రేపు మంత్రిమండలి భేటీ

ప్రధానాంశాలు

రేపు మంత్రిమండలి భేటీ

ఉద్యోగ ఖాళీలు, కృష్ణా, గోదావరి బోర్డులపైనా చర్చ

చేనేత, దళిత బీమా సహా 27 అంశాలతో ఎజెండా

ఈనాడు, హైదరాబాద్‌: దళితబంధు, ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ, కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌, కరోనా తదితర 27 అంశాలతో కూడిన ఎజెండాతో ఆదివారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. గత నెల 27న ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి అధ్యక్షతన దళితబంధు పథకంపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో వచ్చిన సూచనలు, సలహాలకు తోడు ఇతరత్రా ఆలోచనల మేరకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. దీనిని మొదటగా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అమలు చేస్తామని సీఎం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి పదేసి లక్షల చొప్పున 15 వేల నుంచి 20 వేల దళిత కుటుంబాలకు సాయం అందిస్తామని తెలిపారు. దీనికి రూ. 2,000 కోట్లు కేటాయించారు. వీటికి మంత్రిమండలి అనుమతినివ్వనుంది. పథకం మార్గదర్శకాలను సైతం ఖరారు చేయనున్నారు. రైతు బీమా తరహాలో చేనేత బీమా, దళిత బీమాను అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి మంత్రిమండలి ఆమోదం అవసరం.

రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలపై గత మంత్రిమండలి సమావేశంలో చర్చించినా, జాబితాలు సరిగా లేకపోవడంతో సమగ్ర వివరాలతో మళ్లీ ఇవ్వాలని మంత్రిమండలి సూచించింది. ప్రభుత్వం వాటిని మంత్రిమండలికి సమర్పించనుంది. దానిపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. రామప్పగుడికి ఇటీవలే యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా ఎంపికైంది. ఆ ప్రాంతాన్ని పెద్దఎత్తున అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు మంత్రిమండలి అంగీకారం తెలపనుంది. కరోనా మూడో దశపైనా కేబినెట్‌ చర్చించనుంది. కేరళ తదితర రాష్ట్రాల్లో తలెత్తిన పరిణామాల దృష్ట్యా రాష్ట్రంలో అప్రమత్తత గురించి నిర్దేశించనుంది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని కేంద్ర ప్రభుత్వం ఖరారు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. మంత్రిమండలిలో దీనిపై చర్చించే వీలున్నట్లు తెలిసింది. వర్షాలు, వరదల నియంత్రణకు ప్రత్యేక బృందం ఏర్పాటు, వానాకాలం సీజన్‌లో సాగునీటి సరఫరా తదితర అంశాలపైనా కేబినెట్‌లో చర్చించనున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని