కడి సంక్షోభం ముగుస్తుందని అభిప్రాయపడ్డారు. అఫ్గాన్‌లో ఏ ప్రభుత్వం ఏర్పడినా దేశ ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించేలా ఉండాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు. అఫ్గాన్‌ స్థిరత్వం, అభివృద్ధి కోసం భారత్‌ ఇప్పటివరకు చాలా కృషి చేసిందని, ఇకముందు కూడా దాన్ని కొనసాగిస్తుందని బ్లింకెన్‌ వ్యాఖ్యానించారు. కొవిడ్‌ కారణంగా తలెత్తుతున్న ప్రయాణ సవాళ్లపై బ్లింకెన్‌తో చర్చించినట్లు జైశంకర్‌ తెలిపారు. స్వతంత్ర, సార్వభౌమ, ప్రజాస్వామ్య, స్థిరత్వంతో కూడిన అఫ్గాన్‌ను ప్రపంచం చూడాలనుకుంటోందని చెప్పారు. ఆ దేశంలోని పరిస్థితులపై కూడా తాము చర్చలు జరిపినట్లు వెల్లడించారు.

డోభాల్‌తోనూ చర్చలు

భారత జాతీయ భద్రత సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ డోభాల్‌తోనూ బ్లింకెన్‌ సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ భేటీలో భద్రత, రక్షణ, సాంకేతికత, ఆర్థిక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతకు సంబంధించి సమకాలీన, భవిష్యత్‌ అంశాలపై తమ అభిప్రాయాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. అఫ్గాన్‌లో పరిస్థితులపైనా చర్చించారు. మరోవైపు- దిల్లీలో పౌర సమాజ సభ్యులతో జరిగిన సమావేశంలో బ్లింకెన్‌ ప్రసంగిస్తూ.. ప్రజాస్వామ్య విలువలకు భారత్‌, అమెరికా అధిక ప్రాధాన్యమిస్తాయని అన్నారు. అదే తమ ద్వైపాక్షిక సంబంధాలకు గట్టి పునాది అని పేర్కొన్నారు. ప్రభుత్వంలో ప్రతిఒక్కరి వాణికి చోటుండాలని నొక్కిచెప్పారు. అందరినీ గౌరవంగా చూడటం, సమాన అవకాశాలు కల్పించడం, మత స్వేచ్ఛ వంటి భావనలను భారత్‌, అమెరికా విశ్వసిస్తాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి, అంతర్జాతీయ స్వేచ్ఛకు ప్రస్తుతం సవాళ్లు ఎదురవుతున్నాయని వ్యాఖ్యానించారు. పరోక్షంగా చైనాను ఉద్దేశించి ఈ వ్యాఖ్య చేసినట్లు తెలుస్తోంది. దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో బ్లింకెన్‌ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఆగస్టు చివరికల్లా 68 వేలమంది భారతీయ విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గత కొన్నేళ్లలో ఎప్పుడూ ఇంత అధిక స్థాయిలో ఇంటర్వ్యూలు జరగలేదని గుర్తుచేశారు.

దలైలామా ప్రతినిధితో భేటీ

టిబెట్‌ ఆధ్యాత్మిక వేత్త దలైలామా సీనియర్‌ ప్రతినిధి ఎంగోడుప్‌ డోంగ్‌చుంగ్‌తో దిల్లీలో బ్లింకెన్‌ బుధవారం భేటీ కావడం చర్చనీయాంశమైంది. టిబెట్‌కు మద్దతు కొనసాగిస్తున్నందుకుగాను ఈ సమావేశంలో అమెరికాకు డోంగ్‌చుంగ్‌ కృతజ్ఞతలు తెలిపారు. వీరి భేటీ చైనాకు ఆగ్రహం తెప్పించే అవకాశముంది. టిబెట్‌కు బైడెన్‌ ప్రభుత్వం అండగా నిలుస్తుందని డ్రాగన్‌కు స్పష్టమైన సందేశమిచ్చేందుకే దలైలామా ప్రతినిధితో బ్లింకెన్‌ సమావేశమయ్యారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు- ప్రజాస్వామ్యానికి ప్రస్తుతం సవాళ్లు ఎదురవుతున్నాయంటూ బ్లింకెన్‌ చేసిన వ్యాఖ్యలను చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్‌ విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలుగా చెప్పుకొంటున్న దేశాల్లో జాతి వివక్ష వంటి అనేక సమస్యలు ఉన్నాయని ఎద్దేవా చేశారు.

బైడెన్‌ నిబద్ధతను స్వాగతిస్తున్నా: మోదీ

భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ బలమైన నిబద్ధతను కలిగి ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజాస్వామ్య విలువలే అందుకు ఊతమిస్తున్నాయని పేర్కొన్నారు. ఆయన చూపిస్తున్న నిబద్ధతను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌తో భేటీ అనంతరం మోదీ ఈ మేరకు ట్వీట్‌ చేశారు. మరోవైపు- బైడెన్‌, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లకు మోదీ శుభాకాంక్షలు తెలిపారని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. కొవిడ్‌పై పోరు, క్వాడ్‌, పర్యావరణ మార్పులకు సంబంధించి వారు చేపట్టిన చర్యలను అభినందించినట్లు వెల్లడించింది.




Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని