గట్టి ఘన పదార్థాల్లోనూ పగుళ్లు మాయం

ప్రధానాంశాలు

గట్టి ఘన పదార్థాల్లోనూ పగుళ్లు మాయం

పీజో ఎలక్ట్రికల్‌ మాలిక్యూల్‌ క్రిస్టల్‌ను కనుగొన్న శాస్త్రవేత్తలు
పరిశోధకుల బృందానికి మహబూబ్‌నగర్‌ జిల్లా వాసి నేతృత్వం

ఈటీవీ, మహబూబ్‌నగర్‌: గట్టి ఘన పదార్థాలూ వాటంతట అవే మరమ్మతు చేసుకునే స్ఫటికం (క్రిస్టల్‌)ను కోల్‌కతాలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ అఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ రసాయన, భౌతిక శాస్త్ర విభాగ ఆచార్యులు, ఐఐటీ ఖరగ్‌పుర్‌ నిపుణులు కనుగొన్నారు. ఈ బృందానికి మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూరు మండలం కొత్తమొల్గరకు చెందిన ఐఐఎస్‌ఈఆర్‌ రసాయన శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్‌ చిల్ల మల్లారెడ్డి నేతృత్వం వహించారు. యంత్ర పరికరాల్లో వాడే పీజో ఎలక్ట్రికల్‌ మాలిక్యూల్‌ క్రిస్టల్‌ను పగుళ్లు వచ్చినప్పుడు దానంతటదే మరమ్మతు చేసుకునేలా రూపొందించారు. ఈ పరిశోధన అమెరికన్‌ జర్నల్‌ ‘సైన్స్‌’లో ప్రచురితమైంది. ఈ సందర్భంగా మల్లారెడ్డి ‘ఈటీవీ’తో మాట్లాడుతూ.. సాధారణంగా ఘన పదార్థాలను వేడిచేయడం ద్వారా లేక వేరే పదార్థాలతో అతికిస్తామన్నారు. గట్టి ఘన పదార్థాల్లో అణువులు దృఢంగా అమర్చి ఉంటాయని, వాటి మధ్య పగుళ్లొస్తే అతికించడం కష్టమని చెప్పారు. తాము రూపొందించిన స్ఫటికం ద్వారా గట్టి ఘన పదార్థాల్లోనూ సెల్ఫ్‌ హీలింగ్‌ (వాటంతట అవే మరమ్మతు చేసుకోవడం) సాధ్యమవుతుందని కనుగొన్నామని చెప్పారు. ఈ స్ఫటికాలను మైక్రో డివైజెస్‌, యాంత్రిక తాడనంతో విద్యుత్‌ ఉత్పత్తి చేసే పరికరాల్లో వినియోగించవచ్చని తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని