6 నెలల్లో పూర్తి... 1000 మందికి ఉపాధి

ప్రధానాంశాలు

6 నెలల్లో పూర్తి... 1000 మందికి ఉపాధి

పెద్దూరు అపెరల్‌ పార్కులో గోకుల్‌దాస్‌ గార్మెంట్‌ పరిశ్రమకు మంత్రి కేటీఆర్‌ భూమి పూజ

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: రాష్ట్రంలో చేనేత, జౌళిరంగాల విస్తరణకు అవకాశాలున్నాయని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. రైతులకు మద్దతు ధర, యువకులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో చేనేత, జౌళిశాఖ తెలంగాణ టెక్స్‌టైల్‌, అపెరల్‌ పాలసీ(టి-ట్యాప్‌)ని తీసుకొచ్చినట్లు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు అపెరల్‌ పార్కులో శుక్రవారం గోకుల్‌దాస్‌ గార్మెంట్‌ పరిశ్రమ భూమిపూజ కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొని మాట్లాడారు. దేశంలో గుజరాత్‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో సాగైన పత్తి కంటే తెలంగాణలోని పత్తి నాణ్యమైందని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో టెక్స్‌టైల్‌ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు జాతీయ, అంతర్జాతీయస్థాయిలోని ప్రముఖ టెక్స్‌టైల్‌ సంస్థలతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. గద్వాల, నారాయణపేట, పోచంపల్లిలో మరిన్ని కంపెనీలు పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

సిద్ధంగా మరో మూడు పరిశ్రమలు

ఐటీ సంస్థల మాదిరిగానే చేనేత, జౌళిశాఖలో పరిశ్రమల స్థాపనకు ప్లగ్‌ అండ్‌ ప్లే విధానం తీసుకొచ్చినట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సుమారు 60వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.23.58 కోట్ల వ్యయంతో గోకుల్‌దాస్‌ గార్మెంట్‌ పరిశ్రమను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆరు నెలల్లో నిర్మాణం పూర్తిచేసుకుని.. స్థానికంగా వెయ్యిమందికి ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో 80 శాతం మహిళలకే అవకాశం ఉంటుందన్నారు. ఇక్కడ మరో మూడు పరిశ్రమలు స్థాపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని