నీటిని మళ్లించకుండా ఏపీని నిరోధించండి

ప్రధానాంశాలు

నీటిని మళ్లించకుండా ఏపీని నిరోధించండి

కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ

ఈనాడు హైదరాబాద్‌: కృష్ణాబేసిన్‌లోని అవసరాలు పూర్తిగా తీరే వరకు పక్కబేసిన్‌కు నీటిని మళ్లించకుండా ఆంధ్రప్రదేశ్‌ను నిరోధించాలని, ప్రస్తుత నీటి సంవత్సరంలో 50:50 నిష్పత్తిలో నీటిని వినియోగించుకొనే పద్ధతిని పాటించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు లేఖ రాశారు. శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తికి అనుమతించాలంటూ ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా బోర్డుకు లేఖ రాయగా, దీనిపై బోర్డు తెలంగాణ అభిప్రాయం కోరింది. ఈ నేపథ్యంలో ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఈ లేఖ రాశారు. ‘‘విద్యుదుత్పత్తికి ఆంధ్రప్రదేశ్‌కు అనుమతి ఇవ్వండి కానీ పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదలకు త్రిసభ్య కమిటీ ఆమోదం తర్వాతనే అనుమతి ఇవ్వాలి. శ్రీశైలం జల విద్యుత్తు ప్రాజెక్టు. హైదరాబాద్‌ తాగునీరు, నాగార్జునసాగర్‌ ఆయకట్టు అవసరాలకు తగ్గట్లుగా గత కొన్ని రోజులుగా తెలంగాణ శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేపట్టింది. బచావత్‌ ట్రైబ్యునల్‌ శ్రీశైలంను జల విద్యుత్తు ప్రాజెక్టుగానే పేర్కొంటూ నాగార్జునసాగర్‌, కృష్ణాడెల్టా అవసరాలకు తగ్గట్లుగా నీటిని విడుదల చేయాలని పేర్కొంది. కృష్ణా డెల్టా అవసరాలకు గోదావరి నీటిని మళ్లిస్తున్నారు. నాగార్జునసాగర్‌ అవసరాలకు శ్రీశైలం నుంచి 265 టీఎంసీలు, శ్రీశైలం-నాగార్జునసాగర్‌ల మధ్య లభించే 15 టీఎంసీలు కలిపి మొత్తం 280 టీఎంసీలు అవసరం.

అది తాత్కాలిక ఒప్పందమే 

బచావత్‌ ట్రైబ్యునల్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 75 శాతం నీటి లభ్యత కింద 811 టీఎంసీలను గుంపగుత్తగా కేటాయించడంతోపాటు మిగులు జలాలను వినియోగించుకొనే స్వేచ్ఛను ఇచ్చింది. సుప్రీం కోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం కూడా బచావత్‌ ట్రైబ్యునల్‌ చేసింది గుంపగుత్తగా తప్ప ప్రాజెక్టులవారీగా కాదని పేర్కొంది. పునర్విభజన చట్టంలోని సెక్షన్‌-89 ప్రకారం కృష్ణా ట్రైబ్యునల్‌-2 ప్రాజెక్టుల వారీ కేటాయింపులు చేయాల్సి ఉంది. 2016 జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలు వినియోగించుకొనేలా తాత్కాలిక ఏర్పాటు జరిగింది. తర్వాత 2017లో చిన్ననీటి వనరులు, గోదావరి నుంచి మళ్లించే నీరు, ఆవిరయ్యే నీటిని మినహాయించి ఆంధ్ర 66 శాతం, తెలంగాణ 34 శాతం వినియోగించుకొనేలా సవరణ జరిగింది. 2021-22వ సంవత్సరం నుంచి కృష్ణా ట్రైబ్యునల్‌-2 నిర్ణయం వచ్చేవరకు 50:50 నిష్పత్తిలో నీటి వినియోగమే తెలంగాణకు అంగీకారం.

శ్రీశైలం నుంచి పక్కబేసిన్‌కు బచావత్‌ ట్రైబ్యునల్‌ నీటిని కేటాయించలేదు. చెన్నైకు 15 టీఎంసీల నీటిని సరఫరా చేసే పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అనేక ప్రాజెక్టులు చేపట్టింది. సమీకృత జల వనరుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్‌ 1999లో ఇచ్చిన నివేదికలో కూడా బేసిన్‌ అవసరాలు తీరాక మిగులు ఉంటేనే పక్క బేసిన్‌కు మళ్లించాలని సూచించింది. రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో కృష్ణా నీటిని పక్కబేసిన్‌కు మళ్లించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బేసిన్‌ అవసరాలు పూర్తిగా తీరే వరకు పక్కకు మళ్లించకుండా నిరోధించాలి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ నిండి గేట్లు ఎత్తాకే వదిలేందుకు అనుమతించాలి’’ అని కృష్ణా బోర్డుకు రాసిన లేఖలో తెలంగాణ కోరింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని