పార్లమెంట్‌లో తెలంగాణ సమాచారం

ప్రధానాంశాలు

పార్లమెంట్‌లో తెలంగాణ సమాచారం

 

చట్టం చేశాకే తెలంగాణ గిరిజన వర్సిటీ ఏర్పాటు: కేంద్రం

ఈనాడు, దిల్లీ: పార్లమెంటులో చట్టం చేసిన తర్వాతే తెలంగాణ గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభమవుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పష్టం చేశారు. గురువారం రాజ్యసభలో తెరాస సభ్యుడు బండ ప్రకాశ్‌ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం గురించి చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే అది పార్లమెంటులో చట్టం చేసిన తర్వాతే ప్రారంభమవుతుందన్నారు.

స్మార్ట్‌ సిటీల్లో రూ.645 కోట్ల పనులు పూర్తి

తెలంగాణ నుంచి స్మార్ట్‌ సిటీ పథకం కింద ఎంపికైన గ్రేటర్‌ వరంగల్‌, కరీంనగర్‌లలో ఇప్పటివరకూ రూ.645.09 కోట్ల విలువైన 20 ప్రాజెక్టులు పూర్తయినట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయమంత్రి కౌశల్‌ కిశోర్‌ తెలిపారు. గురువారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. వరంగల్‌లో రూ.579 కోట్లు, కరీంనగర్‌లో రూ.65 కోట్ల పనులు పూర్తయినట్లు వివరించారు. ఈ నగరాలకు కేటాయించిన మొత్తం పనులు జరిగితే రూ.2,068 కోట్ల విలువైన పనులు పూర్తవుతాయని చెప్పారు.

తెలంగాణలో 10 జిల్లాల్లో ఫ్లోరైడ్‌ ప్రభావం

తెలంగాణలోని 10 జిల్లాల్లోని భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్‌ మోతాదుకు మించి ఉన్నట్లు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తెలిపారు. ఆయన గురువారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఈ జిల్లాల్లో ఫ్లోరైడ్‌ లీటర్‌కు 1.5మిల్లీగ్రాములకు మించి ఉన్నట్లు చెప్పారు. అలాగే 8 జిల్లాల్లో లవణం, 10 జిల్లాల్లో నైట్రేట్‌, 1 జిల్లాలో ఆర్సెనిక్‌, 8 జిల్లాల్లో ఐరన్‌, 2 జిల్లాల్లో లెడ్‌, 1 జిల్లాలో కాడ్మియమ్‌, 1 జిల్లాలో క్రోమియం ప్రభావం ఉన్నట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో 25,836 సెల్‌ఫోన్‌ టవర్లు

దేశవ్యాప్తంగా 6,63,411 సెల్‌ఫోన్‌ టవర్లు ఉండగా తెలంగాణలో 25,836 ఉన్నాయని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి దేవుసిన్హా చౌహాన్‌ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన టవర్లపై తెలంగాణలో 2019-20లో రూ.20 లక్షలు, 2020-21లో రూ.47.80 లక్షల జరిమానా విధించినట్లు చెప్పారు.

పీవోల్లో రూ.347 కోట్ల అన్‌ క్లెయిమ్డ్‌ డిపాజిట్లు

ఈ ఏడాది మార్చి నాటికి తెలంగాణలోని 5,794 పోస్టాఫీసు(పీవో)ల్లో  93.04లక్షల ఖాతాలు ఉన్నాయని కేంద్ర మంత్రి దేవుసిన్హా చౌహాన్‌ తెలిపారు. మొత్తం 5,33,959 ఖాతాల్లో రూ.347 కోట్ల అన్‌ క్లెయిమ్డ్‌ డిపాజిట్లు ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో కలిపి 2.46 కోట్ల ఖాతాల్లో రూ.16,136కోట్ల అన్‌క్లెయిమ్డ్‌ మొత్తం ఉన్నట్లు వెల్లడించారు.


దివ్యాంగుల ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటుకు పోరాడాలి : ఏఐడీహెచ్‌

ఈనాడు, దిల్లీ: దివ్యాంగుల ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటుకు పోరాడాలని తెరాస, తెదేపా లోక్‌సభ పక్ష నేతలు నామా నాగేశ్వరావు, కె.రామ్మోహన్‌నాయుడులకు అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక (ఏఐడీహెచ్‌) జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. దిల్లీలో లోక్‌సభాపక్ష నేతలను గురువారం ఆయన కలిశారు. మహిళలు, మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలకు కమిషన్‌ ఏర్పాటు చేసినట్లుగానే దివ్యాంగులకు ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని వారిని కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని