రెండోదశ ఉద్ధృతి పూర్తిగా తగ్గలేదు

ప్రధానాంశాలు

రెండోదశ ఉద్ధృతి పూర్తిగా తగ్గలేదు

9 జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో ఎక్కువగా కొవిడ్‌ కేసులు

  వ్యాక్సిన్‌ వేసుకున్న వారికే హోటళ్లు, మాల్స్‌లోకి అనుమతి!

  రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాసరావు

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ రెండో దశ ఇంకా పూర్తిగా తగ్గలేదని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ సంచాలకుడు (డీహెచ్‌) డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. భవిష్యత్తులో హోటళ్లు, మాల్స్‌లోకి వ్యాక్సిన్‌ వేసుకున్న వారినే అనుమతించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. డెల్టా వేరియంట్‌ ప్రమాదకరమని, బయటే కాకుండా ఇంట్లో ఉన్న సమయంలోనూ మాస్క్‌ ధరించాలని ప్రజలకు సూచించారు. కోఠిలోని వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్‌ శ్రీనివాసరావు మాట్లాడారు. రాష్ట్రంలోని ఖమ్మం, నల్గొండ, కరీంనగర్‌, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, మంచిర్యాల, పెద్దపల్లి, కుమురం భీం, మహబూబాబాద్‌ జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదవుతున్నాయన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారిలో కొందరు బయట తిరుగుతున్నారని, ఈ కారణంగానే కేసులు పెరుగుతున్నాయని శ్రీనివాస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఒకేసారి భారీగా కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారత్‌ సహా 135 దేశాల్లో డెల్టా వేరియంట్‌ ప్రభావం చూపించిందన్నారు. రాష్ట్రంలో నమోదైన రెండు డెల్టా ప్లస్‌ కేసులు హైదరాబాద్‌లోనే మే నెలలో నమోదయ్యాయని, వారిద్దరూ ఇప్పుడు కోలుకున్నారని ఆయన చెప్పారు. కొవిడ్‌ మూడో దశను ఎదుర్కొనేందుకు వైద్యఆరోగ్యశాఖ సన్నద్ధం అవుతోందని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 26 వేల ఆక్సిజన్‌ పడకలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. వంద పడకలకు పైగా ఉన్న ప్రైవేట్‌ ఆసుపత్రులు ఆగస్టు నెలాఖరు నాటికి ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని డీహెచ్‌ స్పష్టం చేశారు.

రెండో డోసుకు ప్రాధాన్యం

రాష్ట్రంలో 1.12 కోట్ల మందికి వ్యాక్సిన్‌ మొదటి డోసు ఇచ్చినట్లు డీహెచ్‌ శ్రీనివాస్‌రావు తెలిపారు. తొలి డోసు తీసుకున్న వారిలో 30 శాతం మందికి రెండో డోసూ ఇచ్చామన్నారు. ‘జులైలో రాష్ట్రానికి 30.04 లక్షల డోసులు వచ్చాయి. కేటాయించినదానికంటే ఇది 9.5 లక్షలు ఎక్కువ. కొవిషీల్డ్‌ 22.32 లక్షల మందికి రెండో డోసు ఇవ్వాల్సి ఉంటే అందులో 12 లక్షల మందికి ఇచ్చాం. కొవాగ్జిన్‌ రెండో డోసు 3 లక్షల మందికిపైగా ఇవ్వాల్సి ఉంది’ అని వివరించారు. వచ్చే ఒకటీరెండు వారాల పాటు రెండో డోసు టీకాలకే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు డీహెచ్‌ తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని