ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల వర్గీకరణ షురూ

ప్రధానాంశాలు

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల వర్గీకరణ షురూ

మలి దశలో నిబంధనల మేరకు ఉన్నవి గుర్తింపు
క్షేత్ర స్థాయి సిబ్బందికి దరఖాస్తుల వివరాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో లేఅవుట్‌ల క్రమబద్ధీకరణ దరఖాస్తుల్లో నిబంధనలకు అనుగుణంగా ఉన్నవాటిని గుర్తించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడే ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ముందస్తు ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల్లో లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకంలో వచ్చిన 25.59 లక్షల దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించనున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అవకాశం కల్పించింది. దరఖాస్తుల స్వీకరణ అనంతరం ఎల్‌ఆర్‌ఎస్‌ అంశం కోర్టులకు చేరడంతో ఈ ప్రక్రియ ఆరు నెలలుగా నిలిచిపోయింది. తాజాగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల్లో నిబంధనలకు అనుగుణంగా ఉండి, క్రమబద్ధీకరణకు అవకాశం ఉన్నవాటిని గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

మొదటి దశలో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను వర్గీకరణ (క్లస్టరింగ్‌) చేయాలని రెండో దశలో లేఅవుట్‌ల క్షేత్ర స్థాయి పరిశీలన చేసి నిబంధనలు అనుగుణంగా ఉన్నవాటిని గుర్తించాలని అందులో పేర్కొన్నారు. ఈ ప్రక్రియ కోసం రెవెన్యూ, పంచాయతీ రాజ్‌, నీటిపారుదలశాఖ, పట్టణ ప్రణాళిక అధికారులతో బృందాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. బృందాలు పరిశీలించిన అనంతరం రిమార్క్‌లతో నివేదికలను కలెక్టర్లు, పురపాలక కమిషనర్లకు అందచేయాల్సి ఉంటుంది. 15 రోజుల్లో దీన్ని పూర్తి చేయాలని ఆదేశించగా ప్రస్తుతం తొలి దశ ప్రక్రియ మొదలైంది. సాధ్యమైనంత త్వరగా దీన్ని పూర్తి చేయాలని పురపాలక, పంచాయతీరాజ్‌శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అత్యంత ప్రాధాన్య కార్యక్రమంగా దీన్ని చేపట్టాలని అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు వారి వారి పరిధిలోని వాటిని వర్గీకరణ చేయడానికి వీలుగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల వివరాలను అందచేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని